ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Jagityal - Jul 21, 2020 , 02:14:05

అన్నదమ్ముల ఆధునిక సేద్యం

అన్నదమ్ముల ఆధునిక సేద్యం

వారిద్దరూ అన్నదమ్ములు. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా వ్యవసాయంపై మక్కువతో పొలంబాట పట్టారు. అందరిలా కాకుండా ఏదైనా వినూత్నంగా చేయాలని సంకల్పించారు. రాష్ట్ర సర్కారు ప్రోత్సాహంతో తమకున్న రెండెకరాల్లో పాలీహౌస్‌ విధానంలో కూరగాయల సాగు మొదలు పెట్టి సిరులు కురిపిస్తున్నారు మెట్‌పల్లికి చెందిన ఎండీ రజాక్‌, రహ్మతుల్లా సోదరులు. రెండేళ్లుగా క్యాప్సికమ్‌, కీరదోస పండించి ఎకరానికి నికరంగా రూ.6 -10లక్షల పైనే ఆదాయం పొందగా, ప్రస్తుతం టమాట, బెండ, బీర, వంకాయ పండిస్తున్నారు. పూర్తిగా సేంద్రియ విధానంలో సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.     - మెట్‌పల్లి 

మెట్‌పల్లికి చెందిన ఎండీ రజాక్‌, రహ్మతుల్లా ఉన్నత విద్యావంతులు. వీరికి మెట్‌పల్లి మండలం మేడిపల్లి శివారులో వ్యవసాయ భూమి ఉంది. ఉద్యోగాల వైపు వెళ్లకుండా వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నాలుగేళ్ల కింద సర్కారు 75 శాతం సబ్సిడీపై అందించిన పాలీహౌస్‌లను రెండెకరాల్లో ఏర్పాటు చేసుకున్నారు. మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలు పండిస్తూ లాభాలు గడిస్తున్నారు. వీరిలో రజాక్‌ న్యాయవాద వృత్తిలో కొనసాగుతూనే సేద్యపు పనులు చేయడం విశేషం. 

క్యాప్సికం.. కీరతో సిరులు..

2017లో పాలీహౌస్‌లో ఎకరం చొప్పున క్యాప్సికం, కీర దోస వేశారు. మంచి దిగుబడులు వచ్చాయి. హైదరాబాద్‌, నిజామాబాద్‌, తదితర ప్రాంతాలకు ఎగుమతి చేశారు. క్యాప్సికం పంటకు పెట్టుబడి, సాగు ఖర్చులు రూ.2.10 లక్షలు పోను రూ.10 లక్షలపైనే నికర లాభం రాగా, కీరకు రూ.1.50 లక్షలు పెట్టుబడి, సాగు ఖర్చులు పోను రూ.6 లక్షల లాభం వచ్చింది. ప్రస్తుతం రెండెకరాల్లో టమాట, మిర్చి, వంకాయ, బెండ, బీర, అలసంద, కాకర, కొత్తిమీర, చిక్కుడు సాగు చేపట్టారు. కూరగాయలు పుష్కలంగా పండాయని, మరో వారం రోజుల్లో దిగుబడి మొదలవుతుందని రైతులు చెబుతున్నారు. ఎకరానికి రూ.13-15 వేలు పెట్టుబడి అయినట్లు చెప్పారు. 

పూర్తిగా సేంద్రియమే.. 

అధిక దిగుబడుల కోసం పలువురు కర్షకులు విచ్చలవిడిగా రసాయనాలు, పురుగుమందులు వాడుతూ నేల స్వభావాన్ని దెబ్బతీస్తున్న ఈ రోజుల్లో అన్నదమ్ములిద్దరూ పూర్తిగా సేంద్రియ సేద్యమే చేస్తున్నారు. సుభాష్‌పాలేకర్‌, కిషన్‌చందర్‌, కొరియన్‌ శాస్త్రవేత్త చౌహక్యూ ఆర్గానిక్‌ విధానాలను అనుసరిస్తూ స్వ యంగా పౌలీహౌస్‌ వద్ద జీవామృతం, వేప కషాయం, డీ కంపోజర్‌ ఎరువులను తయారు చేసి అందిస్తున్నారు. అంతేకాదు భూగర్భజలాల ఆధారంగానే పండిస్తున్నారు. అయితే బోరుబావి ద్వారా వచ్చే నీరు ఇంకిపోకుండా పాలీహౌస్‌ పక్కనే మట్టితో కట్టకట్టి.. టార్పాలిన్‌తో చిన్నపాటి పాంపాండ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. డ్రిప్‌ సాయంతో పాలీహౌస్‌లోని పంటలకు నీరందిస్తున్నారు. 

ఉద్యానవన శాఖ కమిషనర్‌ ప్రశంసలు 

సంప్రదాయ పంటలనే ఆధునికంగా పండిస్తున్న ఎండీ రజాక్‌, రహ్మతుల్లా తోటి రైతులకు ఆదర్శంగా నిలువడమే కాదు ప్రశంసలూ పొందుతున్నారు. గత నెల 18న రాష్ట్ర ఉద్యాన వన శాఖ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి, కలెక్టర్‌ రవి పాలీహౌస్‌ను సందర్శించారు. పంటలను పరిశీలించడంతోపాటు ఆర్గానిక్‌ ఎరువుల తయారీ విధానం, సాగు విధానాన్ని తెలుసుకొని ఇద్దరు సోదరులను అభినందించారు.

సొంతంగానే విక్రయానికి ఏర్పాట్లు..

పూర్తిగా సేంద్రియ ఉత్పత్తులు కావడం, మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉండడంతో ఈ యేడు నుంచి సొంతంగానే విక్రయించాలని రైతులు నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు వీరి పంట ఉత్పత్తులను మార్కెట్లో వ్యాపారులకు విక్రయించేవారు. అయితే దీని వల్ల సదరు వ్యాపారులు అడిగిన ధరకే ఇవ్వాల్సి వస్తుండడంతో మెట్‌పల్లి పట్టణంలో స్టాల్‌ ఏర్పాటు చేసి కూరగాయలు విక్రయించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని తెలిపారు.

నేరుగా విక్రయిస్తాం..

రెండెకరాల్లో పాలీహౌస్‌ ఏర్పాటు చేసుకున్నం. రెండేళ్ల కిందటి వరకు పూర్తిగా క్యాప్సికం, కీర వేసినం. స్థానికంగా మార్కెటింగ్‌ సౌకర్యం లేక హైదరాబాద్‌, నిజామాబాద్‌, తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసినం. మార్కెట్‌ వసతి లేకపోవడం, రవాణా భారం ఎక్కువకావడంతో ఇప్పుడు కూరగాయలు పండిస్తున్నం. పూర్తిగా సుభాష్‌పాలేకర్‌, కిషన్‌ చందర్‌, కొరియన్‌ శాస్త్రవేత్త చౌహక్యూ ఆర్గానిక్‌ విధానాలతో సాగుచేస్తున్నం. వ్యాపారులకు బదులు నేరుగా వినియోగదారులకే విక్రయించాలని అనుకుంటున్నం. త్వరలోనే మెట్‌పల్లి పట్టణంలోని పాత గ్రంథాలయం వద్ద స్టాల్‌ను ఏర్పాటు చేస్తున్నాం. - ఎండీ రజాక్‌, రైతు (న్యాయవాది)logo