శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 13, 2020 , 01:54:27

మా పల్లె సైంటిస్ట్‌లు

మా పల్లె సైంటిస్ట్‌లు

  •  సాగును సులువు చేసేందుకు  పరికరాల ఆవిష్కరణ
  • కలుపుతీత, పిచికారీ యంత్రాల తయారీ
  • కూలీల కొరతకు పరిష్కారం
  • ట్విట్టర్‌లో కిషన్‌కు మంత్రి కేటీఆర్‌  అభినందన 

వాళ్లందరూ సామాన్యులు.. ఒకరు మెకానిక్‌, మరో ఇద్దరు రైతులు.. వ్యవసాయం అంటే ఇష్టం.. సాగును సులభతరం చేసేందుకు వినూత్నంగా ఆలోచించారు. తమ సృజనాత్మకతకు పదనుపెట్టి, సరికొత్త పరికరాలను ఆవిష్కరించారు. మట్టి పరిమళాలను వెదజల్లుతూ ఆధునిక సాగుకు బాటలు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. - ఎల్లారెడ్డిపేట 

ఇప్పుడు ఎక్కడైనా రైతులు దున్నడం, పొలాన్ని చదును చేయడంలాంటి పనులను ట్రాక్టర్లతో చేస్తున్నారు. పురుగుల మందు పిచికారీకి అధునాతన స్ప్రేయర్లు మార్కెట్‌లో పుష్కలంగా దొరుకుతున్నాయి. అయినప్పటికీ కొన్ని సేద్యపు పనులకు సరైన సాధనాలు లేవు. ముఖ్యంగా పత్తి, వరి పంటల్లో కలుపుతీసేందుకు అనువైన యంత్రాలు అందుబాటులో లేవు. ఈ క్రమంలో సాగు ఖర్చుల్లో సగందాకా కూలీల కోసమే వెచ్చించాల్సి వస్తున్నది. ఇలాంటి అనేక సమస్యలను ఎదుర్కొనేందుకు కొందరు రైతన్నలు అనేక సరికొత్త పరికరాలను రూపొందిస్తూ సాటి రైతులకు సాయం చేస్తున్నారు. 

  మినీ టిల్లర్‌తో కలుపుతీత..

ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌కు చెందిన రాగి కిషన్‌ మెకానిక్‌. 1984 నుంచి గొల్లపల్లిలో పనిచేస్తున్నాడు. రెండు ఫీట్ల మధ్యలో వెళ్లేంత చిన్న మినీ పవర్‌ టిల్లర్‌ను సొంతంగా తయారు చేసి పలువురి మన్ననలను అందుకుంటున్నాడు. పత్తిలో కలుపుతీత, అంతర్గత దుక్కికి మూడు పళ్ల నాగలిని రూపొందించాడు. మినీ టిల్లర్‌కు నాగళ్లు, బ్లేడ్లు బిగించుకునే ఏర్పాట్లు చేశాడు. మూడు లీటర్ల డీజిల్‌తో రెండుగంటల వ్యవధిలో ఎకరం దుక్కి, కలుపు తీసేలా సాధనాన్ని తయారు చేశాడు. పాత ఆటో ఇంజిన్‌ సాయంతో 45 వేలు ఖర్చు చేసి టిల్లర్‌ను రూపొందించగా, మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో అభినందించారు. మినీ టిల్లర్‌ పని తీరును సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకొని, ప్రశంసించారు.  

సులువుగా పిచికారీ

రాజన్నపేటకు చెందిన న్యాలవల్లి అనిల్‌ 20 ఏళ్లుగా భూమిని కౌలుకు తీసుకుంటూ పత్తిని సాగుచేస్తున్నాడు. ఈ యేడు 35 ఎకరాల్లో పంట వేశాడు. ఇన్నాళ్లు పురుగుల మందుల పిచికారీకి తైవాన్‌ యంత్రం వినియోగించే వాడు. ఇందుకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చేది. పెద్ద సంఖ్యలో కూలీలను వినియోగించాల్సి వచ్చేది. ఈ సారి కరోనాతో కూలీలకు కొరత ఏర్పడింది. ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టేందుకు కొత్త పరికరానికి రూపకల్పన చేశాడు. ట్రాక్టర్‌ ఇంజిన్‌కే స్ప్రేయర్‌ యంత్రాన్ని బిగించి ఓ డ్రైవర్‌సాయంతో స్ప్రే పైన పడకుండా కొట్టేలా తయారు చేశాడు. ఈ యంత్రం తయారీకి 45 వేలు ఖర్చు చేశాడు. పదేండ్ల దాకా ఎలాంటి మరమ్మతులు చేయాల్సిన పనిలేదు. తయారు చేసేందుకు 15రోజులు పడుతుంది. దీనికి పంపు, డ్రమ్ములు, వైఫర్‌లు, స్టాండ్‌ పరికరాలు అవసరం. ఈ డ్రమ్ముల్లో 450 లీటర్ల పురుగుల మందు ద్రావణాన్ని నింపి ఒకే రోజు 30నుంచి 40 ఎకరాలకు పిచికారీ చేయవచ్చు. 

రైతులకు మేలు చేసేందుకే..

రైతులకు మేలు చేసేందుకు నా అనుభవంతోనే మినీ టిల్లర్‌ను తయారు చేసిన. 35 ఏళ్ల నుంచి నేను మెకానిక్‌గా పనిచేస్తున్న. అదే అనుభవం టిల్లర్‌ తయారుజేసేతందుకు     ఉపయోగపడ్డది. రెండు ఫీట్ల స్థలం నుంచి టిల్లర్‌ పొయ్యెటట్టు చేసిన. ఇది రైతులకు మంచిగ       ఉపయోగపడుతుంది. కేటీఆర్‌ సార్‌ గూడా ట్విట్టర్‌ పెట్టిండని నాకు జెప్పిర్రు. సంతోషమనిపించింది. రోటవేటర్‌గూడ తయారు జేస్త.           

-రాగి కిషన్‌, మెకానిక్‌ (బొప్పాపూర్‌)

పనిముట్టుతో కలుపు..

ఎల్లారెడ్డిపేట మండలం సింగారంకు చెందిన యాద సతీశ్‌ వరి పొలంలో కలుపు తీసేందుకు ఓ చిన్న పనిముట్టును తయారు చేశాడు. కేవలం 2500 ఖర్చుతో రూపొందించాడు. 5 ఫీట్ల పీవీసీ పైపు, 12ఎంఎం ఇనుప రాడ్డు, ఒకటిన్నర, రెండు ఫీట్ల (18+18) నిడివిగల 36 గొలుసుల సాయంతో ఈ పరికరాన్ని తయారు చేశాడు. దానిని వాడి ఒకే వ్యక్తితో తమ పొలం మొత్తం కలుపు తీసేలా దాన్ని రూపొందించాడు. సాధారణంగా ఒక ఎకరంలో కలుపుతీయాలంటే కనీసం పది మంది కూలీలు అవసరం ఉంటుంది. ఒక్కొక్కరికి కనీసం 400 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సాధనంతో తక్కువ ఖర్చు, కొద్ది సమయంలోనే కలుపు తీయవచ్చని చెబుతున్నారు. 

అద్దెకు అడుగుతున్నరు..

గతంలో నా దగ్గర పనిచేసే ఓ కూలీ చేనుకు పిచికారీ చేసిండు. చేతులు కడుక్కోకుండానే భోజనం చేయడంతో అపస్మారక స్థితికి చేరుకున్నడు. దీంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స చేయించిన. ఈ పరిస్థితులను చూసి మస్తు బాధపడ్డ. అందుకే ట్రాక్టర్‌కే డ్రమ్ములను ఏర్పాటుచేసి పిచికారీ యంత్రాన్ని తయారు చేసిన. మా ఊర్లోని రైతులు తమ పొలాల్లో పిచికారీ చేసేందుకు అద్దెకు అడుగుతున్నరు. 

-న్యాలవల్లి అనిల్‌, రైతు(తయారీదారు) రాజన్నపేట

పని తొందరగ కావాలని..

పొలంల తొందరగా కలుపుతీసేందుకు పనిముట్టును తయారుజేసిన. నేను హార్వెస్టర్‌ డ్రైవర్‌ను. ఏటా ఆంధ్రాలోని నెల్లూరుకు వెళ్తుంట. వరిలో కలుపు తీసేందుకు వాళ్లు నర్రెంగ పొరుకను వాడుతరు. నేనుగూడ మా పొలంల ట్రైజేసిన గాని వరి సీరుకపోయింది. దీంతోటి ఓ ప్లాస్టిక్‌ పీవీసీ పైపునకు ఓ సలాకను వెల్డింగ్‌జేయించి దానికి గొలుసులు ఫిట్‌ జేసిన. వరి మీద గుంజుకపోతే వరి కరాబుగాకుంట గొలుసు రంద్రాలల్ల గడ్డి జిక్కుకుని లోపలికి పోతది. అది మురిగి వరికి మంచి బలం అత్తది. ఒక ఎకరం పొలం గంటన్నరల కలుపుతీయచ్చు. మా పొలంల దీంతోటే కలుపుదీసిన. ఊర్లె ఇద్దరు, ముగ్గురు గూడ దీన్ని వాడుకున్నరు. -యాద సతీశ్‌, రైతు సింగారం (ఎల్లారెడ్డిపేట)logo