సోమవారం 26 అక్టోబర్ 2020
Jagityal - Aug 24, 2020 , 01:39:17

లాభాల ‘పట్టు’

లాభాల ‘పట్టు’

ఆయన ఉన్నత చదువులు చదివాడు. అందరి వలె ఉద్యోగాల కోసం వేచిచూడ లేదు. తనకు ఇష్టమైన వ్యవసాయంపై దృష్టి పెట్టాడు. కానీ మొదట్లో సాధారణ రైతుల్లా సాంప్రదాయ పంటలైన వరి, మక్కజొన్నను సాగు చేశాడు. అధిక శ్రమ, ఆశించిన దిగుబడులు రాకపోవడంతో ఆ పంటలకు స్వస్తి పలికాడు. అనంతరం అరటి, బొప్పాయిని పండించాడు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టాలు వస్తుండడంతో పట్టు పురుగుల పెంపకంపై దృష్టి పెట్టాడు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న ఎడవెల్లి కిషన్‌రెడ్డిపై

మండలంలోని గోపాల్‌రావుపేటకు చెందిన ఎడవల్లి కిషన్‌రెడ్డికి చిన్ననాటి నుంచే వ్యవసాయం అంటే మక్కువ. చిన్నతనంలో తల్లిదండ్రులకు పొలం పనుల్లో సాయం చేసేవాడు. కష్టపడి పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. అయితే ఉద్యోగాల జోలికి వెళ్లకుండా ఇష్టమైన వ్యవసాయంపై దృష్టి పెట్టాడు. మొదట్లో వరి, మక్కజొన్న, లాంటి పంటలను వేశాడు. అనంతరం మూసపద్ధతులను వీడి వినూత్నంగా  కొత్తపంటల సాగుకు శ్రీకారం చుట్టాడు. పదేండ్ల పాటు అరటిపంట సాగు చేశాడు. ఆ తరువాత పంటమార్పిడి చేయాలన్న ఆలోచనతో రెండేళ్ల పాటు బొప్పాయి వేశాడు. అధిక దిగుబడులు సాధించి ఆదర్శరైతు అవార్డును అందుకున్నాడు. 

సెరికల్చర్‌తో నెలనెలా ఆదాయం.. 

అయితే అంతకుముందు పండించిన పంటలతో ఐదారు నెలలకోసారి ఆదాయం వచ్చే పరిస్థితి ఉండేది. ఒక్కోసారి ప్రకృతి విపత్తుల కారణంగా నష్టాలు చవిచూడాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో నెలనెలా ఆదాయం వచ్చే పట్టు పురుగుల పెంపకం దిశగా అడుగులు వేశాడు. ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. రెండెకరాల మల్బరీ తోట విస్తీర్ణానికి సరిపడేలా, 300 గుడ్ల సామర్థ్యానికి అనుగుణంగా రూ. 7లక్షలతో ప్రత్యేక షెడ్డు నిర్మించాడు.  పట్టుపురుగుల లార్వాను బెంగళూరు నుంచి దిగుమతి చేసుకొని పెంపకం ప్రారంభించాడు. 

పెంపకం ఇలా..

మల్బరీ మొక్కలను ఒక్కసారి నాటితే సుమారు 20 నుంచి 25 ఏండ్ల వరకు పట్టుపురుగులకు కావాల్సిన ఆహారాన్ని ఇస్తాయి. ఎకరంలో మల్బరీ సాగు చేసి, పట్టుపురుగులను పెంచితే ఒక పంటకు 60 నుంచి 70 వేల దిగుబడి వస్తుదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. షెడ్డులో తగినంత గాలి, వెలుతురు ఉండేలా చూడాలన్నారు. 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గుడ్ల దిగుమతికి రూ. 3వేలు, మల్బరీ తోటలో అడుగుమందు వేయడం, కట్టె కత్తిరించడం, కూలీలతో కలిపి మరో రూ. 10 వేలు ఖర్చు ఉంటుందన్నారు. మొత్తంగా రూ. 12 వేల నుంచి 15 వేలకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందన్నాడు. 100 గుడ్ల నుంచి లక్ష పురుగులు వస్తాయని, వీటి ద్వారా నెలకు రెండు నుంచి రెండున్నర క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు. కరోనా కాలంలో మార్కెట్‌లో అంతగా గిరాకీ లేదని, కేవలం కిలోకు రూ. 160 ఆదాయం వస్తుందన్నారు. అయితే మార్చికి ముందు రూ. 300 నుంచి రూ. 500 దాకా ధర పలికేదన్నారు. ప్రతినెలా సుమారు రూ. 50 నుంచి రూ. 60వేల లాభాలు వచ్చేవని పేర్కొన్నారు. రెండేళ్లలో ఎనిమిది పంటలు తీసినట్లు చెప్పారు. 

సెరీకల్చర్‌ సంతృప్తినిచ్చింది..

ఆదర్శరైతుగా ఇప్పటివరకు సాంప్రదాయ, ఉద్యానవన పంటలు సాగు చేశాను. అయితే వాటన్నిటికంటే పట్టుపురుగుల పెంపకం ఎంతో సంతృప్తినిచ్చింది. మల్బరీ తోటల పెంపకంలో ఇప్పటి వరకు ఏనాడూ రసాయనిక ఎరువులను ఉపయోగించలేదు. అడుగుమందు కోసం పశువుల పెంట వేశాను. గొర్లమందలను తోలించాను. ముఖ్యంగా వేస్ట్‌ డీ కంపోజర్‌ను ఉపయోగిస్తున్నందున తోటలు ఆరోగ్యంగా పెరుగుతున్నయ్‌. పట్టుపురుగుల పెంపకంలో కేంద్రప్రభుత్వం ద్వారా స్టాండ్లు, నేత్రికలు, బెడ్ల ఏర్పాటుకు రూ. 45 వేల వరకు సాయం అందింది. రాష్ట్ర ప్రభుత్వం పట్టు రైతులకు ప్రోత్సాహకం కింద కిలోకు 75 రూపాయల చొప్పన గతంలో ఇచ్చేది.   రెండేండ్లుగా నిలిపివేసింది. పట్టును నమ్ముకున్న నాలాంటి రైతులకే ప్రభుత్వాలు ఆర్థిక చేయూతనిస్తే బాగుంటుంది. ఇదే బాటలో మరికొందరు పయనించే అవకాశం ఉంటుంది. 

పట్టుదలతో ముందుకు..

కిషన్‌రెడ్డి తొలి ఏడాది అంతగా అనుభవం లేకపోవడంతో ఆశించిన మేర లాభాలు రాలేదు. అయినా వెనుకడుగు వేయలేదు. తోటి రైతులు వారించినా వినలేదు. ఆ తర్వాత సంవత్సరం నిరంతరం శ్రమించాడు. తన భార్య సాయంతో అంచనాలకు మించి దిగుబడి సాధించాడు. అంతేస్థాయిలో ఆదాయాన్ని ఆర్జించాడు.   


logo