శనివారం 19 సెప్టెంబర్ 2020
Jagityal - Jul 13, 2020 , 02:12:06

చారిత్రక ప్రాంతానికి పర్యాటక సొబగులు

చారిత్రక ప్రాంతానికి పర్యాటక సొబగులు

చారిత్రక ప్రాంతంగా విలసిల్లుతూ, అనేక సహజసిద్ధ అందాలకు నెలవైన నందిమేడారానికి పర్యాటక శోభ రాబోతున్నది. ఇక్కడి కాకతీయుల కాలంలో నిర్మించిన పెద్ద చెరువు.. ప్రస్తుత నంది రిజర్వాయర్‌ను టూరిస్ట్‌ స్పాట్‌గా మార్చేందుకు ప్రణాళిక సిద్ధమవుతున్నది. తొలుత పాత చెరువు శిఖం 40 ఎకరాల స్థలాన్ని ఉద్యానవనంగా తీర్చిదిద్దాలని నిర్ణయం జరుగగా, యంత్రాంగం రంగంలోకి దిగింది. కట్ట ముందు ప్రాంతాన్ని చదును చేయించడంతోపాటు 5 నుంచి 10వేల మొక్కలు పెట్టేందుకు కార్యాచరణ రూపొందించింది. ఓవైపు రిజర్వాయర్‌లో బోటింగ్‌ సౌకర్యానికి ఏర్పాట్లు చేస్తూనే, మరోవైపు మెగాప్లాంటేషన్‌కు అడుగులు పడుతుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.  

పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.. 

నంది రిజర్వాయర్‌ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. తొలుత కట్ట కింద ఉద్యాన వనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. త్వరలోనే 10 వేల మొక్కలు నాటబోతున్నాం. నంది పంప్‌హౌస్‌, రిజర్వాయర్‌ సందర్శనకు వచ్చే పర్యాటకులు సేద తీరేందుకు ఉద్యానవనం ఎంతో దోహదపడుతుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ ప్రాంతం టూరిస్టు స్పాట్‌గా మారుతుంది. - కొప్పుల ఈశ్వర్‌, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి  

నంది మేడారం గ్రామం చారిత్రక సంపదతో విరాజిల్లుతున్నది. ఇక్కడ కాకతీయ రెండో రాజు అయిన మేడరాజు పాలించారనీ, అందుకే  కాకతీయ చిహ్నంగా భావించే నంది విగ్రహం ఉండడంవల్లే నంది మేడారంగా పేరు వచ్చినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. ఈ గ్రామంలోని పెద్ద చెరువు కాళేశ్వరం ప్రాజెక్టులో రిజర్వాయర్‌గా రూపుదిద్దుకోవడం, ప్రభుత్వం కూడా ప్రాజెక్టులోని రిజర్వాయర్లు, బరాజ్‌లను టూరిస్టు ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తుండడంతో మంత్రి కొప్పుల ప్రత్యేక దృష్టి పెట్టారు. 

నందిమేడారం అంటే మక్కువ ఎక్కువ.. 

ఒకప్పటి మేడారం శాసనసభ నియోజకవర్గమే ఇప్పటి నందిమేడారం. ఇక్కడి నుంచే 2004లో కొప్పుల ఈశ్వర్‌ తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత పునర్విభజనలో ఈ నియోజవర్గ కేంద్రం ధర్మపురికి మారినప్పటికీ పాత నియోజకవర్గకేంద్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. రిజర్వాయర్‌ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చాలని ముందునుంచీ అనుకుంటున్నారు. ప్రభుత్వం కూడా అందుకు సానుకూలంగా ఉండడంతో ఆ దిశగా చర్యలు చేపట్టారు. ముందుగా రిజర్వాయర్‌లో బోటింగ్‌ సౌకర్యంతోపాటు కట్ట ప్రాంతాన్ని ఉద్యానవనంగా మార్చాలని నిర్ణయించారు. ఇటీవలే రిజర్వాయర్‌ను పరిశీలించడంతోపాటు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు పనులు మొదలు పెట్టారు. 

 40 ఎకరాల్లో ఉద్యానవనం.. 

రిజర్వాయర్‌ కింద పాత చెరువు శిఖం భూమిలో ఉద్యానవనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పాత చెరువును కట్ట లోపల 300 మీటర్ల దూరం పాటు వదిలి కొత్త రిజర్వాయర్‌ బండ్‌ను నిర్మించారు. ఆ స్థలం అమరేశ్వర ఆలయం నుంచి త్రికూటాలయం దాకా మొత్తం 40 ఎకరాల మేర విస్తరించి ఉండగా, మంత్రి ఆదేశాలతో ఇటీవలే చదును చేయించారు. త్వరలోనే 5 నుంచి 10వేల మొక్కలు నాటనున్నారు. సర్పంచ్‌ జానకి, ఉపసర్పంచ్‌ రమేశ్‌, ఎంపీటీసీలు సరోజ, తిరుపతి, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ సలామొద్దీన్‌ ఆధ్వర్యంలో ఏరాట్లను పర్యవేక్షిస్తున్నారు. logo