మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 31, 2020 , 01:03:25

కూరగాయలు పిరం

కూరగాయలు పిరం

కొత్తపల్లి: కూరగాయల ధరలు కొండెక్కాయి. రెట్టింపు రేట్లు పలుకుతున్నాయి..కొన్నింటి ధరలు ఏకంగా చికెన్‌ను మించి పోతున్నాయి.. ఇటీవల కురిసిన భారీ వర్షాలు పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఒక్కసారిగా దిగుబడి తగ్గడం, డిమాండ్‌ పెరగడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. ఏది కొందామన్నా కిలోకు 50 పైనే పలుకుతున్నాయి.. కొన్నయితే ఏకంగా 150 నుంచి 200కు చేరాయి. 20 రోజుల్లోనే రేట్లు అమాంతం పెరిగి వినియోగదారులకు చుక్కలు కనబడుతున్నాయి. ఇప్పటికే కరోనా దెబ్బకు ఆర్థికంగా చితికిపోయిన పేదలను ఈ ధరలు మరింత భయపెడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాతో పాటు రాష్ట్రం, ఇతర రాష్ర్టాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షా లు కూరగాయల పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. పెద్ద మొత్తంలో తోటలు దెబ్బతిన్నాయి. దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో రైతులు సైతం తీవ్రంగా నష్టాలపాలవుతున్నారు. మన రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడులో కుండపోతగా కురిసిన వర్షాలతో దిగుమతులు తగ్గిపోయాయి. ముఖ్యంగా మన మార్కెట్‌కు టమాట, ఉల్లిగడ్డల రాక తగ్గిపోవడంతో వీటి రేట్లు ఆకాశాన్నంటు తున్నాయి. ఇటీవల కాలంలో ఇంధన ధరలు  సైతం రికార్డు స్థాయికి చేరడంతో వాహన రవాణా చార్జీలు పెరిగి అంతిమంగా కూరగాయల ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. 

రెండింతలైన రేట్లు..

జూలై నెలలో కిలో ఆలుగడ్డలు 25-30 వరకు ధర పలుకగా నేడు 40వరకు చేరాయి. టమాట 20-30వరకు ఉండగా, ప్రస్తుతం 35 నుంచి 40వరకు లభిస్తున్నది. మిర్చి కిలో రేటు 35 నుంచి 40 వరకు ఉండగా, నేడు 85కి చేరింది. అలాగే క్యాబేజీ 30 ఉండగా, నేడు 40, ఉల్లిగడ్డ 20 ఉండగా, నేడు 30 వరకు, పొట్లకాయ 20 నుంచి 50, దోసకాయ 20 నుంచి 50 వరకు, వంకాయ 35 నుంచి 75 వరకు, క్యాప్సికం 50 నుంచి 80 వరకు పెరిగాయి. 

పడిపోయిన అమ్మకాలు..

కూరగాయల ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోవడంతో అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడింది. ఏది కొందామన్నా వందలు రూపాయలు వెచ్చించాల్సి రావడంతో కొనుగోలు చేసేందుకు వినియోగదారులు భయపడుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ ఇంతగా వెచ్చించలేదని చెబుతున్నారు. పప్పులతోనే సరిపెట్టుకుంటున్నామని పేర్కొంటున్నారు.  20 రోజుల క్రితం వరకు రోజుకు రెండు క్వింటాల్‌కు పైగానే టమాటలు అమ్మే వ్యాపారులు నేడు క్వింటాల్‌ కూడా అమ్మడం లేదని చెబుతున్నారు. కొత్తగా వేసిన పంటలు చేతికందే వరకు ఇదే పరిస్థితులు ఉండవచ్చనని తెలిపారు. 

పెరిగిన రవాణా ఖర్చులు

కొవిడ్‌ ప్రభావంతో రవాణా సౌకర్యాలు పూర్తిస్థాయిలో మెరుగుపడలేదు. అన్‌లాక్‌ దశ నడుస్తున్నా ఇప్పటికీ సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెరిగిపోవడంతో వాహనాలకు సైతం అధికంగా వెచ్చించాల్సి వస్తున్నది. అలాగే మార్కెట్లలో కూలీలు సైతం అందుబాటులో ఉండడంలేదు. పక్క రాష్ర్టాల నుంచి వచ్చే కూరగాయల వాహనాలకు గతంతో పోలిస్తే 3వేల నుం చి 4వేల దాకా అదనంగా ఖర్చుచేయాల్సి వస్తున్నదని అమ్మకందారు లు చెబుతున్నారు. 


logo