గురువారం 24 సెప్టెంబర్ 2020
Jagityal - Jul 18, 2020 , 02:55:57

స్మృతివనం ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు

స్మృతివనం ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు

  •  నగర మేయర్‌ వై. సునీల్‌రావు
  •  ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌కు స్థల పరిశీలన

కార్పొరేషన్‌: నగరంలోని ప్రజలందరికీ ఆహ్లాదకరంగా ఉండే విధంగా త్వరలోనే స్మృతివనం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్‌ వై.సునీల్‌రావు తెలిపారు. శుక్రవారం కమిషనర్‌ క్రాంతి, తహసీల్దార్‌ వెంకటేశ్‌తో కలిసి మానేరు డ్యాం వద్ద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పద్మనగర్‌లో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌కు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వద్ద ఆధునిక పబ్లిక్‌ టాయిలెట్స్‌ కోసం స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానేరు డ్యాం సమీపంలో   ఐదెకరాల స్థలంలో స్మృతివనం ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి సంబంధించిన స్థలానికి ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి చదును చేయాలని అధికారులను ఆదేశించారు. నగర ప్రజలకు అన్ని వసతులు ఒకే ప్రాంతంలో అందించే విధంగా ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. పద్మనగర్‌లోని స్థలాన్ని పరిశీలించి ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆధునిక పబ్లిక్‌ టాయిలెట్స్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజలకు  ఈ పబ్లిక్‌ టాయిలెట్స్‌ అందుబాటులోఉంటాయన్నారు. నగరపాలక అధికారులు పాల్గొన్నారు.

రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటుతాం

 నగరంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటుతామని నగర మేయర్‌ వై.సునీల్‌రావు తెలిపారు. శుక్రవారం హరితహారంలో భాగంగా 24, 25వ డివిజన్లలోని కిసాన్‌నగర్‌ రోడ్డులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు, గృహిణులు హరితహారంలో ఉత్సాహంగా పాల్గొనడం సంతోషకరమన్నారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షిస్తామని స్థానిక మహిళలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. రహదారులకు ఇరువైపులా మొక్కలు పెంచితే అవి పెరిగి వృక్షాలుగా మారి ఆహ్లాదకరమైన వాతావరణంతోపాటు నీడనిస్తాయని తెలిపారు. పరిసరాలతోపాటు రోడ్లు, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి  సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో నగర కమిషనర్‌ క్రాంతి, కార్పొరేటర్లు సరిత, తిరుపతి,  సిబ్బంది పాల్గొన్నారు. 

ప్రభుత్వ స్థలాల్లో  మొక్కలు నాటాలి

నగరంలోని ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని నగర మేయర్‌ వై.సునీల్‌రావు తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందితో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని ప్రభుత్వ అధికారులు తమ శాఖలకు చెందిన ఖాళీ స్థలాల వివరాలు అందించాలని కోరారు. నగరపాలక సంస్థ నుంచి ప్రభుత్వ స్థలాల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అధికారులు సూచించిన స్థలాల్లో పూలు, పండ్లు, ఔషధ మొక్కలు నాటిస్తామన్నారు. మొక్కల సంరక్షణ  బాధ్యత నగరపాలక సంస్థతోపాటు అధికారులు కూడా తీసుకోవాలని కోరారు. హరితహారం కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నగర కమిషనర్‌ క్రాంతి, అధికారులు పాల్గొన్నారు. logo