ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Jagityal - Sep 07, 2020 , 01:44:41

నూతన పరిజ్ఞానంతో రూపొందించిన నూనెతీసే యంత్రం

  నూతన పరిజ్ఞానంతో రూపొందించిన నూనెతీసే యంత్రం

  • lఅందుబాటులో పోషకాలతో కూడిన నూనె 
  • lరైతులకు అవగాహన కల్పిస్తున్న పొలాస పరిశోధనా స్థానం 
  • lప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకునేలా వ్యూహరచన

రైతులు పండించిన పంటను మార్కెటింగ్‌ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం వారు సరికొత్త యంత్రాన్ని ఆవిష్కరించారు. పంట దిగుబడులను నేరుగా అమ్మకుండా, ఉప ఉత్పత్తులుగా అమ్మితే రైతులకు ఆదాయం రెట్టింపవుతుందనే ఉద్దేశంతో నూతన పరిజ్ఞానంతో రూపొందించిన నూనెతీసే యంత్రాన్ని పరిచయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వైపు రైతులను చైతన్యవంతం చేస్తూనే, మరోవైపు తమ ఉత్పత్తులను బ్రాండ్‌ ఇమేజ్‌తో అమ్మేందుకు కోల్డ్‌ ప్రెసెడ్‌ ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ అనే నూనె తీసే పరికరాన్ని శాస్త్రవేత్తలు తీసుకువచ్చారు. -జగిత్యాల టౌన్‌

జగిత్యాల టౌన్‌: పొలాస పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రైతుల కోసం కొత్తగా నూనె తీసే యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. రైతులు పంట దిగుబడులను ఉప ఉత్పత్తులుగా మార్చి బ్రాండ్‌ ఇమేజ్‌తో అమ్మేందుకు కోల్డ్‌ ప్రెసెడ్‌ ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ అనే నూనె తీసే యంత్రాన్ని పరిచయం చేస్తున్నారు. ఈ పరికరంతో నువ్వులు, ఆవాలు, కుసుమతో వివిధ రకాల ఉత్పత్తుల నుంచి సులభంగా నూనె తీయవచ్చు. మరోవైపు పూర్తిగా శుద్ధి అయి పోషకాలతో కూడిన నూనెను తయారుచేస్తున్నారు. 

నూతన పరిజ్ఞానంతో..

ఈ పరికరం నువ్వులు, ఆవాలు, కుసుమలతో పాటు పప్పుల నుంచి కూడా నూనెను తీయడానికి అనువుగా ఉంటుంది. దీని ధర రూ. 4 లక్షలు కాగా, గంటకు 30 కిలోల నూనె తీయవచ్చు. తొలుత 100 కిలోల నువ్వులకు 30 లీటర్ల నూనె మాత్రమే వస్తుంది. యంత్రం పని తీరు మెరుగుపడ్డా కొద్దీ 35 నుంచి 38 లీటర్ల వరకు నూనెను పొందవచ్చు. ఇందులో 45 నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది. ఈ అధునాతన పరికరం రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి నూనె తీయడం, రెండోది నూనెను ఫిల్టర్‌ చేయడం. కొత్త పరికరం ఓ చిన్నపాటి గిర్నీ మాదిరిగా ఉంటుంది. మొదట నూనె తీసే మిషన్‌ 10 హెచ్‌పీ సామర్థ్యం గల విద్యుత్తు మోటరును బెల్టులతో అనుసంధానం చేస్తారు. విద్యుత్తు మోటరు ఆన్‌ చేసి, యంత్రంలో ఎడమవైపు నువ్వులు పోయగానే మర ఆడతాయి. యంత్రం ముందు భాగంలో నూనె పడుతుంటే, కుడివైపు పిప్పి పడుతుంటుంది. దీన్ని పశువులకు దాణగా ఉపయోగిస్తే వాటికి కూడా పోషకాలు ఎక్కువగా వస్తాయి.

మరో యంత్రంలో నూనె ఫిల్టర్‌ 

మర ఆడించిన నూనెను ఫిల్టర్‌ చేసేందుకు మరో పరికరం ఉంటుంది. ఈ పరికరానికి 3 హెచ్‌పీ సామర్థ్యం గల విద్యుత్‌ మోటరు అనుసంధానం చేస్తారు. మర ఆడించిన నూనెను ఒక రోజు అలాగే ఉంచుతారు. దీంతో మడ్డి నూనె కిందకు వెళ్తుంది. తర్వాత ఆ నూనెను ఇతర డ్రమ్ముల్లోకి తరలిస్తారు. డ్రమ్ము రెండు పైపులను ఫిల్టర్‌కు బిగిస్తారు. విద్యుత్తు మోటర్‌ ఆన్‌ చేయగానే డ్రమ్ములోని నూనె ఫిల్టర్‌లోకి వెళ్తుంది. ఫిల్టర్‌ తన కెపాసిటీకి తగ్గట్టు నూనె తీసుకోగా మిగతా నూనె తిరిగి డ్రమ్ములోకి వస్తుంది. ఆలా ఫిల్టర్‌కు అవసరమైన నూనెను  పైపుల ద్వారా అందిస్తారు. ఫిల్టర్‌లో సన్నని క్లాత్‌ ఉంటుంది. దాని ద్వారా నూనె వడపోత జరుగుతుంటుంది. ఫిల్టర్‌కు 10 ట్యాపులు ఉంటాయి. ఫిల్టర్‌ అయిన నూనె వాటి ద్వారా మరో ప్రత్యేక డ్రమ్ములో పడుతుంది. దాన్ని లీటర్‌ బాటిళ్లలో పోసి ప్యాక్‌ చేసి విక్రయించుకోవచ్చు.

పరిశోధనా స్థానంలో నూనె విక్రయం 

పొలాస పరిశోధనా స్థానం బ్రాండ్‌తో నువ్వులు, ఆవాలు, కుసుమ నూనెలను విక్రయించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. తమ దగ్గర పండించిన వాటితో పాటు ఇతర ప్రాంతాల్లో నాణ్యత గల నువ్వులను కొనుగోలు చేసి, నూనె తయారు చేస్తున్నారు. నువ్వుల్లో చెత్తా చెదారం లేకుండా జాలి పడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక గదిని కేటాయించి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతానికి నువ్వుల నూనెను లీటర్‌కు రూ. 400 చొప్పున విక్రయించేందుకు సిద్ధం చేస్తున్నారు. 

కరెంటు ఉపయోగించి వేడి ద్వారా నూనె తీసే పద్ధతి 

ప్రస్తుతం రైతులు నువ్వులను పవర్‌ మిషన్‌లో పట్టించుకుని వాడుతున్నారు. ఈ పరికరాల్లో నువ్వులు మర ఆడించినప్పుడు 62 నుంచి 72 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉండడంతో ఆ వేడికి నూనెలో ఉండే క్యాల్షియం, ప్రొటీన్స్‌, విటమిన్‌-బిని నష్టపోతున్నారు. నూనె పిప్పి పూర్తిగా ఆరి పోయే వరకు ఆ పవర్‌ యంత్రంలో వేయడం ద్వారా దానిలోని పోషకాలు మిగిలితే అవి కూడా కరిగిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పవర్‌ మిషన్‌లో నూనెను ఫిల్టర్‌ చేయడం కుదరదు. కాబట్టి పట్టించిన నూనె కింది భాగంలో మడ్డిగా ఏర్పడుతుంది. దీంతో పాటు వచ్చిన పిప్పిని పశువులకు పెట్టడం ద్వారా పశువులకు కూడా అంతగా ఉపయోగం ఉండదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.  

ఉప ఉత్పత్తులతో రైతులకు మేలు 

రైతులు పండించిన పంటలను నేరుగా మార్కెట్‌లో అమ్ముకోకుండా ఉప ఉత్పత్తులుగా మార్చి మార్కెటింగ్‌ చేయడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చు. రైతులకు ఈ నూతన పరికరం గురించి తెలియజేయడమే కాకుండా, నువ్వులు, ఆవాలు, కుసుమ నూనెను కూడా పరిశోధనా స్థానం ద్వారా విక్రయించాలని అనుకుంటున్నాం. ఆసక్తి గల రైతులు పరిశోధనా స్థానాన్ని సందర్శిస్తే వారికి శిక్షణ కూడా ఇస్తాం.

- డాక్టర్‌ పద్మజ, నువ్వుల శాస్త్రవేత్త

రైతులకు అవగాహన కల్పిస్తాం

నూతన పరిజ్ఞానంతో రూపొందించిన నూనె తీసే యంత్రాన్ని ప్రతి గ్రామంలో రైతులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకొనేలా వారికి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. ఈ పరికరాన్ని గ్రామాల్లోని రైతు సంఘాల ద్వారా కొనుగోలు చేసి, ఆ ఊరి పేరు మీద ఉప ఉత్పత్తులను విక్రయించుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తాం. నువ్వులు అమ్మితే రూ. 100 వస్తే, నువ్వుల నూనె అమ్మితే రూ. 400 వస్తాయి. ప్రతి గ్రామంలో రైతులు ఏర్పాటు చేసుకుంటే ఆరోగ్యం పెంచుకోవడంతో పాటు లాభాలు పొందవచ్చు.

- ఏడీఆర్‌ డాక్టర్‌ ఉమారెడ్డి


logo