మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 04, 2020 , 02:32:45

కరోనా నియంత్రణపై బల్దియా దృష్టి

కరోనా నియంత్రణపై బల్దియా దృష్టి

  • nకంటైన్‌మెంట్‌ జోన్లలో ప్రత్యేక చర్యలు 
  • nహోం ఐసొలేషన్‌లో ఉన్న వారి   ఆరోగ్య పరిస్థితిపై ఆరా

కార్పొరేషన్‌: నగరంలో కరోనా నియంత్రణపై బల్దియా దృష్టి సారించింది.  పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించి నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. హోం ఐసొలేషన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని ప్రతి రోజు తెలుసుకునేందుకు ఇంటి ముందు నగర పాలక అధికారులు చార్టు (బోర్డు) ఏర్పాటు చేస్తున్నారు. అందులో వారు ఏ తేదీ నుంచి హోం ఐసొలేషన్‌లో ఉంటున్నారు,  ఆరోగ్య పరిస్థితి, తదితర వివరాలు నమోదు చేస్తారు.  పారిశుద్ధ్య విభాగం ఇన్‌స్పెక్టర్‌, జవాన్లు ప్రతి రోజు వచ్చి హోం ఐసొలేషన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ఆ చార్టుపై సంతకం చేస్తున్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బాధితులకు కూరగాయలు, నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. కరోనా బాధితులు తీవ్ర అస్వస్థతకు గురైతే వైద్యాధికారులకు సమాచారం అందించి, ప్రభుత్వ దవాఖానకు తరలిస్తున్నారు. బాధితుల వద్దకు వెళ్లి మనోధైర్యం కల్పిస్తున్నారు. 

పారిశుద్ధ్య పనులు ముమ్మరం

కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటిస్తున్నారు.  పాజిటివ్‌ వచ్చిన వారి ఇంటితో పాటు సమీపంలోని ఇండ్లల్లో సోడియం హైపో క్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు ఇతరులు వెళ్లకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్రాంత ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తూ, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. ఇండ్ల ముందు బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతున్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ కరోనా నియంత్రణకు కృషి చేయాలని నగరపాలక అధికారులు కోరుతున్నారు. 


logo