శుక్రవారం 30 అక్టోబర్ 2020
Jagityal - Sep 20, 2020 , 03:00:35

ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు

ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు

  • మంత్రి కొప్పుల ఈశ్వర్‌
  • టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం

ధర్మపురి: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరేలా చూడాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో శనివారం వెల్గటూర్‌ మండలానికి చెంది న ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశమై, మాట్లాడారు. ప్రజల అవసరాలు తీర్చడంలో కార్యకర్తలు ప్రభుత్వ పక్షాన సైనికుల్లా పని చేయాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి దాదాపు రూ.1,500కోట్లు మంజూరయ్యాయని, చాలా పనులు పూర్తి కాగా, మిగతావి ప్రగతిలో ఉన్నట్లు చెప్పారు. మండల కేంద్రంలో 20ఎకరాల స్థలంలో నివాసముంటున్న 363మందికి అడంగల్‌ పహాణీ పట్టాలు పంపిణీ చేశామని గుర్తుచేశారు. కాళేశ్వరం లింక్‌-2లో భాగంగా వెల్గటూర్‌, రాజక్కపల్లి గ్రామాల్లో ఈత తాటి చెట్లు కోల్పోతున్న గీత కార్మికులకు పరిహారం కింద నాలుగెకరాల భూమిని అందజేశామని తెలిపారు. రోడ్ల విస్తరణకు రూ.3.32కోట్లు వెచ్చించామన్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా వెల్గటూర్‌ పెద్ద చెరువును నింపేందుకు రూ.30కోట్లు మంజూరు చేశామని, త్వరలో పనులు ప్రారంభి స్తామని తెలిపారు. కోటిలింగాలను ఎంతగానో అభివృద్ధి చేశామని, రూ.3కోట్లతో హరిత హోటల్‌ను మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. అంబేద్కర్‌ కమిటీ హాల్‌ నిర్మాణానికి రూ.25లక్షలు మంజూరైనట్లు చెప్పారు. వెల్గటూర్‌లో రూ.50లక్షలతో ఇంటిగ్రేటేడ్‌ మార్కెట్‌, రూ.20లక్షలతో టౌన్‌హాల్‌ కూడా నిర్మించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావ్‌, ఎంపీపీ, జడ్పీటీసీ, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.