ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Jagityal - Sep 12, 2020 , 03:09:47

పోరాటయోధుడి అస్తమయం

పోరాటయోధుడి అస్తమయం

  • nస్వాతంత్య్ర సమరయోధుడు  గండ్ర రాఘవేంద్రరావు తుది శ్వాస
  • nఅనారోగ్యంతో హైదరాబాద్‌లో  కన్నుమూత
  • nజగిత్యాల జిల్లాలో విషాదం

నిజాం సైన్యంపై ఎదురుతిరిగిన పోరాటవీరుడు.. స్వాతంత్య్ర సమరయోధుడు గండ్ర రాఘవేంద్రరావు (94) అస్తమించారు. అనారోగ్యంతో హైదరాబాద్‌ దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాల ఆయన స్వగ్రామం కాగా, జిల్లాలో విషాదం నెలకొన్నది. పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు.   - జగిత్యాల, నమస్తే తెలంగాణ/మల్యాల

నిజాంపై ఉక్కు పిడికిలి..

1927లో జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాలలో జన్మించిన రాఘవేంద్రరావు ప్రాథమిక విద్యను మానాల, మల్యాల, మాధ్యమిక విద్యను జగిత్యాలలోని పురాతన ఉన్నత పాఠశాలలో చదివారు. తొలి నుంచి స్వాభిమానం, స్వపాలనపై మమకారం ఎక్కువ. రాష్ట్రంలో నిజాం ప్రభుత్వ నిరంకుశ విధానాలను పూర్తిగా వ్యతిరేకించారు. తన స్నేహితులైన తాండ్ర మీనరావు, జువ్వాడి రత్నాకర్‌రావు తదితరులతో కలిసి ఉద్యమించారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున తెలంగాణలో నిజాం ప్రభుత్వం కర్ఫ్యూ పెట్టింది. భారత జెండాలు ఎగరేయవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాఘవేంద్రరావు తన మిత్రులతో కలిసి జగిత్యాల పురాతన ఉన్నత పాఠశాల (అప్పటి హైస్కూల్‌)పై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. దీంతో ఆయనపై నిజాం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కూడా రజాకార్లు, నిజాం పోలీసులు ప్రజలపై దాడులు చేస్తుండడంతో తన స్నేహితులతో కలిసి వ్యతిరేకంగా ఉద్యమించారు. మానాల గ్రామానికి సమీపంలో నంచర్లలో నిజాం ప్రభుత్వ రెవెన్యూ దస్ర్తాలను దహనం చేశారు. పోలీసుల వేట ఎక్కువ కావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకుగాను తెలంగాణ సాయుధ పోరాట యోధుల శిక్షణ కూడా తీసుకున్నారు. హైదరాబాద్‌ విమోచన అనంతరం రాఘవేంద్రరావు సాధారణ రైతు జీవితం గడిపారు. అలాగే ధార్మిక వేత్తగా పేరుగాంచారు. పద్మనాయక కల్యాణ మండపం వ్యవస్థాపకుడిగా, వెలమ సంక్షేమ మండలిని స్థాపించడంలో కీలక భూమిక పోషించారు. కొంతకాలం పాటు, స్వాతంత్య్ర సమర యోధుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల రాష్ట్ర సర్కారు రైతుబంధు నుంచి వచ్చిన రైతు బంధు నగదును సైతం ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. తాను ఆర్థికంగా బాగానే ఉన్నానని వీటిని నిరుపేద రైతులకు అందజేయాలని సీఎం కేసీఆర్‌కు విన్నవించారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాఘవేంద్రరావును మంత్రులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. కా గా, రాఘవేంద్రరావుకు ఒక్కడే కొడుకు మోహన్‌రావు. హైకోర్టు న్యాయవాది. కొంతకాలం హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా సైతం పనిచేశారు. 

భార్య మృతితో కుంగిపోయి..

నాలుగు నెలల కిందట తన భార్య రాధమ్మ అనారోగ్యంతో మృతిచెందడంతో రాఘవేంద్రరావు కుంగిపోయారు. అప్పటికే వయోభారంతో బాధపడుతున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం పరిస్థితి విషమించి మృతిచెందారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, జగిత్యాల జడ్పీ అధ్యక్షురాలు వసంత, మల్యాల జడ్పీటీసీ రామ్మోహన్‌రావు, ఎంపీపీ మిట్టపల్లి విమల సంతాపం ప్రకటించారు.logo