సోమవారం 21 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 09, 2020 , 00:31:32

పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాలి

పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాలి

జగిత్యాల, నమస్తే తెలంగాణ: పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ గుగులోత్‌ రవి సూచించారు. స్వచ్ఛ భారత్‌ గ్రామీణ్‌ ద్వారా చేపడుతున్న ‘గందగీ ముక్త్‌ భారత్‌' కార్యక్రమం ద్వారా ఈ నెల 8నుంచి 15వ తేదీ వరకు గ్రామస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై క్యాంపు కార్యాలయం నుంచి వీసీ ద్వారా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలెక్టర్‌ శనివా రం మాట్లాడారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వారం ముందుగా ప్రతి గ్రామాన్ని గందగీ ముక్త్‌ భారత్‌ ద్వారా సుందరంగా తీర్చి దిద్దుకోవాలన్నారు. బహిరంగ సమావేశాలు నిర్వహించకుండా ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణను తయారు చేసుకోవాలన్నారు. ఈ నెల 9న సర్పంచుల ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి, వాటి నుంచి ఒకేసారి ప్లాస్టిక్‌ను వేరుచేసి, పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ప్రతిరోజూ కార్యక్రమాలను నిర్వహిస్తూ గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రోజువారీగా చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు సేకరించి డాక్యుమెంటేషన్‌ చేయాలన్నారు. గ్రామాల్లో వైకుంఠధామాలు, డంప్‌ యార్డులు, కంపోస్టు పిట్‌ నిర్మాణాలు ఈ నెల 15లోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మా స్కులు ధరించడంతోపాటు భౌతిక దూరా న్ని పాటించాలన్నారు. మాస్కులు ధరించని వారికి కొవిడ్‌-19 నిబంధనల మేరకు జరిమానా విధించాలన్నారు. గ్రామ పంచాయతీల్లో కరెంట్‌ బిల్లులు, ట్రాక్టర్‌ లోన్‌ వాయిదాలను ప్రతినెలా చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి శేఖర్‌, డివిజనల్‌ పంచాయతీ అధికారి ప్రభాకర్‌, స్వచ్ఛ భారత్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ చిరంజీవి పాల్గొన్నారు. 

పనులను వేగంగా పూర్తి చేయాలి

జగిత్యాల: కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ రవి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో చేపట్టి న కలెక్టరేట్‌ కార్యాలయ భవన నిర్మాణ పనులను ఆయన శనివారం పరిశీలించారు. కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ చాంబర్‌, ఆడిటోరియం, ఇతర కార్యాలయాల గదులు, వెయిటింగ్‌ హాల్‌, పార్కింగ్‌, ఓపెన్‌ ఆడిటోరియం పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. పను లు దాదాపు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. కార్యాలయం చుట్టూ మొక్కలు నాటాలని, డ్రైనేజీ, ప్రహరీ, విద్యుత్‌, సీలింగ్‌ తదితర పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. బిల్డింగ్‌ మ్యాప్‌ ప్రకారం ఎక్కడ ఏ కార్యాలయం ఉండాలో నిర్ణయించాలన్నారు. ప్రతి అంతస్తులో వీఐపీ, కామన్‌ టాయిలెట్లతో పాటు దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో దూరం నుంచి చూసినా కనబడేలా కార్యాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం మున్సిపల్‌ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. అదనపు కలెక్టర్లు బేతి రాజేశం, అరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు. 


logo