మంగళవారం 20 అక్టోబర్ 2020
Jagityal - Sep 17, 2020 , 02:52:31

కంపోస్ట్‌ షెడ్లతో సత్ఫలితాలు

కంపోస్ట్‌ షెడ్లతో సత్ఫలితాలు

  • జగిత్యాల కలెక్టర్‌ గుగులోత్‌ రవి n వెల్లుల్లలో పల్లె ప్రకృతి, ప్రగతి పనుల పరిశీలన

మెట్‌పల్లి రూరల్‌: పల్లె ప్రగతి కింద గ్రామా ల్లో నిర్మిస్తున్న కంపోస్ట్‌ షెడ్లను పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి తెచ్చినప్పుడే సత్ఫలితాలు వస్తాయని జగిత్యాల కలెక్టర్‌ గుగులోత్‌ రవి పేర్కొన్నారు. మెట్‌పల్లి మండలం వెల్లుల్లలో జిల్లా స్వచ్ఛ భారత్‌ మిషన్‌(గ్రామీణ) ఆధ్వర్యంలో ‘తడి, పొడి చెత్త నిర్వహణ- సేంద్రి య ఎరువుల తయారీ’ విధానంపై మండలంలోని పంచాయతీ కార్యదర్శులకు బుధవారం శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పారిశుద్ధ్య సిబ్బందితో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని సూచించారు. సేకరించిన చెత్తను నేరుగా కంపోస్ట్‌ షెడ్డుకు తరలించి తడి, పొడి గదుల్లో వేయాలని పేర్కొన్నారు. ఆ చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్నది గ్రామాల్లో అమలు చేస్తూ కంపోస్టు షెడ్డులను ఉపయోగంలోకి తెచ్చినప్పుడే సీఎం కేసీఆర్‌ ఆశయం నెరవేరుతుందన్నారు. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో జిల్లా కొంత మెరుగ్గా ఉందని తెలిపారు. ఇంకా కొన్ని గ్రామాల్లో స్థలాల ఇబ్బందితో పనులు ప్రారంభం కాలేదని వెల్లడించారు. అలాంటి గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకొని తహసీల్దార్లు, ఆర్డీవోను సంప్రదించి స్థలాలను గుర్తించాలని సూచించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో మూడు రోజుల్లో పల్లె ప్రకృతి వనా లు, అక్టోబర్‌ 15 తేదీలోగా కంపోస్ట్‌ షెడ్లు, వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కంపోస్ట్‌ షెడ్డు, పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఆర్డీవో వినోద్‌కుమార్‌, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, ఎంపీపీ మారు సాయిరెడ్డి, జడ్పీటీసీ కాటిపెల్లి రాధాశ్రీ, సర్పంచ్‌ గూడూరు రజిని, తహసీల్దార్‌ రాజేశ్‌, ఎంపీడీవో కల్పన, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


logo