శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 12, 2020 , 02:57:32

ఆరెకరాలు.. లక్షా 66 వేలు

ఆరెకరాలు..  లక్షా 66 వేలు

  1. పెసర సాగుతో రెండు నెల్లలోనే  వచ్చిన ఆదాయం lసీఎం కేసీఆర్‌ పిలుపుతో రైతు నర్సయ్య నియంత్రిత సేద్యం lపంటమార్పిడిలో భాగంగా మేలో సాగు 
  2. జూలైలోనే చేతికి పంట lఎకరాకు 3.3 క్వింటాళ్ల చొప్పున 20 క్వింటాళ్ల వరకు దిగుబడి lఖర్చులన్నీ పోను లక్షా 40 వేల రాబడి

గంగాధర : ‘మార్కెట్ల డిమాండ్‌ ఉన్న పంటలనే సాగు చేద్దాం. లాభాలు పండిద్దాం’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుతో రైతులంతా సరికొత్తగా ‘సాగు’తున్నారు. వరి, పత్తి, పెసర, కందితోపాటు వినూత్నంగా పంటలు వేశారు. గంగాధర మండలం చెర్లపల్లి(ఆర్‌)కి చెందిన రైతు పుల్కం నర్సయ్య ఒక అడుగు ముందుకేశాడు. సీఎం సూచనతో నియంత్రిత సాగు పద్ధతిలో పంట మార్పిడికి శ్రీకారం చుట్టాడు. 

పచ్చిరొట్ట ఎరువుగా పెసర..

పెసరలో ఉండే రైజోబియం అనే బ్యాక్టీరియా.. పంటకు సత్తువ చేకూరడంతోపాటు మిత్రపురుగుల అభివృద్ధికి తోడ్పడుతుంది. యూరియా వాడకంతోపాటు పచ్చిరొట్ట కోసం వేసే జనుము, జీలుగ విత్తనాల ఖర్చును తగ్గిస్తుంది. పంట మార్పిడి విధానం వల్ల పప్పు దినుసుల దిగుబడి పెరుగుతుంది. రైతుకు అదనపు ఆదాయం లభిస్తుండగా, పచ్చిరొట్ట ఎరువుగా జనుము, జీలుగుకు బదులుగా పెసర వేయాలని నర్సయ్య అనుకున్నాడు.

 తక్కువ పెట్టుబడి.. ఎక్కువ రాబడి..

మే మొదటి వారంలో వరంగల్‌ నుంచి వరంగల్‌ గ్రీన్‌గ్రాం 42 అనే రకం పెసర విత్తనాలను కిలోకు 207 చొప్పున కొని 36 కిలోలు తెచ్చాడు. తనకు పదెకరాలు ఉండగా, ఆరు ఎకరాల్లో సాగు చేశాడు. విత్తనాలకు 7452, దుక్కి దున్నడానికి 6 వేలు, మందులకు 6 వేలు, కోతకు 6 వేల చొప్పున మొత్తం 25,452 వరకు ఖర్చు చేశాడు. 55 రోజుల తర్వాత అంటే.. జూలై రెండో వారంలో పంట చేతికి వచ్చింది. 17న పంట కోయించగా, ఎకరాకు దాదాపు 3.3 క్విటాళ్ల చొప్పున 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. క్వింటాలుకు 8,300 చెల్లించి కొనుగోలు చేస్తామని వరంగల్‌కు చెందిన ప్రైవేట్‌ కంపెనీ యాజమాన్యం తెలిపింది. ఈ లెక్కన 1,66,000 రానుండగా, ఖర్చులన్నీ పోను రైతుకు 1,40,548 మిగలనున్నాయి. 

తక్కువ సమయంలో  ఎక్కువ ఆదాయం..

పంటల మార్పిడి విధానంలో పంటలు సాగు చేయడం వల్ల జీవ వైవిధ్యం పెరుగుతుంది. పంటలను రక్షించే మిత్ర పురుగులు అభివృద్ధి చెంది పంటలను ఆశించే శత్రుపురుగులను నివారిస్తాయి. పప్పు ధాన్యాలు సాగు చేయడం వల్ల భూమి సారవంతంగా మారి నత్రజని ఎరువుల వాడకాన్ని తగ్గిస్తుంది. పప్పు దినుసుల దిగుబడి పెరగడం వల్ల ప్రజా అవసరాలు తీరడంతో కల్తీని నివారించవచ్చు. పప్పు దినుసుల సాగు వల్ల తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందడానికి అవకాశముంటుంది. వరి సాగు వల్ల ఆరు నెలల్లో వచ్చే ఆదాయం పప్పు దినుసుల సాగు వల్ల రెండు నెలల్లోనే వస్తుంది. జనుము, జీలుగు విత్తనాలకు బదులుగా పెసర వంటి పంటలు సాగు చేయడం వల్ల ఆదనపు ఆదాయం చేకూరుతుంది. పచ్చిరొట్ట ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది.

- రాజు, ఏవో (గంగాధర)logo