శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Jagityal - Jul 17, 2020 , 02:06:27

సీఎం మెచ్చిన సారు

సీఎం మెచ్చిన సారు

  • lపత్తిపాక హెచ్‌ఎంకు అభినందనలు
  • lహైదరాబాద్‌లో జరిగిన విద్యా సదస్సులో ప్రస్తావన
  • lబడిని హరితవనంగా మార్చడంపై ప్రశంసలు
  • lఅవార్డుకు ఎంపిక చేయాలని   అధికారులకు సూచన

విద్యాబోధనే కాదు.. తీరొక్క మొక్కలు, కూరగాయల సాగుతో పాఠశాలను ఉద్యానవనంలా మార్చిన పత్తిపాక హెచ్‌ఎం పీఎం షేక్‌ను సీఎం కేసీఆర్‌ అభినందించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన విద్యాసదస్సులో ఈ మాస్టారు పేరు ప్రస్తావనకు రావడంతో మెచ్చుకున్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించాలని, పురస్కారాలను ఎంపిక చేయాలని అధికారులకు సూచించగా, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. - ధర్మారం

ధర్మారం: ధర్మారం మండలం పత్తిపాక జడ్పీ ఉన్నత పాఠశాల గుట్టబోరు ప్రాంతంలో రాళ్లు రప్పలతో నిండి ఉండేది. కొన్ని గదులు గుట్టబోరు మీద, మరికొన్ని గదులు కింద ఉండేవి. 2015లో పాఠశాల హెచ్‌ఎంగా బాధ్యతలు స్వీకరించిన కరీంనగర్‌ జిల్లాకు చెందిన పీర్‌ మహ్మద్‌ షేక్‌ బడిని ఓవైపు విద్యాబోధన చేస్తూనే పిల్లల ఆహ్లాదానికి బడిని నందనవనంలా మార్చాలని సంకల్పించారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో పని మొదలు పెట్టారు. ముందుగా విద్యాభోదనపై దృష్టి పెట్టారు. ఆయన వచ్చిన కొత్తలో పాఠశాలలో ఉత్తీర్ణత శాతం కేవలం 45 శాతమే ఉండగా, ఉపాధ్యాయులతో కలిసి ప్రణాళిక వేశారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగుతులు బోధించారు. ఫలితాలను క్రమంగా పెంచుతూ వచ్చారు. ఈ క్రమంలో రెండేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదవుతున్నది. 

ఉద్యానవనంగా బడి

రెండో విడత హరితహారం నుంచి పాఠశాలలో 500 మొక్కలు నాటి పెంచి పెద్ద చేశాడు. అలాగే పాఠశాలలో ఫ్రూట్‌ గార్డెన్‌ను ఏర్పాటు చేశారు. సీతాఫలం, జామ, బొప్పాయి పండ్ల మొక్కలు పెట్టి సంరక్షించారు. అలాగే బర్త్‌డే గార్డెన్‌కు శ్రీకారం చుట్టారు. విద్యార్థుల పుట్టిన రోజు సందర్భంగా ఒక మొక్క నాటాలనే నిబంధన పెట్టడడంతో కొద్దిరోజుల్లోనే పాఠశాల పచ్చనిహారంగా మారింది. ఇక ఇంకా విశేషం ఏమిటంటే పిల్లలకు మధ్యాహ్న భోజనం కోసం కూరగాయలు బయట కొనే పనిలేకుండా పాఠశాలలోనే సాగు చేస్తున్నారు. కిచెన్‌ గార్డెన్‌లో భాగంగా ఉపాధ్యాయులు, విద్యార్థులే స్వయంగా కొంత స్థలాన్ని చదును చేసి పాలకూర, కొత్తిమీర, బెండకాయ, సోరకాయ, కాకరకాయల సాగు చేపట్టారు. అలాగే విద్యార్థులు రక్త హీనత పోగేట్టేందుకు ప్రత్యేకంగా బచ్చలి కూర, గోంగూర, చుక్కకూర, కరివేపాకును పెంచడంతోపాటు వారానికోసారి కరివేపాకు పొడిని భోజనంలో అందించారు. 

సీఎం అభినందనలు..

విద్యాబోధనే కాదు విద్యార్థుల ఆహ్లాదం, ఆరోగ్యం కోసం అనేక కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్న పత్తిపాక జడ్పీ పాఠశాల హెచ్‌ఎం పీర్‌ మహ్మద్‌ షేక్‌(పీఎం షేక్‌)ను సీఎం కేసీఆర్‌ అభినందించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన విద్యా సదస్సులో పీఎం షేక్‌ పేరును అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా, ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇలాంటి ఉపాధ్యాయులను ప్రోత్సహించాలని, అవార్డులు అందించాలని  సూచించారు.logo