సోమవారం 21 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 13, 2020 , 01:54:25

మా మంచి మాస్టారు

మా మంచి మాస్టారు

  • lఆదర్శంగా ఒద్యారం ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం  
  • lవిద్యార్థులకు చదువుతోపాటు సామాజిక స్పృహ 
  • lఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు
  • lమంత్రి కేటీఆర్‌ నుంచి అభినందనలు

విద్యార్థులకు అక్షర జ్ఞానంతో పాటు సామాజిక సృహను కలిగిస్తున్నాడు ఒద్యారం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏనుగు ప్రభాకర్‌రావు. పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను వివరిస్తూనే, ఆటాపాటల్లో తర్ఫీదునిస్తూ తనదైన శైలిలో ముందుకుసాగుతున్నాడు. 2011లో కేంద్రం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికచేయగా అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు. 

- గంగాధర

ఏనుగు ప్రభాకర్‌రావు 1994లో సారంగాపూర్‌ మండలం తుంగూర్‌లో ప్రభుత్వ పాఠశాల  ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. విద్యార్థులకు విద్యాభోదన చేయడంతోపాటు సామాజిక సేవలపై అవగాహ కల్పించేవాడు. బడిబాట, బడి పండుగల పేరిట ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అపోహలను తొలగిస్తున్నాడు. తాను చదువు చెప్పిన బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాడు. 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు విశేష కృషి చేశాడు. విద్యార్థులచేత మొక్కలు నాటించి సంరక్షణకు వినూత్నంగా ముందుకుసాగుతున్నాడు. మొక్కలకు విద్యార్థుల పేర్లను పెట్టి వాటికి ఐడీ కార్డులు తగిలించి పెంచి పెద్ద చేస్తున్నాడు. అలాగే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపునకు చర్యలు చేపట్టి సఫలీకృతుడయ్యాడు.  

అవార్డులు.. రివార్డులు..

విద్యాభివృద్ధితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ప్రభాకర్‌రావు పలు అవార్డులు అందుకున్నాడు. 2005లో కలెక్టర్‌ పార్థసారథి, 2008లో రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి వైఎస్సార్‌, 2011లో జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపటిల్‌ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నాడు. వ్యక్తిగతంగానే కాకుండా 2012లో తుంగూర్‌ ప్రభుత్వ పాఠశాలకు ఉత్తమ పాఠశాల అవార్డు, జాతీయ స్థాయిలో బెస్ట్‌ ఇన్‌స్పైర్‌ అవార్డు వచ్చేలా కృషి చేశాడు. 2018లో ఒద్యారం ప్రభుత్వ పాఠశాలకు స్వచ్ఛ విద్యాలయ అవార్డు వరించడంలో తన కృషి ఎంతో ఉన్నది. 2018లోఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా అవార్డును అందుకున్నాడు. ఒద్యారం ప్రభుత్వ పాఠశాలలో 400 మొక్కలు నాటించి సంరక్షించిన విద్యార్థులకు సైన్స్‌ ప్రాజెక్టు క్రింద ఇంటర్నల్‌ మార్కులు కేటాయిస్తూ మంత్రి కేటీఆర్‌ నుంచి ప్రశంసలు పొందాడు. 

గుర్తింపు తీసుకువస్త..

26 ఏళ్లుగా ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న. విద్యార్థులకు చదువు ఒక్కటే ముఖ్యం కాదు. వారిని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే నా లక్ష్యం. సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేసిన. నిబద్ధతతో పనిచేసి ప్రభుత్వ బడులకు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తున్న. 

- ఏనుగు ప్రభాకర్‌రావు, ప్రధానోపాధ్యాయుడు


తాజావార్తలు


logo