సోమవారం 28 సెప్టెంబర్ 2020
Jagityal - Jul 30, 2020 , 02:11:46

నూతన కెనాళ్లకు భూ సేకరణ కోసం జీవో జారీ

నూతన కెనాళ్లకు భూ సేకరణ కోసం జీవో జారీ

  • నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉత్తర్వులు  lవెల్లడించిన రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌

ధర్మారం: ధర్మారం మండ లం నంది రిజర్వాయర్‌, ఎస్సారెస్పీ కాలువలకు అనుబంధంగా కొత్తగా నిర్మించనున్న కెనాళ్లకు భూ సేకరణ కోసం జీవో జారీ అయింది. ఈమేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌ కుమార్‌ ఉత్తర్వులు జా రీ చేసినట్లు బుధవారం రాత్రి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‘నమస్తే’కు వెల్లడించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని ఎస్సారెస్పీ చివరి ఆయకట్టులో ఉన్న 10వేల ఎకరాలకు నీరందించేందుకు నంది రిజర్వాయర్‌ నుంచి ఎస్సారెస్పీ డీ-83 కెనాల్‌కు అనుసంధాన కెనాల్‌ కోసం 31.18 ఎకరాలు, అలాగే ధర్మారం మండలం పత్తిపాక, కొత్తపల్లి గ్రామాలకు నీరందించేందుకు బొమ్మారెడ్డిపల్లి శివారులోని ఎస్సారెస్పీ డీ-83/బీ  1 ఎల్‌ కాల్వకు అనుబంధంగా నిర్మించనున్న కెనాళ్ల నిర్మాణాలకు 35.38ఎకరాల భూమి అవసరం ఉంటుంది. ఈ క్రమంలో భూసేకరణ, పునరావాసం కోసం సవరించిన చట్టం 2016 (యాక్ట్‌ నంబర్‌ 21/2017) ప్రకారం జీవోఎంఎస్‌ 20ను జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ జీవో ఆధారంగా ధర్మపురి నియోజకవర్గం పరిధిలోని  పెండింగ్‌ సమస్యల గురించి నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌రావుతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే కాల్వలు తవ్వించి సాగు నీరందేలా  చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఎస్సారెస్పీ ఎస్‌ఈ శివకుమార్‌తోనూ మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. నంది రిజర్వాయర్‌ నుంచి ధర్మారం శివారులోని ఎస్సారెస్పీ కాలువకు అనుసంధానంగా నిర్మించే కొత్త కాల్వ నిర్మాణం, బొమ్మారెడ్డిపల్లి నుంచి డీ-83/బీ 1ఎల్‌ కాల్వకు అనుబంధంగా పత్తిపాక, కొత్తపల్లి గ్రామాల దాకా కొత్త కాల్వల నిర్మాణం, డీ-83/బీ కెనాల్‌కు అనుబంధంగా జగిత్యాల జిల్లా ఎండపల్లి నుంచి అంబారిపేట శివారులోని ఎస్సారెస్పీ డీ-83/ఏ కెనాల్‌ దాకా కొత్తగా తవ్వే కాల్వ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు, అంచనాలను వచ్చే నెల 3న హైదరాబాద్‌లోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో సమర్పిస్తామని మంత్రికి హామీ ఇచ్చినట్లు వివరించామని ఎస్‌ఈ తెలిపారు. కొత్త జీవోను అనుసరించి రైతుల నుంచి సేకరించిన భూములకు పరిహారం చెల్లింపు ప్రక్రియ పూర్తయిన క్రమంలో త్వరలోనే కాలువల పనులు ప్రారంభమవుతాయని మంత్రి వెల్లడించారు. కొత్తగా తవ్వే లింక్‌ కాల్వల నిర్మాణానికి ప్రభుత్వం జీవో జారీ చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.logo