మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Jagityal - Aug 03, 2020 , 01:23:55

తల్లి పాలే శ్రేష్ఠం

తల్లి పాలే శ్రేష్ఠం

  • బిడ్డకు సంతులిత ఆహారం
  • రోగ నిరోధక శక్తికి పునాది
  • ఆధునిక సమాజంలో పెరుగుతున్న డబ్బా పాల సంస్కృతి
  • ప్రారంభమైన తల్లిపాల వారోత్సవాలు
  • ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో వారం పాటు ప్రత్యేక కార్యక్రమాలు

జగిత్యాల : తల్లిపాలే బిడ్డకు అందించే మొట్టమొదటి పౌష్టికాహారం. బిడ్డకు తల్లి పాలు పట్టడం వల్ల ఇద్దరూ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వారి మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడుతుంది. అందుకే బిడ్డ పుట్టిన నాటి నుంచి 6 నెలల వయసు వరకు, అవసరాన్ని బట్టి ఏడాది వరకు తల్లిపాలే తాగించాలని వైద్యులు సూచిస్తారు. విటమిన్లు, ప్రోటీన్లు, సమపాళ్లలో ఉండడం వల్ల బిడ్డ శారీరక, మానసిక వికాసం వేగంగా వృద్ధి చెందుతుంది. కానీ ఆధునిక సమాజంలో చాలా మంది బిడ్డకు తల్లిపాలు పట్టడం లేదు. ఉద్యోగాలు, బిజీలైఫ్‌, శారీరక సౌందర్యం తగ్గుతుందనే అపోహ తదితర కారణాలతో పిల్లలకు డబ్బా పాలు, పౌడర్‌ పాలను అలవాటు చేస్తున్నారు. ఇది శిశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ పరిస్థితుల్లో శిశువుకు తల్లిపాలు పట్టాల్సిన ఆవశ్యకత, దాని వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించేందుకు ఏటా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.

పరిశోధనల్లో తేలిన విషయాలు

తల్లిపాలు తాగించడం వల్ల శిశువుకు శ్వాస సంబంధిత వ్యాధులు, చెవిలో ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అస్తమా, మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్‌(యూరీనరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్‌) రాకుండా కాపాడవచ్చు. చిన్నపేగు పెద్ద పేగుల సంబంధిత వ్యాధులు (గ్యాస్ట్రో నింటెస్టినల్‌ రిఫ్లెక్స్‌) రాకుండా నివారించవచ్చు. మెదడుపై పొరల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్ల్ల(బ్యాక్టీరియల్‌ మెనింగిటిస్‌) నుంచి కాపాడగలుగుతాం. కీళ్ల సంబంధిత వ్యాధులు(జువైనెల్‌ ర్యూమొటైడ్‌ ఆర్థిరైటిస్‌), తెల్లరక్త కణాల సంబంధిత వ్యాధులు(చైల్డ్‌హుడ్‌ లింపోమస్‌) రాకుండా కాపాడవచ్చు. తల్లిపాలు తాగిన వారికి డయాబెటిస్‌, ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని, గుండె పనితీరు, రక్త ప్రసరణ వ్యవస్థలో ఇబ్బందులు(మల్టీపుల్‌ స్కెలోరిసిస్‌) తలెత్తని ఆడవారిలో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం తక్కువని పరిశోధనల్లో తేలింది.

తల్లిపాలకు, ఇతర పాలకు తేడా

ఆవు పాలలో కేసిన్‌ అనే ప్రొటీన్‌ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఈ ప్రొటీన్‌ కడుపులోకి వెళ్లాక ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. దీంతో ఆహారం జీర్ణమవడం కష్టమవుతుంది. అదే తల్లిపాలలో ఈ ప్రొటీన్‌ తగినంత పరిమాణంలో ఉండడం వల్ల శిశువుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆహారం జీర్ణమవుతుంది. తల్లిపాలలో లాక్టోజ్‌ పరిమాణం(ఎల్‌/7జీ) ఉండగా ఆవు పాలలో అది (ఎల్‌/48జీ)గా ఉంటుంది. నాడీ వ్యవస్థ పనితీరులో అత్యంత కీలకపాత్ర పోషించే లాక్టోజ్‌ పరిమాణం ఎక్కువగా ఉండడం వల్ల తల్లిపాలు తాగే శిశువులు చురుగ్గా ఉంటారు. తల్లిపాలలో ఉండే లినోయిన్‌ ఆమ్లం శిశువు సంపూర్ణ వికాసానికి దోహదపడుతుంది. తల్లి పాలలో ఐరన్‌ 50 శాతం ఉంటుంది. ఆవు పాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఏ రకంగా చూసినా బిడ్డకు తల్లిపాలు పట్టడం తల్లీబిడ్డకు శ్రేయస్కరం. 

తల్లి పాటించాల్సిన పద్ధతులు

  • చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే బిడ్డకు పాలివ్వాలి
  •  వంగి పాలివ్వకూడదు
  •  పాలిచ్చిన ప్రతిసారి రెండు వైపులా పట్టించాలి
  •  పాలు తాగిన తర్వాత కొద్ది సేపటికి భుజాన వేసుకుని, తేరుకునే వరకు అదే స్థితిలో పడుకోబెట్టాలి 
  • బిడ్డ పాలు తాగడం పూర్తయిన తర్వాత పెదాలను శుభ్రపరచాలి
  • మొదటి ఆరు నెలల పాటు తల్లిపాలే బిడ్డకు పట్టించాలి.
  •  నాలుగు నెలల నుంచి ఆరు నెలల వ్యవధిలో మెత్తని ఆహారాన్ని బిడ్డకు అందించాలి
  • తరుచుగా, బరువు స్థిరంగా పెరగడం, హాయిగా నిద్రపోవడం, మూత్రం పోయడం వంటి లక్షణాల వల్ల బిడ్డకు పాలు సరిపోతున్నాయో లేదో తెలుసుకోవచ్చు  
  • బిడ్డకు మొదటి సంవత్సరం తల్లి ఇచ్చే పాలు శక్తిని ఇచ్చేవి మాత్రమే కాకుండా చిన్నతనంలో రోగనిరోధక శక్తి పెంపునకు పునాది అవుతాయి. 
  •  రెండేళ్ల వరకు పాలు ఇస్తూనే అనుబంధ ఆహారాన్ని అందించాలి.

డబ్ల్యూహెచ్‌వో ఆధ్వర్యంలో వారోత్సవాలు

తల్లిపాల ప్రాముఖ్యతపై అందరికీ అవగాహన కల్పించేందుకు ఏటా ఆగస్టు మొదటి వారంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వారం పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మన దేశంలో బీపీఎన్‌ఐ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మన జిల్లాలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ(ఐసీడీఎస్‌) ఆధ్వర్యంలో ఏటా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఐసీడీఎస్‌ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు తల్లిపాల ఆవశ్యకతను వివరిస్తూ గ్రామాల్లో పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.



logo