గురువారం 26 నవంబర్ 2020
Jagityal - Jul 18, 2020 , 02:55:44

నర్సరీల్లోని ప్రతి మొక్కనూ నాటి కాపాడాలి

నర్సరీల్లోని ప్రతి మొక్కనూ నాటి కాపాడాలి

  •   పంచాయతీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌    సెక్రటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా
  •   కలెక్టరేట్‌లో అభివృద్ధి పనులపై    సమీక్షా సమావేశం 

కార్పొరేషన్‌: నర్సరీల్లోని ప్రతి మొక్కనూ నాటి కాపాడినప్పుడే హరితహారం లక్ష్యం నెరవేరుతుందని పంచాయతీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా పేర్కొన్నారు. శుక్రవారం గన్నేరువరం, తిమ్మాపూర్‌ మండలాల్లో పర్యటించిన అనంతరం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15లోగా హరితహారంలో నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని సూచించారు. పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన వైకుంఠధామాలు, కంపోస్ట్‌ షెడ్ల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనుల పురోగతిపై కచ్చితమైన సమాచారం ఇవ్వాలని డీపీవోకు సూచించారు. గ్రామైక్య సంఘాల నిర్వహణ తీరు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. మున్ముందు గోపాలమిత్ర సేవలు ప్రాధాన్యత సంతరించుకోనున్నాయని చెప్పారు. అధికారులు సమన్వయంతో ముందుకెళ్లినప్పుడే సత్ఫలితాలు సాధ్యమని పేర్కొన్నారు. సమావేశంలో కలెక్టర్‌ శశాంక, అదనపు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌లాల్‌, డీఆర్వో వెంకటమాధవరావు, డీఆర్‌డీవో వెంకటేశ్వర్‌రావు, ట్రైనీ కలెక్టర్‌ అంకిత్‌, డీపీవో రఘువరన్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ విష్ణువర్ధన్‌, స్పెషల్‌ ఆఫీసర్లు, అన్ని మండలాల మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల తీరు అభినందనీయం

కరీంనగర్‌ క్రైం: కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో మొక్కలు నాటి సంరక్షించడం అభినందనీయమని పంచాయతీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్‌ సిటీ పోలీసు శిక్షణ కేంద్రం ఆవరణలో మియావాకి పద్ధతిలో నాటిన మొక్కలను పరిశీలించారు. సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై సీపీ కమలాసన్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మొక్కలు నాటారు. ఇక్కడ సీపీటీసీ ప్రిన్సిపాల్‌, అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ శివభాస్కర్‌, బల్దియా కమిషనర్‌ క్రాంతి, ఇన్‌స్పెక్టర్లు నాగేశ్వర్‌రావు, కిరణ్‌కుమార్‌ ఉన్నారు. 

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

కార్పొరేషన్‌:అభివృద్ధి పనుల్లో వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కే శశాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు వేదిక, కల్లాలు, డంప్‌యార్డులు, శ్మశానవాటికల పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పంచాయతీ పాలకవర్గాలు, కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశాల మేరకు ఆగస్టు 15లోగా హరితహారంలో నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని సూచించారు. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.