శనివారం 19 సెప్టెంబర్ 2020
Jagityal - Jul 23, 2020 , 02:43:45

అభివృద్ధికి కేరాఫ్‌ టీఆర్‌ఎస్‌

అభివృద్ధికి కేరాఫ్‌ టీఆర్‌ఎస్‌

జగిత్యాల : రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని, అభివృద్ధికి కేరాఫ్‌ టీఆర్‌ఎస్‌ పార్టీయేనని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. పట్టణంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే, మున్సిపల్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ శ్రావణి సమక్షంలో ఆరో వార్డు కౌన్సిలర్‌ కొలగాని ప్రేమలతాసత్యంతో పాటు 50 మంది టీఆర్‌ఎస్‌లో చేరగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె, పట్టణం అనే తేడా లేకుండా కరోనా లాంటి కష్టకాలంలోకూడా సీఎం కేసీఆర్‌ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నారని గుర్తు చేశారు. గతంలో ఏ ప్రభుత్వం మున్సిపాలిటీకి నిధులివ్వలేదని, ఒక్క టీఆర్‌ఎస్‌  మాత్రమే మున్సిపాలిటీలకు ప్రతి నెలా నిధులిస్తున్నదన్నారు. పట్టణాల్లో పచ్చదనం కోసం ప్రత్యేకించి బడ్జెట్‌ కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. రాబోయే రోజుల్లో పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, పార్టీ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్‌, కౌన్సిలర్లు  రాజేశ్‌, రాజ్‌కుమార్‌, శ్రీలత, అనిల్‌, నవీన్‌, గంగాసాగర్‌, నాయకులు శంకర్‌, సురేందర్‌రావు, మొగిలి, రామ్మోహన్‌ రావు, ప్రశాంత్‌రావు, సతీశ్‌రాజ్‌, ఆనంద్‌రావు, ఆరిఫ్‌, అంజయ్యగౌడ్‌, చంద్రశేఖర్‌, రాజు, పట్టణ యూత్‌ అధ్యక్షులు గిరి, ఉపాధ్యక్షుడు శేఖర్‌, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

ప్రభుత్వ విద్యకు మరింత ప్రోత్సాహం

జగిత్యాల టౌన్‌ : విద్యకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ పురాతన పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చక్కటి ప్రణాళికతో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శ్రావణి మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదివితే ఏ రంగంలోనైనా రాణిస్తారన్నారు. జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు  కోవిడ్‌-19 నేపథ్యంలో తగు జాగ్రత్తలు వహిస్తూ ఇంట్లో ఉండి ప్రభుత్వ చానళ్ల ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలు వీక్షించాలని తెలిపారు. సబ్జెక్టుల వారీగా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తామన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన వినీత, వెంకటేశ్వర్‌రావు, సామ్రాట్‌ 400 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ఆరు నోటు బుక్కుల చొప్పున అందించారు. కార్యక్రమంలో ఎంఈవో గాయత్రి, కౌన్సిలర్‌ నవీన్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ గణేశ్‌, వెలమ సంక్షేమ మండలి అధ్యక్షుడు పురుషోత్తంరావు, ప్రధానోపాధ్యాయుడు రామానుజం, ఉపాధ్యాయులు ఆనందరావు,  దేవయ్య, రజిత, అనిత, సురేందర్‌, రవీందర్‌, బీ సురేందర్‌, విద్యాదేవి, పద్మ, రాజేశ్‌, మునీంద్ర తదితరులు పాల్గొన్నారు. 

బాధిత కుటుంబానికి పరామర్శ

జగిత్యాల రూరల్‌ : జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు కమిటీ డైరెక్టర్‌ బట్టు అశోక్‌ గుండెపోటుతో మృతి చెందగా బుధవారం ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట జగిత్యాల ఏఎంసీ చైర్మన్‌ దామోదర్‌రావు, వైస్‌ చైర్మన్‌ మోసిన్‌, కౌన్సిలర్‌ జగదీశ్‌, నాయకులు తదితరులు ఉన్నారు. logo