గురువారం 01 అక్టోబర్ 2020
Jagityal - Aug 15, 2020 , 03:42:46

అలికిడి యంత్రం.. జంతువులు పరార్‌

అలికిడి యంత్రం..  జంతువులు పరార్‌

  • ఎనిమిదో తరగతి విద్యార్థిని ఆవిష్కరణ

అడవి జంతువుల నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు చేల వద్దే పడుకుంటారు. జంతువుల అలికిడి వినగానే ఏదైనా శబ్దం చేసేవారు. దీని వల్ల రైతులు రాత్రిళ్లు ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇప్పుడా ఇక్కట్లు లేకుండా ఓ బాలిక అలికిడి పరికరాన్ని తయారు చేసింది. కేవలం వెయ్యి రూపాయల ఖర్చుతో రూపొందించిన ఈ యంత్రం, జంతువులను దూరం నుంచే పసిగట్టి, శబ్దంతో భయపెడుతుంది.        - రామగిరి 

రామగిరి మండలం సింగిరెడ్డిపల్లెకు చెందిన మేర్గు పద్మ, కనుకయ్య దంపతుల కూతురు రాజాంజలి. కనుకయ్యకు ముత్యాలలో వ్యవసాయ భూమి ఉన్నది. అక్కడ వివిధ పంటలు సాగు చేసేవాడు. అయితే అది అటవీ గ్రామం కావడంతో వన్యప్రాణుల బెడద ఉండేది. సరిగ్గా పంట చేతికి వచ్చే సమయంలో పంటలపై అవి దాడి చేసేవి. దాంతో నష్టం వాటిల్లుతుండేది. అందుకే ఆయన పంట పొలాల వద్దే రక్షణగా ఉండాల్సి వచ్చేది. ఈ విషయాన్ని కనుకయ్య తన భార్యకు చెబుతూ బాధపడుతుండగా, కూతురు రాజాంజలి ఎన్నోసార్లు విన్నది. చందనాపూర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ బాలిక, ఎలాగైనా ఆ సమస్యకు పరిష్కారం చూపాలని అనుకున్నది. ఆలోచన వచ్చిందే తడువుగా తన మేధస్సుకు పదును పెట్టింది. ఉపాధ్యాయుడు సంపత్‌ కుమార్‌ పర్యవేక్షణలో అడవిపందులు, కోతులు, మిడతల బెడద నివారణ కోసం పెద్ద శబ్దం చేసే అలికిడి పరికరాన్ని తయారు చేసింది. ఇందుకు కేవలం వెయ్యి ఖర్చు చేసింది. ఇది సెన్సార్‌తో పనిచేస్తుంది. పంటలపై దాడి చేసేందుకు వచ్చే జంతువులను సుమారు 5 నుంచి 7 మీటర్ల దూరం నుంచే పసిగడుతుంది. ఈ పరికరానికి ఉన్న యూఎస్‌బీ పోర్ట్‌ను యాక్టివేట్‌ చేస్తుంది. ఆ వెంటనే ట్రాన్స్‌సిస్టర్‌, లౌడ్‌ స్పీకర్ల ద్వారా వివిధ రకాల అరుపులను, భారీ శబ్దాలను చేస్తుంది. దీంతో జంతువులు అక్కడ నుంచి పారిపోతాయి. ఈ యంత్రం రాత్రి సమయాల్లో కూడా స్పష్టంగా పనిచేస్తుంది. పంటలను రక్షించుకునేందుకు రైతులు రాత్రిళ్లూ పంట చేల వద్ద కాపలా ఉండాల్సిన అవసరం ఇకలేదని రాజాంజలి చెబుతున్నది. 


logo