ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Jagityal - Jul 12, 2020 , 01:30:49

పీవీ కల.. నెరవేరిన వేళ

పీవీ కల.. నెరవేరిన వేళ

  • స్వరాష్ట్రంలో ‘రింగ్‌ రోడ్డు’ సాకారం
  • l1972లో 105 కిలోమీటర్ల రోడ్డుకు శంకుస్థాపన

105 కిలోమీటర్ల రింగ్‌ రోడ్డు.. 65 మూరుమూల గ్రామాలను కలుపుతూ అనుసంధానం.. మంథని నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు మెరుగైన రవాణా సౌకర్యం.. ఇది నాడు మంథని ఎమ్మెల్యేగా ఉన్న పీవీ స్వప్నం! ఆ కలను సాకారం చేసేందుకు సీఎంగా హోదాలో 1972లో శంకుస్థాపన. 1973 తర్వాత ఆయన ఎంపీగా పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లడంతో ఈ రింగ్‌రోడ్డుపై నిర్లక్ష్యం కొనసాగింది. ఆయన తర్వాత ఈ ప్రాంతాన్ని సొంత కాంగ్రెస్‌ నేతలే ఏలినా, చిన్నచూపే కనిపించింది. ఆ 105కిలోమీటర్ల దారిలో కేవలం 40కిలోమీటర్లే పూర్తి చేసి చేతులు దులుపుకోగా, ఆ మహానుబావుడి కలను టీఆర్‌ఎస్‌ సర్కారు సాకారం చేసింది. ఆరేళ్ల క్రితం ఆవిర్భవించిన స్వరాష్ట్రంలో అధికారంలోకి రాగానే మిగతా 65 కిలోమీటర్లు పూర్తి చేసి, బాహ్య ప్రపంచానికి దూరంగా.. కనీసం ఎర్రబస్సు కూడా చూడని గ్రామాల దారి కష్టం తీర్చింది. - పెద్దపల్లి, నమస్తే తెలంగాణ

మంథని నియోజకవర్గంలోని ప్రస్తుత భూపాలపల్లి జిల్లాలోని మారుమూల అటవీ మండలాలైన కాటారం, మహాముత్తారం, మహాదేవపూర్‌, పలిమెల మండలాల్లోని 64 గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా చీకట్లోనే మగ్గారు. కనీస రోడ్డు సౌకర్యం లేక, వాగులపై వంతెనలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిన్నపాటి వర్షం కురిస్తే వాగులు, వంకలు పొంగి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగి వనవాసం చేశారు. ఆ సమయంలో ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్న పీవీ, ప్రజల కష్టాలను కళ్లారా చూసి చలించిపోయారు. ఈ మండలాలను కలుపుతూ 105 కిలోమీటర్ల మేర రింగ్‌ రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి హోదాలో 1972లో రోడ్డు పనులు ప్రారంభించారు. కానీ, ఆయన తర్వాత ఈ ప్రాంతాన్ని ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలేలినప్పటికీ పనిచేయలేకపోయారు. దాదాపు నాలుగు దశాబ్దాల కాలంలో కేవలం 40కిలో మీటర్ల రోడ్డునే నిర్మించి చేతులు దులుపుకున్నారు. 

బిర్జిని సూత్త అనుకోలే.. 

నేను పుట్టి బుద్దెరిగిన కాన్నించి సూత్తున్న. రోడ్డును ముట్టినోడు లేడు. కట్టినోడు లేడు. ఓట్లప్పుడు చేత్తమంటుండె. ఆ తర్వాత మరిచిపోతుండె. పీవీ షురూ చేసిండు గాని ఆ తర్వాత ఎవలూ పట్టించుకోలె. అందుకే మా ఊళ్లు ఇట్ల కాలిపోయినయ్‌. వానకాలం అచ్చిందంటే సాలు కాలు బయటవెట్టరాకుండె. చిన్న పని ఉన్నా చానా పరేషాన్‌ అయ్యేది. నేను ఈ రోడ్డును, బిర్జిని జూత్త అనుకోలే. కానీ, టీఆర్‌ఎస్‌ గవర్నమెంట్ల బిర్జి పూర్తయింది. ఇప్పుడు మాకు ఏ బాధ లేదు. 

స్వరాష్ట్రంలో ఆరేళ్లలోనే పూర్తి.. 

స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రింగురోడ్డుకు పట్టిన గ్రహణం వీ డింది. 2014లో మంథని ఎమ్మెల్యే గా గెలిచిన పుట్ట మధు రింగ్‌ రోడ్డు అంశాన్ని అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే లేవనెత్తారు. ‘మంథని నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఇప్పటికీ ఎర్రబస్సు కూడా చూడని ప్రజలు ఉన్నారు. గ్రామాలకు రవాణా సౌకర్యంలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.’ అని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. నాడు పీవీ శంకుస్థాపన చేసిన రింగ్‌రోడ్డు నిర్మా ణంలో గత పాలకుల నిర్లక్ష్యాన్ని వివరించారు. వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించారు.  పీవీ చేపట్టిన రింగ్‌రోడ్డును పూర్తి చేయాలని నిర్ణయించారు. అందుకు అవసరమైన 155.45 కోట్లు విడుదల చేయించారు. మరోసారి ప్రణాళికలు రూపొందించి, మళ్లీ రోడ్డు నిర్మా ణ పనులు మొదలు పెట్టారు. నాడు కాంగ్రెస్‌ నాయకులు పూర్తి చేయకుండా వదిలివేసిన 65 కిలోమీటర్ల రోడ్డును పూర్తి చేయించారు. దారిలో అవసరమున్న చోట 6 బ్రిడ్జిలు.. 20 వరకు కల్వర్టులు కూడా నిర్మించారు. ఇటీవలే పనులన్నీ పూర్తి కాగా, నాలుగు మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఎంతో మంది సచ్చిపోయిన్రు.. 

వానకాలం అత్తందంటేనే భయమయ్యేది. చుట్టు వాగులు నడుమల మేముండేటోళ్లం. వాన వడ్డదంటే చుట్టూ నీళ్లు చేరుతుండె. రాకపోకలు పూర్తిగా బందైతుండె. నాడు సర్వాయిపేట వాగుదాటుకుంట ఎంతో మంది కొట్టుకపోయిన్రు. కాన్పు కోసం దవఖానకు పోలేక ఎంతో మంది ఆడబిడ్డలు సచ్చిపోయిన్రు. ఈ రోడ్డు కోసం ఎన్నేండ్ల నుంచో ఎదురుజూత్తన్నం. టీఆర్‌ఎస్‌ సర్కారు వచ్చినంకనే రోడ్డు పూర్తయింది. మా బాధలు తీరినయ్‌. చానా సంతోషంగ ఉంది.-మట్టె సమ్మక్క, బూరుగు గూడెం (పలిమెల మండలం) 


logo