మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 14, 2020 , 03:17:29

నందనవనంలా తీర్చిదిద్దాలి

నందనవనంలా తీర్చిదిద్దాలి

జగిత్యాల: కరోనా నేపథ్యంలో మూసివేసిన ప్రభుత్వ పాఠశాలలను తిరిగి ప్రారంభించే నాటికి నందనవనాలుగా తీర్చిదిద్దాలని జగిత్యాల జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలోని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు, పాఠశాలల విద్యా కమిటీ మెంబర్ల  సహకారంతో పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గురువారం ఆమె తన కార్యాలయంలో జిల్లా విద్యాశాఖాధికారి, మండల విద్యాధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య డ్రైవ్‌ చేపట్టాలని ఆదేశించారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. మరుగుదొడ్లు సరిగా లేకపోతే ఈజీఎస్‌ నిధులతో మళ్లీ నిర్మించాలని చెప్పారు. పాఠశాల పరిసరాల్లో పిచ్చి మొక్కలు, వ్యర్థ పదార్థాలు, పాత సామగ్రి లేకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. బోర్‌, మోటర్ల వద్ద నీరు నిల్వ ఉండే ప్రదేశంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల జన్మదినం సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి, గార్డెన్‌ను తయారు చేసి విద్యార్థుల్లో నూతనోత్తేజంతోపాటు క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెంపొందించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా వాటిని ఆరికట్టవచ్చని విద్యార్థులకు తెలియజేయాలన్నారు. 100 శాతం పారిశుద్ధ్యం, హరితహారం కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సంబంధిత ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొనేలా తగు ఆదేశాలు జారీ చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో శ్రీనివాస్‌, డిప్యూటీ సీఈవో శ్రీలతరెడ్డి తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. logo