ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 08, 2020 , 00:50:53

మాస్కు మస్ట్‌ లేకుంటే... రిస్క్‌

మాస్కు మస్ట్‌ లేకుంటే... రిస్క్‌

మనుషుల అవసరాలకు అనుగుణంగా మార్కెట్లో మాస్క్‌లకు మస్తు డిమాండ్‌ పెరిగింది.  విభిన్నమైన రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అవగాహన లేక తమకు నచ్చిన వాటిని కొనుగోలు చేస్తూ ఇష్టారీతిన వినియోగిస్తున్నారు. మాస్క్‌లను ఎలా శుభ్రం చేయాలి? ఎన్ని రోజులు వాడాలి? అనే విషయం తెలియక ముప్పును కొని తెచ్చుకుంటున్నారు. ఈ విషయంలో నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. వారి సలహాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రకాల మాస్కులు వాటి వినియోగంపై ప్రత్యేక కథనం..

గతంలో మాస్కులను కేవలం దవాఖానల్లో వైద్య సిబ్బంది, హైరిస్క్‌ పేషెంట్లు మాత్రమే వాడేవారు. సామాన్యులు వీటిని అరుదుగా వినియోగించేవారు. శ్యాససంబంధ వ్యాధిగ్రస్తులు, దుమ్ము, ధూళి లాంటి అలర్జీతో బాధపడేవారు మాత్రమే ధరించేవారు. మాస్కులో అనేక రకాలు ఉన్నాయి. వాటి తయారీ, వాడే విధానంలోనూ తేడాలున్నాయి. 

సర్జికల్‌ మాస్కు..

ఈ మాస్కును సులువుగా కరిగిపోయే పేపర్‌ లాంటి వాటితో తయారు చేస్తారు. వీటిని శుభ్రం చేయడం చాలా కష్టం. తెలియని వారు వీటిని డిస్‌ఇన్ఫెక్ట్‌ చేసి మళ్లీ మళ్లీ వాడుతుంటారు. ఇది సరైన పద్ధతి కాదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. సర్జికల్‌ మాస్కు సెంటర్‌ పార్ట్‌ తయారీకి వినియోగించే మెటీరీయల్‌ వైరస్‌ను అంత సులభంగా లోపలికి పోనివ్వదు. అయితే ఈ మాస్కు ధరించినప్పటి నుంచి ఆరు గంటల వరకు పని చేస్తుంది. ఉతికినా, తడిపినా వెంటనే పాడై పోతుంది. వీటిని నిర్ణీత గడువు వరకు వాడి పారేయడమే మేలు. 

వైరస్‌ నాశనం చెందాలంటే...

కరోనా వైరస్‌ బయటి పొర ప్యాటీ ఆయిలీగా ఉంటుంది. అందువల్ల డిటర్జెంట్‌ను వాడకుండా మాస్కులను రుద్దుతూ ఉతికితే వైరస్‌ కోర్‌ భాగం మాత్రమే దెబ్బతింటుంది. వైరస్‌ వ్యాప్తికి కారణమయ్యేది ఆ భాగమేనని మైక్రోబయాలజిస్టులు చెబుతున్నారు. సబ్బు, డిటర్జెంట్‌ వాడితే జిగటగా ఉండే వైరస్‌ పైన ఉన్న లేయర్‌ పాడవుతుందని, దానివల్ల వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉండదని సూచిస్తున్నారు.

పీ-100 రెస్పిరేటరీ మాస్కు..

ఈ మాస్క్‌ ఆధునికమైనది. హైరిస్క్‌ ప్రాంతాల్లో ఎక్కువగా దీని వాడకం కనిపిస్తుంది. ముఖానికి బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి రక్షణ కవచంగా పని చేసి, 99.9 శాతం కణాలను శ్వాస కోశాల్లోకి చేరకుండా కాపాడుతుంది. 3 మైక్రాన్ల మందం కంటే ఎక్కువ సాంద్రత కలిగిన పొరలను కలిగి ఉండి వైరస్‌లను దరి చేరనివ్వదు. ఈ మాస్కుకు రెండు వైపులా పీ 100 ఫిల్టర్లు (వృత్తాకారంలో ఉండే మెత్తలు) ఉంటాయి. అవి అతి సూక్ష్మమైన రేణువులను సైతం శ్వాస కోశాల్లోకి వెళ్లకుండా నిరోధిస్తాయి. టియర్‌ గ్యాస్‌, అమ్మోనియం గ్యాస్‌ను అడ్డుకునే శక్తి ఉంటుంది. చల్లని, పొడి వాతావరణంలో వేడి, తేమను పెంచుతుంది. ఇందులో ఉండే వాల్వ్‌లు శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేస్తాయి. ఫిల్టర్లను నెలకోసారి మార్చుకుంటే సరిపోతుంది. ఈ మాస్కులు 3,500 నుంచి లభిస్తాయి. ఫిల్టర్లు వెయ్యి రూపాయల్లో దొరుకుతాయి. 

క్లాత్‌ మాస్కులు..

కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి చాలా మంది క్లాత్‌ మాస్కులను వినియోగిస్తున్నారు. ఈ మాస్కుల వినియోగమే మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నాణ్యమైన కాటన్‌ బట్టతో తయారు చేసిన వాటినే వాడాలని సూచిస్తున్నారు. క్లాత్‌ మాస్కులను శుభ్రం చేసేందుకు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. వైరస్‌ నాశనం చెందాలంటే 100 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మరిగించిన వేడి నీళ్లలో డిటర్జెంట్‌ వేసి ఉతకాలని చెబుతున్నారు. 

డ్యూటీ మాస్కులు..

హెల్త్‌ ప్రొఫెషనల్స్‌ వాడే డ్యూటీ మాస్కుల (సింగిల్‌ యూజ్డ్‌) విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎన్‌ 95, ఎఫ్‌ఎఫ్‌పీ2 మాస్కులను నీటితో శుభ్రం చేస్తే వాటిలో ఉండే ఫిల్టర్లు పాడవుతాయి. అందుకే వీటిని వాడి పారేయడమే ఉత్తమం. 

 తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి..

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. క్లాత్‌ మాస్కులను ప్రతిరోజూ సబ్బు ద్వారా వేడినీటిలో శుభ్రం చేసుకుంటే వైరస్‌ నశించిపోతుంది. మాస్కును ధరించిన తర్వాత చేతులతో తాకకూడదు. తీసేటప్పుడు ముఖంలోని అవయవాలకు తగలకుండా జాగ్రత్తగా తీయాలి.


logo