గురువారం 01 అక్టోబర్ 2020
Jagityal - Aug 10, 2020 , 01:37:38

‘భువన్‌'తో అక్రమాలకు చెక్‌

‘భువన్‌'తో అక్రమాలకు చెక్‌

మున్సిపాలిటీల్లో మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం భువన్‌ యాప్‌ను రూపొందించింది. కట్టడాల సమగ్ర సమాచారాన్ని సేకరించి శ్లాబుల ప్రకారం పనులు చేపట్టాలని భావిస్తున్నది. ఈ మేరకు అధికారులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు. ప్రతి భవనాన్ని 360 డిగ్రీల కోణంలో ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఇందులోని వివరాల ఆధారంగా ఏ భవనానికి ఎంత ఆస్తిపన్ను, నల్లాచార్జీలు వసూలు చేయాలో నిర్ణయించి సంబంధిత కేటగిరీలో చేర్చుతారు. ఆయా భవంతులపై అడ్వర్‌టైజ్‌మెంట్‌ బోర్డులు, సెల్‌టవర్లు ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే విషయాలపై నిర్ణయం తీసుకుంటారు.

సమకూరనున్న అదనపు ఆదాయం..

పట్టణాల్లో నివసిస్తున్న జనాభాకు అనుగుణంగా బల్దియాలకు ఆదాయం సమకూరడం లేదు. ముఖ్యంగా ఆస్తి, నల్లా పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. అయితే  పన్నుల మదింపు సక్రమంగా జరుగక పోవడంతో సర్కారు ఆదాయానికి దండిగా గండి పడుతున్నట్టు గుర్తించింది. పాత పద్ధతిలోనే పన్నుల వసూలు చేయడంతో గృహసముదాయాలను వ్యాపార అవసరాలకు వినియోగించినా అందుకు అదనపు పన్నులు చెల్లించడం లేదు. అలాగే ఆస్తి పన్ను పరిధిలోకి రాని అక్రమ నిర్మాణాలను గుర్తించి, పన్ను విధించేందుకు గతంలో సరైన వ్యవస్థ లేదు. ఇలాంటి అనేక లోసుగులకు ఈ యాప్‌తో తెరపడనున్నది. 

సెప్టెంబర్‌లో 10లోగా సమాచారం సేకరించాలి.. 

సెప్టెంబర్‌ 10వ తేదీలోగా సమాచారం సేకరించాలని మున్సిపాలిటీలను ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైన సాంకేతిక సిబ్బంది నియామకం, శిక్షణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో నివాసానికి సంబంధించి 360 డిగ్రీల కోణంలో ఫొటోలు, వైశాల్యం, నల్లా కనెక్షన్లు, విద్యుత్‌ మీటర్లు, భవంతులపై అడ్వర్‌టైజ్‌మెంట్‌ బోర్డులు, సెల్‌టవర్‌ ఇతర వివరాలన్నింటినీ పొందుపరచాలి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్వహించిన సమగ్ర సర్వే ఆధారంగా ఆయా భవంతులు వ్యాపార, వాణిజ్య సముదాల  వివరాలు తీసుకోనున్నారు. విద్యుత్‌శాఖ నుంచి మీటర్లు, వాణిజ్యశాఖ నుంచి వ్యాపార అనుమతులు, ప్లానింగ్‌ విభాగం నుంచి భవనాల వివరాలు సేకరిస్తారు. 


logo