సోమవారం 21 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 22, 2020 , 01:36:43

టేస్టీ.. టేస్టీ.. మక్క కంకి

టేస్టీ.. టేస్టీ.. మక్క కంకి

చిటపట చినుకులు పడుతూ ఉంటే.. కాల్చిన మక్క కంకి ఒక్కో వరస ఒలిచి తింటూ ఉంటే.. ఆ రుచే వేరు! ఒక్క రుచేనా, ఆహారానికి ఆహారం! ఆరోగ్యానికి ఆరోగ్యం! కంకులు కాల్చినా, ఒలిచిన గింజలు వేయించినా.. లేదంటే పచ్చి మక్కలతో గారెలు చేసుకున్నా, ఎండిన మక్కలతో గట్కా వండుకున్నా.. ఇలా ఎలా లాగించినా ఆ మజానే వేరు! అందుకే కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బలవర్ధకమైన ఆహారం తీసుకోవడానికి ఆసక్తి చూపుతుండగా, కంకులకు డిమాండ్‌ పెరిగింది. కొద్ది రోజులుగా ఉమ్మడి జిల్లాలో జోరుగా విక్రయిస్తుండగా, గిరాకీ రెట్టింపైంది. 

-కొత్తపల్లి/ ఓదెల/తిమ్మాపూర్‌ రూరల్‌

ఇది మక్క కంకులకు మంచి సీజన్‌. చిటపట చినుకులు పడుతున్న వేళ.. బొగ్గులపై కాల్చిన మక్క కంకులు తింటుంటే ఆ మజానే వేరు.. చల్లని వాతావరణంలో నిప్పు కణికలపై కాల్చిన కంకుల రుచిని ఆస్వాదించాల్సిందే. కరోనా కాలంలో ప్రతిఒక్కరూ పౌష్టికాహారం తీసుకునేందుకు ఆసక్తి చూపుతుండగా, మక్క కంకులకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. ఇటు వానకాలం.. అటు వైరస్‌ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో గిరాకీ రెట్టింపైంది. రోడ్ల వెంబడి ఎందరో కంకులను అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు. నిజామాబాద్‌, అంకాపూర్‌, కొదురుపాక, రుద్రారం, కొత్తపల్లి ప్రాంతాల నుంచి మినీ వ్యాన్‌లలో పెద్ద ఎత్తున తెచ్చి, విక్రయిస్తున్నారు. కరీంనగర్‌లో అయితే ప్రధాన కూడళ్లు, రహదారుల వెంట దాదాపు 20 వాహనాల్లో ఉంచి అమ్ముతున్నారు. జగిత్యాల వెళ్లే మార్గంలో ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల వద్ద ఎక్కువగా విక్రయిస్తున్నారు. వీటితోపాటు ఉదయం వెంకటేశ్వర టెంపుల్‌, రైతు మార్కెట్‌ ఏరియా, రాంనగర్‌ సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద అమ్ముతున్నారు. ఇటు హైదరాబాద్‌ రహదారిపై అల్గునూర్‌ నుంచి కొత్తపల్లి వరకు పదుల సంఖ్యలో మంది కాల్చినవాటితోపాటు ఉడక బెట్టిన కంకులను విక్రయిస్తున్నారు.

ధర తక్కువే..

గతేడాదితో పోలిస్తే కంకుల ధరలు తగ్గాయి. గతంలో అయితే పచ్చివి పదికి ఒకటి లేదా 20కి మూడు అమ్మేవాళ్లు. ఇప్పుడైతే 50కి పది లేదా 12 వరకు ఇస్తున్నారు. అందులోనూ తాజావి దొరుకుతున్నాయి. ఇటు కాల్చిన కంకుల ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 నుంచి 15 వరకు దొరుకుతున్నాయి. ఉడకబెట్టినవి అయితే ఒక్కటి 20 చొప్పున అమ్ముతున్నారు. పచ్చి మక్కలు కిలో 60 నుంచి 100 వరకు, స్వీట్‌ కార్న్‌ కిలో 80 నుంచి 100 వరకు విక్రయిస్తున్నారు. ఉడకబెట్టిన స్వీట్‌ కార్న్‌ అయితే ఒక్కోటి 15 నుంచి 20 వరకు అమ్ముతున్నారు. 

ఎక్కువగా కొంటున్నరు..

గతంలో జిల్లా కేంద్రానికి ప్రతి రోజూ 10 డీసీఎం వ్యాన్ల ద్వారా మక్క కంకులు వచ్చేవి. ఇప్పుడు 20 వ్యాన్ల వరకు వస్తున్నా డిమాండ్‌కు తగ్గట్లుగా సరిపోవడం లేదు. రోజురోజుకూ వీటి అమ్మకాలు పెరుగుతున్నయ్‌. గత నెల నుంచే ఊపందుకున్నయ్‌. కరోనా భయంతో ప్రజలు జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంటున్నరు. కంకులనే ఎక్కువగా కొంటున్నరు.

- మేకల సురేశ్‌, వ్యాపారి  

బలవర్ధకమైన ఆహారం.. 

మక్కలు బలవర్ధకమైన ఆహారం. పోషకాలు మెండు. ప్రోటీన్లు, విటమిన్‌ బీ, సీ పుష్కలంగా ఉంటాయి. ఫైబర్‌ అధికంగా ఉండడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరానికి ఎంతో ఉత్తేజాన్ని, శక్తిని ఇస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. పంటి సమస్యలను దూరం చేస్తుంది. డైటింగ్‌ చేసే వారు మక్కలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. కాల్చిన, ఉడకబెట్టిన కంకులు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. మక్కల్లో తక్కువ కొవ్వు, ఎక్కువ పీచుపదార్థాలు ఉండడం వల్ల మలబద్ధక సమస్య తీరుతుందని స్పష్టం చేస్తున్నారు. మక్క మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచి ఆహారం. గుండె పని తీరును కూడా మెరుగుపరుస్తుంది.  

ఎలా తిన్నా టేస్టే..

మక్క కంకులను నేరుగా కాల్చి, ఉడికించి తినడం తెలిసిందే! ఇంకా పచ్చి మక్కలను కొంచెం ఉప్పు వేసి వేయించి తినవచ్చు. అదీగాక గారెలు చేసుకోవచ్చు. అట్లుగానూ పోసుకోవచ్చు. కార్న్‌ సూప్‌ చేసుకొనీ తాగవచ్చు. గతంలో అయితే పల్లెల్లో మక్క గట్కా వండుకుని తినేవాళ్లు. అందులో పాలు లేదా పెరుగు పోసుకుని తిని రోజంతా ఎండలో పని చేసే వాళ్లు. అసలు నాటుకోడి కర్రీ కలుపుకొని గట్కా తింటే ఆ టేస్టే వేరు. 


logo