శనివారం 19 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 24, 2020 , 01:39:28

పంటలను కాపాడుకుందాం

పంటలను కాపాడుకుందాం

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరి, పత్తి, కంది పంటల్లో భారీగా నీరు నిలిచింది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నది. అయితే ఆ నీటిని తొలగించి, తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పంటలను రక్షించుకోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏయే పంటలకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు పాటించాలో గంగాధర మండల వ్యవసాయాధికారి రాజు సూచనలు, సలహాలు ఇచ్చారు. 

వరి 

ప్రస్తుతం వరి పొలాలు నెల రోజుల దశలో ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కుంటల ఆయకట్టు ప్రాంతాల్లో అధిక వర్షాల వల్ల పంటలు మునిగే ప్రమాదముంది. పిలక వేసిన వరి నీట మునిగితే నీటిని తొలగించిన తర్వాత తిరిగి ఎదుగుదల ప్రారంభమవుతుంది. నాటిన 20 రోజులై పాక్షికంగా దెబ్బతిన్నచో పాదులు మళ్లీ నాటాలి. త్వరగా కోలుకుని ఎదుగుదల ఉండేందుకు అదనంగా ఎకరానికి 20 కిలోల యూరియా 10 కిలోల మ్యూరెట్‌ పొటాష్‌ వేయాలి. ఎదుగుదలలో ఉన్న వరి నీట మునిగినచో త్వరగా కోలుకునే దశలో వివిధ తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుంది. తెగుళ్ల నివారణకు కార్బండిజమ్‌ గ్రాము లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

కంది 

ఈ పంట అధిక తేమకు అత్యంత సున్నితమైంది. నీటి నిల్వను ఎక్కువగా తట్టుకోదు. నీటిని వెంటనే తీసివేయాలి. బోదె కాల్వల పద్ధతిలో విత్తన పంటకు నేరుగా నీరు ఆనదు కనుక కొంత మేరకు నిలదొక్కుకుంటుంది. సాధారణ పద్ధతిలో విత్తిన పంటకు నీరు తాకినచో ఫైటోఫైరా ఎండు తెగులు ఉధృతంగా సోకి గుంపులు గుంపులుగా మొక్కలు వడలిపోయి ఎండిపోతాయి. మొదలు దగ్గర కణమార్పిడి చెంది గాలికి విరిగిపోతుంది. కంది నుంచి నీటిని తీసిన తర్వాత లీటరు నీటికి 3 గ్రాముల మాంకోజెబ్‌ లేదా 2 గ్రాముల మెటలాక్సిల్‌ కలిపి వేరు భాగంలో మొదలు భాగాన్ని బాగా తడపాలి. దీంతోపాటు లీటరు నీటిని 10 గ్రాముల మల్టీ కే పిచికారీ చేయాలి.

పెసర, మినుము

పెసర, మినుము వంటి పంటలు ప్రస్తుతం పూత నుంచి కాయ తయారయ్యే దశలో ఉన్నాయి. ఈ పంటలు అధిక నీటి నిల్వను తట్టుకోవు. కాబట్టి వెంటనే నిల్వ నీటిని తీసివేయాలి. అధిక తేమ వల్ల పంట రంగు మారుతుంది కనుక లీటరు నీటికి 10 గ్రాముల 19ః19ః19 లేదా మల్టీ కే వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. పూత దశలో ఉన్న పంటలో మారుక మచ్చల పురుగు ఆశించి నష్ట పరచడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనిని నివారించడానికి ఎకరానికి 60 మి.లీ క్లోరాంత్రోనిలిప్రోల్‌ పిచికారీ చేయాలి.

పత్తి :

పత్తి చేలలో నీరు ఎక్కువగా నిలిస్తే పారామిల్ట్‌, ఎండు తెగులుకు (వేరుళ్లు) సోకి మొక్కలు తలలు వాల్చుతాయి. ఆకులు రంగు కోల్పోయి, తీవ్రతను బట్టి మొక్కలు ఎండిపోతాయి. వేరు భాగంలో ఎక్కువ మొత్తంలో నీరు చేరినప్పుడు ఈ పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా పంటలో ఎక్కువ అంతరకృషి చేసి గుల్లబారినప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. వర్షాలు తగ్గిన తర్వాత నిల్వ నీటిని తొలగించాలి. వడలిన మొక్కలు, చుట్టూ ఉన్న మొక్కలన్నింటికీ కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి మొక్క వేరు భాగం తడిసే విధంగా పిచికారీ చేయాలి. లీటరు నీటికి 10 గ్రాముల 19ః19ః19 కలిపి వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి ఎకరానికి 25 కిలోల యూరియా 10 కిలోల పొటాష్‌ మొక్క మొదట్లో 5-6 సె.మీల ఎడంగా వేయాలి. అధిక వర్షం మూలంగా పచ్చదోమ బాగా ఉధృతమయ్యే అవకామున్నందున 5 శాతం వేప నూనె, 2 మి.లీ ఫిప్రోనిల్‌, లేదా ఎసిటామిప్రిడ్‌ 0.2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు సోకే అవకాశమున్నందున 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు 10 లీటర్ల నీటికి 30 గ్రాముల కాపర్‌క్సిక్లోరైడ్‌, ప్లాంటామైసిన్‌ పిచికారీ చేయాలి. భూమిలో తేమను బట్టి అవకాశమున్నచో వీలున్నంత త్వరగా అంతరకృషి చేసినచో వేర్లకు గాలి సోకి ఎదుగుదలకు తోడ్పడుతుంది.

మిర్చి

ప్రస్తుతం నారుమడి నుంచే నాటే దశలో మిర్చి ఉన్నది. నారుమడిలో నారుకుళ్లు, నాటిన పంటలో బ్యాక్టీరియా ఆకుమచ్చ, కాండం కుళ్లు తెగులు రావడానికి అవకాశం ఉన్నది. బ్యాక్టీరియా, ఆకుమచ్చ తెగులు నివారణకు 10 లీటర్ల నీటికి 30 గ్రాముల కాపర్‌ఆక్సిక్లోరైడ్‌, ఒక గ్రాము స్ట్రెప్టోసైక్టిన్‌ కలిపి పిచికారీ చేయాలి. కాండం కుళ్లు నివారణకు 1-5 థయోఫనేట్‌ మిథైల్‌ ప్రతి లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నారు కుళ్లు నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ లేదా 2 గ్రాముల రిడోమిల్‌ ఎంజడ్‌ కలిపి నారు మడికి పిచికారీ చేయాలి.

సూచనలు పాటించాలి

భారీ వర్షాలు పడి పంటలు నీట మునగడంతో తెగుళ్లు ఆశించి రైతులకు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. సరైన సస్యరక్షణ చర్యలు తీసుకుంటే తెగుళ్ల నుంచి పంటలను రక్షించుకోవచ్చు. పంట చేలలో నిలిచిన నీటిని వెంటనే తీసి వేయాలి. సమీప వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి, వారి సూచనల మేరకు మందులు పిచికారి చేయాలి.


logo