గురువారం 01 అక్టోబర్ 2020
Jagityal - Jul 15, 2020 , 02:26:17

నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి

నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి

  • మేయర్‌ వై సునీల్‌రావు
  • 30, 40వ డివిజన్లలో హరితహారం 

కార్పొరేషన్‌: నగరంలో హరితహారంలో భాగంగా నాటిన ప్రతి  మొక్కనూ సంరక్షించాలని మేయర్‌ వై సునీల్‌రావు ప్రజలకు పిలుపు నిచ్చారు. మంగళవారం 30, 40వ డివిజన్లలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ డివిజన్లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. మొక్కలను సంరక్షించడం కార్పొరేటర్లు, అధికారుల బాధ్యతతో పాటు ప్రజలు కూడా సహకరించాలన్నారు. ప్రతి మొక్కకు వర్మి కంపోస్టు ఎరువు, ఎర్ర మట్టి, సపోర్టు కోసం కర్ర, ట్రీ గార్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో పెద్ద సంఖ్యలో బ్లాక్‌ ప్లాంటేషన్‌, మియావాకి పద్ధతిలో మొక్కలు నాటుతున్నామన్నారు. త్వరలోనే నగరంలోని ప్రతి ఇంటికి ఆరు చొప్పున కోరుకున్న మొక్కలు పంపిణీ చేస్తామని తెలిపారు. విరివిగా మొకలు నాటి కరీంనగర్‌ను హరితనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.  హరితహారం కోసం బల్దియా బడ్జెట్‌లో ప్రత్యేకంగా గ్రీన్‌ బడ్జెట్‌ కేటాయింపులు చేశామన్నారు. నగరంలో రోడ్లు, మురుగు కాలువల అభివృద్ధితో పాటు పచ్చదనం పెంపు కోసం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై తమ ఇంటి ముందు నాటే మొక్కలకు బాధ్యతగా నీళ్లు పోసి పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నేతికుంట యాదయ్య, భూమాగౌడ్‌, నగరపాలక అధికారులు గంగాధర్‌, పర్శరాములు, నరేందర్‌, తదితరులు పాల్గొన్నారు. 

కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి

కార్పొరేషన్‌: ప్రతి ఒక్కరూ కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ నగరంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు సహకరించాలని మేయర్‌ వై సునీల్‌రావు ఒక ప్రకటనలో కోరారు. రోజు రోజుకూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజలు గుంపులు గుంపులుగా తిరగడంతో వైరస్‌ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. అవసరం ఉంటేనే ఇండ్ల నుంచి బయటకు రావాలన్నారు.  బయటకు వచ్చినప్పుడు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాల్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో  పారిశుద్ధ్య పనులు, సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేయిస్తున్నట్లు తెలిపారు. నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 


logo