శనివారం 08 ఆగస్టు 2020
Jagityal - Aug 02, 2020 , 02:32:11

రూపు దిద్దుకుంటున్న బ్లాక్‌ ప్లాంటేషన్‌

రూపు దిద్దుకుంటున్న బ్లాక్‌ ప్లాంటేషన్‌

తిమ్మాపూర్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో బ్లాక్‌ ప్లాంటేషన్‌లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మండలంలోని మహాత్మానగర్‌, పొలంపల్లి, జూగుండ్ల, రేణికుంట, నుస్తులాపూర్‌, నల్లగొండ, పర్లపల్లి గ్రామాలను బ్లాక్‌ ప్లాంటేషన్‌ కింద ఎంపిక చేసి 5వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో జామ, సీతాఫలం, బత్తాయి, అల్లనేరేడు, దానిమ్మ, ఉసిరి, మామిడి తదితర పండ్ల మొక్కలు నాటుతున్నారు. పొలంపల్లి గ్రామంలో మంకీపుడ్‌ కోర్టు ఏర్పాటు చేయగా, ఇందులో వివిధ రకాలకు చెందిన వెయ్యి పండ్ల మొక్కలు నాటుతున్నారు. ఈ మొక్కలు పెరిగిన తర్వాత చిన్నపాటి అడవిలా కన్పించడంతో పాటు వన్య ప్రాణులకు నీడతో పాటు పండ్ల ద్వారా ఆహారం ఇస్తాయి. నాటిన ప్రతి మొక్కకూ నీరు పోయడంతోపాటు వాటి సంరక్షణకు ప్రత్యేకంగా వాచర్లను నియమిస్తున్నారు. 

ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రత్యేక ఏర్పాట్లు

హరితహారంలో భాగంగా ఎంపిక చేసిన గ్రామాల్లో బ్లాక్‌ ప్లాంటేషన్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మొక్కలను వరుస క్రమంలో నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎకరం, అర ఎకరంతో పాటు వీలైనంత స్థలంలో మొక్కలు నాటడంతో పాటు చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు.  ఎటు చూసినా ఒకే వరుస క్రమంలో ఉన్నట్లు కన్పించేలా ఆకర్షణీయంగా మొక్కలు నాటి పెంచుతున్నారు. 

ప్రముఖుల సందర్శన..

మహాత్మానగర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్‌ఎండీ కాలనీ రిక్రియేషన్‌ క్లబ్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన బ్లాక్‌ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను పరిశీలించేందుకు ఇటీవల పలువురు ప్రముఖులు వచ్చి సంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, కలెక్టర్‌ శశాంక, అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, డీఆర్డీవో వెంకటేశ్వర్‌రావు, ఎస్సారెస్పీ చీఫ్‌ ఇంజినీర్‌ శంకర్‌ తదితరులు బ్లాక్‌ ప్లాంటేషన్‌లో మొక్కలు నాటి పరిశీలించారు. 


logo