శనివారం 19 సెప్టెంబర్ 2020
Jagityal - Jul 21, 2020 , 02:19:53

పల్లెకో ప్రకృతి వనం

పల్లెకో ప్రకృతి వనం

సారంగాపూర్‌: పల్లెల్లో ప్రకృతి వనాల ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. ప్రకృతి వనం పేరిట ప్రతి గ్రామంలో పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాలమైన స్థలంలో అన్ని హంగులతో గ్రామీణులకు ఆహ్లాదం పంచేలా పార్కులు రూపుదిద్దుకోనున్నాయి. పల్లెల్లో పచ్చదనం సంతరించుకోవాలని హరితహారంలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. సారంగాపూర్‌, బీర్‌పూర్‌ మండలాల్లో అధికారులు పల్లెప్రకృతి వనాల ఏర్పాటుకు స్థలాల సేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. సారంగాపూర్‌ మండలంలోని 18 గ్రామాలు, బీర్‌పూర్‌ మండలంలోని 15 గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పట్టణాల్లోని పార్కులను తలపించేలా పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ సరదాగా, ఉల్లాసంగా గడిపేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ప్రకృతి వనాల్లో పూలు, పండ్లు, ఔషధ మొక్కలను నాటనున్నారు. పార్క్‌ ఏర్పాటుకు ఒక్కో గ్రామంలో ఎకరం స్థలం సేకరిస్తున్నారు. దీనిని చదును చేయడం, దున్నడం, మొక్కలు నాటడం, వాటి సంరక్షణ పనులన్నీ ఉపాధిహామీ పథకంలో భాగంగా చేపడుతున్నారు. 

పచ్చదనమే ప్రధాన లక్ష్యం

పల్లెల్లో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నారు. హరితహారంలో భాగంగా గ్రామాల్లో కేటాయించిన స్థలాల్లో వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు నాటే కార్యక్రమం ఊపందుకున్నది. వీలైనంత త్వరగా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

అన్ని గ్రామాల్లో స్థలాల సేకరణ 

సారంగాపూర్‌ మండలంలో 18, బీర్‌పూర్‌ మండలంలో 15 గ్రామాల్లో పల్లెప్రకృతి వనాల ఏర్పాటుకు అధికారులు స్థలాలు సేకరిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఎకరం స్థలాన్ని గుర్తించి అప్పగించాలని అధికారులు సర్పంచులను ఆదేశించారు. ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించి స్థలాలను గుర్తిస్తున్నారు. సారంగాపూర్‌ మండలం రేచపల్లి గ్రామంలో ఇప్పటికే స్థలం కేటాయింపు ప్రకియ్ర పూర్తి కాగా, భూమి చదును పనులు ప్రారంభించారు. 

పల్లెవాసులకు ఆహ్లాదం పంచేలా..

ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న పల్లెప్రకృతి వనాలు ప్రజలకు ఆహ్లాదం కలిగించేలా ఉండేందుకు వివిధ రకాల మొక్కలు నాటనున్నారు. ప్రకృతి వనం బయట కదంబ, వేప, నెమలినార, మలబార్‌ వేప, ఆకాశ మల్లె, కానుగ, నిద్రగన్నేరు, బాదం, రావి, ఇప్ప, గుల్‌ మొహర్‌ తదితర మొక్కలు నాటుతారు.  మధ్య వరుసలో ఏడాకులపాల, పారిజాతం, జామ, పచ్చగన్నేరు, మందార, సీతాఫలం, నిమ్మ, దేవ  గన్నేరు, దానిమ్మ తదితర మొక్కలు నాటనున్నారు. లోపలి వరుసలో మల్లె, నంది వర్ధనం, గన్నేరు, తులసి, నిమ్మగడ్డి, నూరు వరహాలు, చిన్న సంపెంగ, కృష్ణతులసి, లవంగ తులసి, చిన్న నందివర్ధనం, తంగేడు, అడ్డ సరం తదితర మొక్కలను నాటుతారు.

చిట్టడవిలో నాటే మొక్కలు

పల్లెప్రకృతి వనంలో చిట్టడవిని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఉసిరి, నేరేడు, టేకు, వెలగ, వేప, ఇప్ప, శ్రీగంధం, రేగు, కుంకుడు, పనస, నెమలినార, చింత, జమ్మి, కానుగ, వెదురు, అల్లనేరేడు తదితర మొక్కలు నాటనున్నారు. logo