మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 20, 2020 , 03:33:59

జిల్లాలో సమృద్ధిగా ఎరువులు

జిల్లాలో సమృద్ధిగా ఎరువులు

  • lఈ-పాస్‌ యంత్రాల ద్వారానే   అమ్మకాలు 
  • lనిబంధనలు పాటించకపోతే   లైసెన్స్‌ రద్దు
  • lకలెక్టర్‌ శశాంక 

(కరీంనగర్‌, నమస్తే తెలంగాణ)

జిల్లాలో యూరియా, ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని కలెక్టర్‌ శశాంక తెలిపారు. బుధవారం జిల్లాలో ఎరువుల లభ్యత, ఈ-పాస్‌ యంత్రాల ద్వారా అమ్మకాలపై వ్యవసాయాధికారులు, మార్క్‌ఫెడ్‌, కో ఆపరేటివ్‌ అధికారులతో కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వానకాలం పంటలకు 4,700 మెట్రిక్‌ టన్నుల యూరియా, 5,841 మెట్రిక్‌ టన్నుల డీఎస్పీ, 7042 మెట్రిక్‌ టన్నుల ఎంవోపీ (మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాషియం), 22,266 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు అవసరమవుతాయని అంచనా వేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 40,908 మెట్రిక్‌ టన్నుల యూరియా, 6,971 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 7,876 మెట్రిక్‌ టన్నుల ఎంవోపీ, 28 వేల మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు జిల్లాకు తెప్పించామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 8,038 మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. రిటైల్‌ వర్తకందారులు విధిగా ఈ-పాస్‌ యంత్రాల ద్వారానే అమ్మకాలు జరిపేలా చూడాలని జిల్లా వ్యవసాయాధికారులను ఆదేశించారు. దీంతో ఎరువుల నిల్వలు ఎంత మేరకు ఉన్నాయనే విషయం అందరికీ తెలుస్తుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరిపే వారి లైసెన్స్‌ రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. అధిక మోతాదులో యూరియా వాడితే కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లోని విక్రయ కేంద్రాల్లో యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తప్పనిసరిగా ఈ-పాస్‌ యంత్రం ద్వారానే కొనుగోలు చేసి రైతులు సహకరించాలన్నారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌, కో ఆపరేటివ్‌ అధికారులు పాల్గొన్నారు.


logo