బుధవారం 30 సెప్టెంబర్ 2020
Jagityal - Sep 12, 2020 , 03:09:49

ప్రాణరక్షణలో... ప్రథమ చికిత్సే కీలకం

ప్రాణరక్షణలో... ప్రథమ చికిత్సే కీలకం

  •   n ఈ ప్రక్రియలో ఆర్‌ఎంపీ, పీఎంపీల సేవలు అభినందనీయం
  •   n నేడు ప్రాథమిక చికిత్స దినోత్సవం

జగిత్యాల, నమస్తే తెలంగాణ: ప్రాణ రక్షణలో ప్రథమ చికిత్స ఎంతో కీలకం. ఈ ప్రక్రియలో నైపుణ్యంతో వేలాది మంది ప్రాణాలను కాపాడడంలో ఆర్‌ఎంపీలు, పీఎంపీలు ముందంజలో నిలుస్తున్నారనడం నిస్సందేహం. మానవ శరీరంలో ఏదైనా రుగ్మత చోటు చేసుకునే ముందు అనేక లక్షణాలు వెల్లడవుతాయి. వీటిని ముందుగానే గుర్తిస్తే చికిత్స తీసుకొని పూర్తి స్థాయిలో స్వస్థత పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంలో ఆర్‌ఎంపీలు, పీఎంపీలు గురుతరమైన బాధ్యతను పోషిస్తున్నారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో రక్తం ఎక్కువగా పోకుండా చూడడం, కట్లు కట్టడం లాంటి సేవలతో నిండు ప్రాణాలు కాపాడుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రథమ చికిత్స అనే మాట క్రీ.శ 1099లో తొలిసారిగా రికార్డు చేశారు. క్రిసెండ్‌ యుద్ధాల్లో గాయపడిన సైనికులకు సేవ చేసే క్రమంలో ప్రథమ చికిత్స అనే పదం వినిపించింది. అయితే ప్రథమ చికిత్స (ఫస్ట్‌ ఎయిడ్‌) అనే పదం తొలిసారిగా 1878లోమన దేశంలో వాడుకలోకి వచ్చింది. మద్రాస్‌ ఫ్రావిన్స్‌లోని ఆంధ్ర ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న అల్లోపతి సర్జన్‌లు అయిన మేజర్‌ పీటర్‌ షెఫర్డ్‌, కల్నల్‌ ఫ్రాన్సిస్‌లు ఫస్ట్‌ ఎయిడ్‌ ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేశారు. ప్రజలకు ప్రథమ చికిత్స ప్రాధాన్యతను వివరించేందుకు వీరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

2000లో ప్రత్యేక దినోత్సవంగా ప్రకటన

ప్రాథమిక చికిత్స దినోత్సవాన్ని నిర్వహించాలని 2000 సంవత్సరంలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రెడ్‌ క్రాస్‌ అండ్‌ రెడ్‌ క్రెసెంట్‌ సొసైటీస్‌ ప్రాథమిక చికిత్స దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రతి సెప్టెంబర్‌ 2వ శనివారం ప్రాథమిక చికిత్స దినోత్సవంగా నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 200 రెడ్‌క్రాస్‌ సొసైటీల ద్వారా ప్రథమ చికిత్సపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

ఆరోగ్య సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం

బడిలేని ఊరు, గుడి లేని ఊరు ఉండవచ్చుగాని తెలంగాణలో ఆర్‌ఎంపీలు, పీఎంపీలు లేని గ్రామం లేదని చెప్పవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా మారుమూల గ్రామంలోనూ వీరు సేవలందిస్తున్నారు. ఆరోగ్యం, ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను నిరంతరం చైతన్యవంతం చేస్తూనే ఉన్నారు. ఆరోగ్య సమాజాన్ని నిర్మించడంలో భాగస్వాములవుతున్నారు. 


logo