గురువారం 01 అక్టోబర్ 2020
Jagityal - Jul 09, 2020 , 01:19:53

రైతు సంక్షేమానికి పెద్ద పీట

రైతు సంక్షేమానికి పెద్ద పీట

ధర్మపురి/ధర్మారం: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని, రైతులకు ఉపయోగపడేలా రైతు వేదికలను నిర్మిస్తున్నదని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లి, ధర్మారం, జగిత్యాల జిల్లా ధర్మపురి, బుగ్గారం మండలాల్లోని జైన, శెకల్ల గ్రామాల్లో రైతు వేదికలకు కలెక్టర్లు సిక్తా పట్నాయక్‌, గుగులోత్‌ రవితో కలిసి మంత్రి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రధానంగా నీటి తీరువా పన్ను రద్దు చేసి రైతులకు తొలి కానుక ఇచ్చారన్నారు. రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు గ్రామాల్లోనే కేంద్రాలను ఏర్పాటు చేసి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి ఈశ్వర్‌ స్పష్టం చేశారు. పలు క్లస్టర్లలో రూ. 22 లక్షలతో ఈ రైతు వేదికలను నిర్మిస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలు, పంట సాగు విధానంపై రైతులకు శిక్షణ ఇచ్చేందుకు, పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ వేదికలు ఉపయోగపడతాయన్నారు. ఆగస్టు 15 నాటికి వేదికల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములై గ్రామాలను హరిత వనాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. కటికెనపల్లిలో గ్రామ ఉప సర్పంచ్‌ రామడుగు గంగారెడ్డితో పాటు పలువురు టీఆర్‌ఎస్‌లో చేరగా వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమాల్లో డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


logo