గురువారం 01 అక్టోబర్ 2020
Jagityal - Jul 25, 2020 , 01:41:28

ప్రతి చెరువూ నిండాలి

ప్రతి చెరువూ నిండాలి

  •  ప్రతి ఎకరాకూ నీరందాలి
  •  నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షా  సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌

జగిత్యాల, నమస్తే తెలంగాణ: జగిత్యాల జిల్లాలోని ప్రతి చెరువూ నిండాలని, ప్రతి ఎకరాకూ సాగునీరు అందాలని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచించారు. నీటిపారుదల శాఖ అధికారులతో జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంత్రి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాళేశ్వరం, ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా పుష్కలమైన నీరు జిల్లాకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు ఎల్లంపల్లికి చెందిన వివిధ ప్యాకేజీలకు సంబంధించిన కాలువల ద్వారా నీరు జిల్లాలోని అన్ని మండలాలకు చేరువైందని వివరించారు. సీఎం కేసీఆర్‌ ఎస్సారెస్పీ పునర్జీవ ప థకం కింద వరద కాలువ ద్వారా ఎగువ ప్రాంతంలో ఉన్న కథలాపూర్‌, మేడిపల్లి మండలాల్లోని ప్రతి ఎకరానికి నీరు అందించాలని సంకల్పించారని, హైదరాబాద్‌లో ఈ విషయమై సమావేశం నిర్వహించిన సంగతి అధికారులందరికీ తెలిసిందేనని గుర్తు చేశారు. కథలాపూర్‌, మేడిపల్లి, మల్యాల, కొడిమ్యాల మండలాల్లోని వివిధ గ్రామాల చెరువులను పరిశీలించాలని, వరద కాలువకు తూములు ఏర్పాటు చేయడంతో వీలైనన్ని ఎక్కువ నింపాలని సూచించారు. ఒకవేళ తూముల ద్వా రా చెరువులను నింపలేని పరిస్థితి ఉంటే, లిఫ్ట్‌లతో నింపే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. అధికారులు వరద కాలువతో పాటు ఎగువ ప్రాంతంలో ఉన్న మండలాలను పరిశీలించి, నివేదికను రూపొందించాలని సూ చించారు. అనంతరం జడ్పీ చైర్‌ పర్సన్‌ దావ వసంత మాట్లాడుతూ, జగిత్యాల అర్బన్‌ మండలంలోని పెద్దకుంట, మైసమ్మకుంట, తదితర పది చెరువులను లిఫ్ట్‌ ద్వారా నింపే ఏర్పాటు చేయాలన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ, ఇబ్రహీంపట్నం మండలం డబ్బా, అమ్మక్కపేట, ఎర్రాపూర్‌, మేడిపల్లి, బండలింగాపూర్‌, మెట్‌పల్లి మండలం ఆత్మకూర్‌కు సంబంధించిన చెరువులను నింపే విషయాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ, మేడిపల్లి, తాటిపెల్లి, చెరువులను నింపాలని పేర్కొన్నారు. అలాగే డీ 53 కాలువ సామర్థ్యాన్ని పెంచాలని, రోళ్లవాగు వరకు ఎక్కువ నీటిని తీసుకువెళ్లే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. రోళ్లవాగు నుంచి లిఫ్ట్‌ ద్వారా చింతల చెరువును నింపే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ, మల్యాల మండలంలో 26, కొడిమ్యాలలో 26, రామడుగులో 30, గంగాధరలో 8 చెరువులను నింపే అంశాన్ని పరిశీలించాలని వివరించారు. రామడుగు మండలంలోని మోతె ఓటీపీని చేపట్టాలని, మల్యాల మండలంలో ఏడు లిఫ్ట్‌లను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా కొడిమ్యాల మైసమ్మ చెరువు కాలువను పూర్తి చేసి, లిఫ్ట్‌ ద్వారా నింపాలని, పోతారం చెరువు పంప్‌హౌస్‌ నుంచి సూరంపేట శ్యామల చెరువు నింపాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమావేశంలో పాల్గొన్న, కథలాపూర్‌ జడ్పీ సభ్యు డు నాగం భూమయ్య, ఆర్‌బీఎస్‌ జిల్లా సభ్యుడు శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ, కథలాపూర్‌, మేడిపల్లి మండలాలకు రెండు లిఫ్ట్‌లు ప్రతిపాదించాలని, మేడిపల్లి మండలంలో 20 చెరువులు నింపాలని కోరారు. సమావేశంలో జగిత్యాల అదనపు కలెక్టర్‌ బేతి రాజేశం, ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ఇంజినీరింగ్‌ అధికారులు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. 


logo