శనివారం 19 సెప్టెంబర్ 2020
Jagityal - Jul 08, 2020 , 01:56:49

ప్రేమకథ విషాదాంతం

ప్రేమకథ విషాదాంతం

ఇబ్రహీంపట్నం: ఆ ఇద్దరూ ఇంటర్‌ నుంచి ప్రేమించు కున్నారు. కలిసే బతుకుదామనుకున్నారు. కానీ, ఇంతలోనే యువతికి వేరే అబ్బాయితో పెళ్లి కుదిరింది. తన ప్రేమను ఇంట్లో చెప్పలేక, ఏం చేయాలో తెలియక ఆవేదన చెందింది. చివరకు ప్రేమికుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్నది. ఆ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, ఆ యువతి చికిత్స పొందుతూ దవాఖానలో ప్రాణాలు విడిచింది.   ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ అశోక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన మండలోజు ప్రణీత్‌(21), గుండేటి రమ్య(21) ఇంటర్మీడియెట్‌ వరకు కలిసి చదువుకున్నారు. వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఇంటర్‌ పూర్తి చేసిన రమ్య ఇంటి వద్దే ఉంటూ కుట్టు పని చేస్తున్నది. ప్రణీత్‌ డిగ్రీ చదువుతూ అమ్మకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. డిగ్రీ చదువుతూనే మహిళా సంఘాల్లో సీఏగా పనిచేస్తున్నాడు.

వీరి ప్రేమ విషయం తెలియని రమ్య తల్లిదండ్రులు కూతురుకు నెల క్రితం వేరే అబ్బాయితో వివాహం నిశ్చయించారు. ఆగస్టు 6న పెళ్లి చేసేందుకు ఈ నెల 6తేదీన పత్రిక రాసుకున్నారు. ప్రేమించిన వ్యక్తితో వివాహం కావడంలేదని భావించిన రమ్య సోమవారం అర్ధరాత్రి ఇంట్లోంచి బయటికి వెళ్లింది. ఊరు శివారులో రమ్య, ప్రణీత్‌ కలుసుకున్నారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని పురుగుల మందు తాగారు. ఆ తర్వాత ఒకే చెట్టుకు ఉరేసుకున్నారు. ప్రణీత్‌ అక్కడికక్కడే మృతిచెందగా రమ్య వేసుకున్న ఉరి విడిపోవడంతో కింద పడిపోయింది. భయాందోళనకు గురైన ఆమె తన తండ్రి లక్ష్మణ్‌కు ఫోన్‌ ద్వారా విషయం తెలిపింది. దీంతో హుటాహుటిన ఆమెను మెట్‌పెల్లి దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ రమ్య మృతిచెందింది. ఇరు కుటుంబాల  ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అశోక్‌ తెలిపారు.  


logo