గురువారం 01 అక్టోబర్ 2020
Jagityal - Jul 22, 2020 , 02:28:40

సంక్షేమ ఫలాలు ప్రతి గడపనూ ముద్దాడాలి

సంక్షేమ ఫలాలు ప్రతి గడపనూ ముద్దాడాలి

ధర్మపురి: ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హత ఉన్న ప్రతి గడపనూ ముద్దాడాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. కరీంనగర్‌ క్యాంపు కార్యాలయంలో ధర్మపురి నియోజకవర్గంలోని ఆరు మండలాల టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు, అనుబంధ శాఖల అధ్యక్ష, కార్యదర్శులతో మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విభాగాల వారీగా మంత్రి మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధ్ది కార్యక్రమాలపై టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. ఆరేళ్లుగా ప్రజల ఆదరాభిమానాలు ప్రభుత్వంపై మరింత బాధ్యతను పెంచాయనీ, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతీ ఒక్కరికీ వర్తింపజేయాలన్నారు.. పార్టీకి మూల స్తంభాలు కార్యకర్తలేననీ, వారిని మండల నాయకులు అశ్రద్ధ చేయవద్దని, అదే సమయంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు క్రమశిక్షణతో మెలగాలన్నారు. పార్టీకి నష్టం కలిగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాధ్యక్షుడికి ప్రభుత్వ కార్యక్రమాలపై పూర్తి అవగాహన ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. గ్రామంలో ఏ ఇంట్లో ఆపద ఉన్నా, తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించాలని, సమస్య పెద్దదైతే ఫోన్లో సంప్రదించి పరిష్కారం చూపాలని సూచించారు. తెలంగాణ సర్కారు ఏర్పడిన తర్వాత అభివృద్ధికి వేల కోట్ల నిధులు కేటాయించామని, ఒక్క ధర్మపురి నియోజకవర్గంలోనే ఈ ఆరేళ్లలో రూ.1500 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తుచేశారు. ప్రధానంగా మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథలు ప్రపంచ దేశాలకే రోల్‌మోడల్‌గా నిలిచాయన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ను అందిస్తూ విమర్శలకు తగిన గుణపాఠం చెప్పినట్లయిందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేసినట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ ప్రజలకు మన ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలిచిందన్నారు. నిస్సహాయులకు ఆసరా పింఛన్లు టంఛన్‌గా అందిస్తున్నామన్నారు. 


logo