శనివారం 26 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 04, 2020 , 02:33:01

అభివృద్ధి పథంలో ‘గుండ్లపల్లి’

అభివృద్ధి పథంలో ‘గుండ్లపల్లి’

గన్నేరువరం: మండలంలోని గుండ్లపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధులతో సర్పంచ్‌ బేతెల్లి సమత ఆధ్వర్యంలో పాలకవర్గం అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వాడవాడలా సీసీ రోడ్లు నిర్మించారు. ఇంకుడుగుంతలు, మరుగుదొడ్డి ఆవశ్యకతపై ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామస్తులకు అవగాహన కల్పించడంతో ఇంటింటికీ నిర్మించుకొని వినియోగిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చెత్తబుట్టలు పంపిణీ చేయగా ఇండ్లల్లోని తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసి పారిశుద్ధ్య సిబ్బంది తీసుకువచ్చే వాహనంలో వేస్తున్నారు. ప్రతి రోజూ సేకరించిన చెత్తను డంపుయార్డుకు తరలిస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద సెగ్రిగేషన్‌ షెడ్డు కూడా నిర్మించారు. ఈజీఎస్‌ నిధులు రూ. 11 లక్షలు మంజూరు కాగా ఆధునిక హంగులతో వైకుంఠధామం నిర్మించారు. గ్రామంలో రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమిలో బ్లాక్‌ ప్లాంటేషన్‌లో భాగంగా రెవెన్యూ అధికారులు, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 2500 మొక్కలు నాటారు. అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా రోడ్లకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో 500 మొక్కలు నాటి, ట్రీగార్డులు ఏర్పాటు చేశారు. బెంగళూర్‌ నుంచి సుమారు 50 ఫాథోడియా మొక్కలు తీసుకువచ్చి స్థానిక ఎస్‌బీఐ ఎదుట నాటగా ఏపుగా పెరిగి పూలు పూస్తూ దారి వెంట వచ్చిపోయే వారిని ఆకట్టుకుంటున్నాయి. ప్రభుత్వం అందించిన ట్రాక్టర్‌ను పారిశుద్ధ్య పనులకు వినియోగించడంతో పాటు ట్యాంకర్‌ ఏర్పాటు చేసి మొక్కలకు నీళ్లు పడుతూ సంరక్షిస్తున్నారు. గ్రామ ప్రధాన కూడళ్లలో హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు చేశారు. ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. వారసంత, రైతు వేదిక నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఇటీవల భూమి పూజ చేయగా, పనులు వేగంగా జరుగుతున్నాయి. గ్రామంలోని వన నర్సరీలో పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలు పెంచుతుండగా ఏపుగా పెరిగాయి. ఖాళీ స్థలాలు, రోడ్లకు ఇరువైపులా నాటుతూ హరితహారం విజయవంతానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు. 

గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం 

ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. వందశాతం ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేశాం. వాడవాడలా సీసీ రోడ్లు, హరితహారం మొక్కల సంరక్షణకు ట్రీగార్డులు ఏర్పాటు చేశాం. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మండలంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాం. నిధులు మంజూరు చేస్తున్న సీఎం కేసీఆర్‌,  సహకరిస్తున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు కృతజ్ఞతలు.    -బేతెల్లి సమత, సర్పంచ్‌ 

స్వచ్ఛతకు ప్రాధాన్యం 

గ్రామంలో స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. పల్లె ప్రగతి నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. బెంగళూర్‌ నుంచి ఫాథోడియా మొక్కలు తెప్పించి ఎస్‌బీఐ బ్యాంకు ఎదుట నాటగా పూలు పూస్తూ దారి వెంట వచ్చిపోయే వారిని ఆకట్టుకుంటున్నాయి. హరితహారం మొక్కల సంరక్షణకు ట్రీగార్డులు ఏర్పాటు చేశాం. మరుగుదొడ్ల ఆవశ్యకతపై గ్రామస్తులకు అవగాహన కల్పించగా వినియోగిస్తున్నారు.

-అశ్విని, పంచాయతీ కార్యదర్శి

వైకుంఠధామం పూర్తయ్యింది

గ్రామంలో వైకుంఠధామం, కంపోస్ట్‌ షెడ్డు, డంపు యార్డు నిర్మాణాలు పూర్తయ్యాయి. రైతు వేదిక, వారసంత నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపుయార్డుకు తరలిస్తున్నారు. రైతుల సౌకర్యార్థం గ్రామంలో డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం, ప్రధాన కూడళ్లలో హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు చేశారు. పాలకవర్గ సభ్యులు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరిస్తున్నారు.                    -వంగల సత్యనారాయణ రెడ్డి, గ్రామస్తుడుlogo