గురువారం 01 అక్టోబర్ 2020
Jagityal - Aug 18, 2020 , 02:59:32

వర్షాలు తగ్గగానే మరమ్మతులు

వర్షాలు తగ్గగానే మరమ్మతులు

  • lప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • lవైద్య సిబ్బంది గ్రామాల్లో  అత్యవసర సేవలందించాలి
  • lఆర్డీవో ఆనంద్‌ కుమార్‌

గన్నేరువరం: వరదల తాకిడికి రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయని, వర్షం తగ్గగానే వాటిని మరమ్మతులు చేయిస్తామని కరీంనగర్‌ ఆర్డీవో ఆనంద్‌ కుమార్‌ అన్నారు. సోమవారం మండలంలోని గుండ్లపల్లి, గునుకులకొండాపూర్‌, గన్నేరువరం మార్గంలో పూర్తిగా దెబ్బతిన్న కల్వర్టు, రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న నీటిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరమ్మతుల విషయమై ఆర్‌అండ్‌బీ అధికారులతో చర్చించినట్లు తెలిపారు.  ఇంకా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై నుంచి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు వాహనాలతో దాటడానికి ప్రయత్నించ వద్దన్నారు. గ్రామాల్లో గర్భిణులు, వృద్ధులకు అత్యవసర వైద్య సేవలు అందించడానికి ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని తహసీల్దార్‌ బండి రాజేశ్వరికి సూచించారు. ఆయన వెంట ఎంపీటీసీ గూడెల్లి ఆంజనేయులు, మాజీ సర్పంచ్‌  మల్లేశం గౌడ్‌, నాయకులు హన్మాండ్ల యాదగిరి, నాగపూరి శంకర్‌, ముల్కల లక్ష్మణ్‌, తాళ్లపెల్లి పరశురాం, బూట్ల లక్ష్మీపతి తదితరులు ఉన్నారు.

వరదలతో ప్రయాణికుల ఇబ్బందులు

మండలంలోని అన్ని గ్రామాల్లో కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతున్నాయి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. గునుకులకొండాపూర్‌ వద్ద కల్వర్టుకు గండి పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ద్విచక్రవాహనదారులు కల్వర్టుకు పడిన గండిని దాటడానికి అనేక పాట్లు పడుతున్నారు. గునుకుల కొండాపూర్‌ నుంచి చొక్కల్లపల్లె, పీచుపల్లెకు పోయే రోడ్డు దెబ్బతినడంతో ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా రోడ్లకు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

నిండిన చెరువులు, కుంటలు

మానకొండూర్‌ రూరల్‌: మండలంలోని కొండపల్కల, గంగిపల్లి, కెల్లేడు, ముంజంపల్లి, శ్రీనివాస్‌నగర్‌ గ్రామాల్లో కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు నిండి మత్తళ్లు దుంకుతున్నాయి. నిజాయితీగూడెం గ్రామంలో కాల్వ శాంతమ్మ, తుమ్మనపల్లి కనుకయ్య, వెంకటమల్లు అనే వ్యక్తులకు చెందిన ఇండ్లు కూలిపోయాయి. లింగాపూర్‌, వెల్ది, అన్నారం, ఈదులగట్టెపల్లి గ్రామాల్లోని రోడ్‌ డ్యాంపై నుంచి వరద పోతుండడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. అధికారులు ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

గ్రామాలు జలదిగ్బంధం 

చిగురుమామిడి: భారీ వర్షాలకు రేకొండతోపాటు పెద్దమ్మపల్లి, బండారుపల్లి, ఓగులాపూర్‌ గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సుందరగిరి-నవాబ్‌పేట్‌ రహదారి దెబ్బతినడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలో సహాయక చర్యలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రేకొండలో కూలిన ఇండ్లను సర్పంచ్‌ పిట్టల రజిత, ఎంపీటీసీలు సంధ్య, చాడ శోభ, ఉప సర్పంచ్‌ మహిపాల్‌రెడ్డి పరిశీలించారు. సుందరగిరి, ముదిమాణిక్యం, గాగిరెడ్డిపల్లి, బొమ్మనపల్లి గ్రామాల్లో సహాయక చర్యలను సర్పంచులు పర్యవేక్షించారు. 

తెగిన తాడికల్‌-వన్నారం రోడ్డు

శంకరపట్నం: భారీ వర్షాలకు తాడికల్‌-వన్నారం లింకు రోడ్డు తెగిపోయింది. రోడ్డు సమీపంలోని తాడికల్‌ ఊర చెరువు నిండి మత్తడి నీరు ప్రవహించడంతో దాదాపు వంద మీటర్ల పొడవున దెబ్బతిన్నది. ఇటీవలనే ఈ బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టగా, కాంట్రాక్టర్‌ నిధులు సరిపోవడం లేదని పనులు అర్ధాంతరంగా నిలిపివేశాడు. దీంతో రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సదరు కాంట్రాక్టర్‌ వెంటనే స్పందించి గండ్లు పూడ్చి, బీటీ రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆయా గ్రామాల సర్పంచులు పొలాడి కవిత, కీసర సుజాత కోరారు. 


logo