బుధవారం 21 అక్టోబర్ 2020
Jagityal - Sep 21, 2020 , 02:55:46

కార్మికులకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

కార్మికులకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

జగిత్యాల రూరల్‌ :  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కార్మికులకు అండగా నిలుస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. జౌట్‌ సోర్సింగ్‌ కార్మికుల సమస్యలపై శాసన సభలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ విన్నవించడంతో సంబంధిత మంత్రి సానుకూలంగా స్పందించారు. దీంతో శనివారం జగిత్యాల ఏరియా దవాఖాన ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల ఏరియా దవాఖానతో తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. ఎంతో మంది నిరుపేదలకు సహాయసహకారాలను అందించానన్నారు. మాజీఎంపీ కల్వకుంట్ల కవిత సహకారంతో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక ప్రభుత్వ దవాఖానల్లో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి జీతాలు పెంచడమే కాకుండా సిబ్బందిని సైతం పెంచారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటల మనిషి కాదని చేతల మనిషని, కార్మికుల సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతారని చెప్పారు. కార్యక్రమంలో దవాఖాన ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

ఎమ్మెల్యేను కలిసిన ఆర్టీఏ జిల్లా డైరెక్టర్‌ 

  రోడ్డు ట్రాన్స్‌పోర్టు అథారిటీ (ఆర్టీఏ) జగిత్యాల జిల్లా డైరెక్టర్‌గా నూతనంగా ఎన్నికైన మాదాడి సుధాకర్‌రావు ఆదివారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్‌, ఏఎంసీ చైర్మన్‌ కొలుగూరి దామోదర్‌రావు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దావ సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు. logo