శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Jagityal - Jul 18, 2020 , 02:54:49

కార్గో రయ్‌.. రయ్‌..

కార్గో రయ్‌.. రయ్‌..

ఆర్టీసీలో కొరియర్‌, పార్సిల్‌ సేవలు

lరీజియన్‌లో 24 బస్‌ సర్వీసులు 

lఅందుబాటులో  ఎస్‌ఎంఎస్‌, ట్రాకింగ్‌ 

lఉమ్మడి జిల్లాలో  13 బుకింగ్‌ కేంద్రాలు 

lవినియోగంపై విస్తృత ప్రచారం  

lరెండు నెలల్లో  54 లక్షల ఆదాయం 

 (జగిత్యాల, నమస్తే తెలంగాణ/ తెలంగాణచౌక్‌) 

సుదీర్ఘ చరిత్ర కలిగి, దేశంలోనే అతి పెద్ద కార్మిక విభాగంగా గుర్తింపు పొందిన ఆర్టీసీ సమైక్య రాష్ట్రంలో తన ఉనికిని కోల్పోయింది. సేవాభావం, కార్మికులకు ఉపాధి, మారుమూల ప్రాంతాలన్నింటినీ కలుపడమే లక్ష్యంగా కొన్ని దశాబ్దాల పాటు ముందుకు సాగిన ఆ సంస్థ, కాలక్రమంలో తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ ఆర్టీసీని పటిష్టం చేసేందుకు పలుసార్లు నిధులను మంజూరు చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో గతేడాది ఆర్టీసీ కార్మికులతో సమావేశమయ్యారు. ప్రయాణికులతోపాటు, సరుకుల రవాణా కూడా చేపట్టాలని, సంస్థను లాభాల మార్గంలో నడిపించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో టీఎస్‌ ఆర్టీసీ ఆధ్వర్యంలో వస్తు సామగ్రి రవాణాకు సంబంధించి కార్గో పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించడంతోపాటు, గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అంతేకాకుండా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కేంద్రాల పనివేళలు, సేవలు.. 

ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కార్గో బుకింగ్‌ కేంద్రాల్లో కొరియర్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. రవాణాతోపాటు, పార్సిల్స్‌ తీసుకోవడం, పంపించే ప్రక్రియ కొనసాగుతున్నది. ఎరువులు, ధాన్యం, కూరగాయలు, ఆకు కూరలు, పూలు, పండ్లు, పప్పు దినుసులు, రేషన్‌ దుకాణాలకు సంబంధించిన బియ్యం, వసతిగృహ, అంగన్‌వాడీ కేంద్రాలకు అవసరమైన వస్తువులు సరఫరా చేస్తున్నది. దాదాపు నలభై రకాల వస్తువులను కార్గో ద్వారా రవాణా చేసేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉన్నది.

వేగంగా సర్వీస్‌.. 

జూన్‌లో ప్రారంభమైన కార్గో రవాణా వ్యవస్థ మిగిలిన ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కంటే వేగంగా, భద్రంగా పనిచేస్తున్నది. సరుకులను త్వరితగతిన రవాణా చేసేందుకు ఆర్టీసీకి పుష్కలమైన అవకాశాలుండడంతో గంటల వ్యవధిలోనే గమ్యస్థానానికి చేరిపోతున్నది. జగిత్యాల నుంచి హైదరాబాద్‌కు ఆరుగంటల వ్యవధిలోనే సామగ్రిని తరలించే అవకాశమున్నది. నిజామాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి కరీంనగర్‌కు మూడున్నర గంటల వ్యవధిలోనే అందుతున్నది. జగిత్యాల నుంచి వరంగల్‌కు మూడు గంటల సమయం మాత్రమే పడుతున్నది. 

తక్కువ ఖర్చుతోనే రవాణా..

కార్గోలో సరుకుల రవాణాకు సంబంధించి పార్సిల్‌ బరువు, దూరం ఆధారంగా ధరను నిర్ణయించారు. రాష్ట్రంలో 250 గ్రాముల బరువు ఉన్న కవర్‌కు 250 కిలోమీటర్ల లోపు 50 సర్వీస్‌ చార్జీగా నిర్ణయించారు. 251 నుంచి 500 కిలోమీటర్ల దూరమైతే 75, 501 నుంచి 1500 కిలోమీటర్ల దూరమైతే 100 చొప్పున వసూలు చేస్తున్నారు. 250 కిలోమీటర్ల లోపు.. 50 కిలోల బరువు గల పార్సిల్‌ ఉంటే 75, క్వింటాల్‌కు 125 వసూలు చేస్తున్నారు. సర్వీస్‌ చార్జీలో హమాలీ చార్జీలు (అప్‌అండ్‌డౌన్‌) సైతం కలుపుకొని వసూలు చేస్తున్నారు. అలాగే హమాలీలకు బీమా సొమ్మును సైతం ఇందులో నుంచే చెల్లిస్తున్నారు. పార్సిల్‌కు సంబంధించి రవాణా సర్వీస్‌ చార్జి రూ.750 దాటినట్లయితే ఈ మొత్తంపై ఐదు శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారు.

కూరగాయలకు కొంత మినహాయింపు 

కూరగాయలు, పండ్లు, ఆకుకూరల రవాణాకు కొంత మినహాయింపు ఇచ్చారు. 25కిలోల బరువున్న కూరగాయలు 100 కిలో మీటర్ల వరకు 40 వసూలు చేస్తుండగా, 26 నుంచి 50 కిలోల వరకు 50, 51 నుంచి 80 కేజీల వరకు 60 వసూలు చేస్తున్నారు. 101 నుంచి 200 కిలోమీటర్ల వరకు 25 కేజీల బరువుకు 50 వసూలు చేస్తున్నారు. ఇలాగే ప్రతి వంద కిలోమీటర్లకు అదనంగా 10లు వసూలు చేయాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. 

సిబ్బంది నియామకం, విస్తృత ప్రచారం.. 

కార్గో బుకింగ్‌ కేంద్రానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. కండక్టర్‌, డ్రైవర్లను డిప్యుటేషన్లపై ఇద్దరు చొప్పున కేటాయించారు. వీరు కార్గో రవాణా, కొరియర్‌ అంశాలపై డిపో పరిధిలోని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సర్వీస్‌ బుకింగ్‌తో పాటు, గ్రామాల్లో కార్గో సర్వీసులను తిప్పుతూ ప్రచారం చేస్తున్నారు. అలాగే వివిధ వ్యాపార, వాణిజ్య సంఘాలతో సమావేశమై, ఆర్టీసీ కార్గో ద్వారా కొరియర్‌, సరుకు రవాణా నమ్మకంగా, వేగంగా ఉంటుందని వివరిస్తున్నారు. వివిధ పట్టణాలు, మండల కేంద్రాల్లో కార్గో సర్వీస్‌ల వివరాలను తెలియజేస్తూ పెద్ద బ్యానర్లను ఏర్పాటు చేస్తున్నారు. 

ప్రతి గ్రామంలో ఏజెంట్‌..

ప్రతి గ్రామంలో ఏజెంట్లను నియమించుకునేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఏజెంట్‌ వెయ్యి డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. వీరికి గ్రామంలో పార్సిల్స్‌ను బుక్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. పార్సిల్‌ ద్వారా సమకూరిన డబ్బులో 12 శాతం కమీషన్‌ను ఏజెంట్‌కు ఇస్తారు. అలాగే ఇతర ప్రాంతం నుంచి వచ్చిన సరుకును ఏజెంట్‌ గ్రామంలోని వ్యక్తులకు చేరవేస్తే పార్సిల్‌ రిసీవ్‌ చేసుకున్న వ్యక్తి వద్ద నుంచి పది కమీషన్‌ తీసుకోవడానికి ఆర్టీసీ అంగీకరించింది.

ఇప్పటికే 54 లక్షల ఆదాయం

కార్గో సేవలు ప్రారంభమైన తర్వాత మే నెలలో ఫెర్టిలైజర్‌ ఉత్పత్తుల రవాణాలో 96 ట్రిప్పులకు 5 లక్షలు రాగా, ధాన్యం 369 ట్రిప్పులకు 24 లక్షల 75 వేల ఆదాయం ఆర్టీసీకి వచ్చింది. జూన్‌ నెలలో 47 ట్రిప్పుల ద్వారా విత్తనాలు రవాణా చేసి 4 లక్షల 90 వేలు, 316 ధాన్యం ట్రిప్పులను రవాణా చేసి 19 లక్షల 70వేల ఆదాయం పొందింది. మొత్తంగా 54 లక్షల 35 వేలు ఆర్జించింది. 


  సద్వినియోగం చేసుకోవాలి

ఆర్టీసీ కార్గో సేవలను ఉమ్మడి జిల్లాలోని వ్యాపారులు, ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు, ఇతర వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. అతి తక్కువ చార్జీలతో రాష్ట్రంలోనే కాకుండా అంతర్రాష్ట్ర వ్యాప్తంగా సేవలు ప్రారంభమయ్యాయి. వేగంగా.. భద్రంగా సేవలు అందించడంలో ఆర్టీసీకి దశాబ్దాల చరిత్ర ఉంది. మరే సంస్థ ఇలాంటి సేవలు అందించడం లేదు. ఎస్‌ఎంఎస్‌, ట్రాకింగ్‌ సిస్టంతో రవాణా ఎక్కడ వరకు జరిగిందో సులభంగా తెలుసుకొనే వీలుంటుంది. 

- పల్లె జీవన్‌ప్రసాద్‌, ఆర్‌ఎం, కరీంనగర్‌ logo