సోమవారం 21 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 14, 2020 , 03:17:30

పీస్‌ వారియర్స్‌గా ముందుకు రావాలి

పీస్‌ వారియర్స్‌గా ముందుకు రావాలి

కమిషనరేట్‌ పరిధిలో పీస్‌ వారియర్స్‌గా సేవలందించేందుకు ప్రజలు ముందుకు రావాలని సీపీ కమలాసన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. కమిషనరేట్‌ కేంద్రంలో గురువారం శాంతి, సంక్షేమ కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేయాలనే దురుద్దేశంతో ఎవరైనా తమ ఉనికిని చాటుకునే చర్యల్లో భాగంగా అరాచకాలకు పాల్పడితే సహించబోమన్నారు. ప్రజా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే, విధ్వంసాలు, మారణకాండకు పాల్పడితే కనీసం 10 నుంచి 15 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందన్నారు. బాధితులు తమకు అనుకూలంగా ఉండే ఇద్దరు, ముగ్గురితో కలిసి స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ సమావేశంలో అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌, టౌన్‌ ఏసీపీ అశోక్‌, ఎస్‌బీఐ ఇంద్రసేనారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు విజయ్‌కుమార్‌, విజ్ఞాన్‌రావు, తిరుమల్‌, ఆర్‌ఐ మల్లేశం, ఎస్‌ఐ స్వరూప్‌రాజ్‌, శాంతి, సంక్షేమ కమిటీ సభ్యులు గఫార్‌, ప్రదీప్‌సింగ్‌, రహమతుల్లాఖాన్‌, రఫీక్‌, అన్వర్‌ రజాఖాద్రీ, రమేశ్‌, ఘన్‌శ్యాంఓజా, తదితరులు పాల్గొన్నారు. 

సోషల్‌ మీడియా దుర్వినియోగం చేస్తే చర్యలు

కరీంనగర్‌ క్రైం: జిల్లా ప్రజలు శాంతియుత వాతావరణంలో ఉంటూ, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారని సీపీ కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. కొందరు  మత విశ్వాసాలకు భంగం కల్గించే విధంగా సోషల్‌ మీడియా వేదికగా అప్పుడప్పుడూ పోస్టులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, సోషల్‌ మీడియాలో వచ్చే దుష్ప్రచారాలను నమ్మవద్దన్నారు. మత సామరస్యాలను దెబ్బతీసేలా  ఏవైనా మీ దృష్టికి వచ్చిన పోస్టులను ఇతర గ్రూపులకు షేర్‌ చేయకుండా పోలీసుల దృష్టికి తీసుకువస్తే సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. తప్పుడు పోస్టులను ఇతరులకు షేర్‌ చేస్తే సదరు సోషల్‌ మీడియా గ్రూపులకు చెందిన నిర్వాహకులపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల కర్ణాటకలోని బెంగళూరు నగరంలో జరిగిన అల్లర్ల గురించి కొంతమంది కావాలని మతాల మధ్య గొడవలు సృష్టించే విధంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, అడ్మిన్‌లు జాగ్రత్తగా ఉండాలన్నారు. దుష్ప్రచారాలను షేర్‌ చేస్తే గ్రూప్‌ అడ్మిన్లపై సైబర్‌ చట్టాల కింద నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేస్తామన్నారు. యువకులు అనాలోచితమైన, అవాస్తవమైన విషయాలను నమ్మి కేసుల్లో ఇరుక్కుని బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు. గ్రూప్‌ అడ్మిన్‌లు తమ వాట్సాప్‌ గ్రూప్‌లో వివిధ వ్యక్తులు షేర్‌ చేసే విషయాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. 


logo