ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Jagityal - Jul 06, 2020 , 00:50:11

సామాజిక సేవలో 'హెల్పింగ్‌‌ హ్యాండ్స్‌'

సామాజిక సేవలో 'హెల్పింగ్‌‌ హ్యాండ్స్‌'

జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన డెక్క శ్రవణ్‌, గుమ్మడి రాజశేఖర్‌, కలికోట జగన్‌, సురేశ్‌ చిన్ననాటి మిత్రులు. విద్యాభ్యాసం తర్వాత ఎవరి వృత్తిలో వారు స్థిరపడ్డారు. అయితే రోడ్ల వెంట తిరిగే విధివంచితులు.. అసహాయులు.. అన్నార్తులను చూసి చలించిపోయారు. వారికి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. ముందుగా స్థానికంగా నిరుపేదలకు తోచిన సాయం చేస్తూ ఆదుకుంటూవచ్చారు. అయినా ఏదో వెలితి.  ఈ క్రమంలో 2014లో 20 మం ది యువకులు కలిసి హెల్పింగ్‌ హ్యాండ్స్‌ను స్థాపించారు. అప్పటి నుంచి ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. 

ఒక్క ఫోన్‌ కాల్‌తో సేవలు.. 

సేవా కార్యక్రమాలే కాదు ఆపదలో ఉన్నవారికి అత్యవసర సమయాల్లో రక్తదానం చేస్తున్నారు. రోడ్డు పక్కన దీనావస్థలో అసహాయులున్నారని, గుర్తు తెలియని మృతదేహం ఉందని ఫోన్‌కు సమాచారం వచ్చిన వెంటనే స్పందిస్తారు. శుభకార్యాల్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను సేకరిస్తూ అనాథలకు అందజేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా ఉన్న ప్రస్తుత సమాజంలో ‘స్వయంగా సహాయపడకపోయినా.. కనీసం సంస్థకు సమాచారమిచ్చినా సరే మీ వంతు భాగస్వాములైనట్లేనని’ అంటున్నారు సభ్యులు. ‘ఎక్కడైనా ఎవరికైనా ఏ ఆపద వచ్చినా.. 82976 67639 సెల్‌ నంబర్‌కు ఒక్క ఫోన్‌ కాల్‌ చేయండి చాలు’ అని కోరుతున్నారు. 

సామాజిక బాధ్యతే లక్ష్యంగా.. 

అది 2017 డిసెంబర్‌. జిల్లా కేంద్రంలో అనాథ వృద్ధురాలు అల్లాడిపోతున్నది. గమనించిన సభ్యులు ఆశ్రమంలో చేర్పించారు. అనుకోకుండా ఆమె మృతిచెందగా, రక్త సంబంధీకుల వలె సభ్యులే స్వయంగా అంత్యక్రియలు చేశారు. ‘ఇలా చాలా మంది చనిపోతున్నారు.. వారి పరిస్థితి ఏంటని’ ఆలోచించి.. అప్పటి నుంచి ఎక్కడ ఎవరు మృతిచెందినా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల కోసమే నెలవారీగా కొంత డబ్బు పోగు చేసుకోవడంతో పాటు దాతల సహకారంతో క్రతువును జరిపిస్తున్నారు. ఇప్పటివరకు 114 అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు చేశారు.  

అభాగ్యులకు అయినవారిలా మలివయసులో ఒంటరైన వృద్ధులకు కొడుకుల్లా.. రోడ్ల వెంట తిరిగే మానసిక దివ్యాంగులకు ఆప్తుల్లా.. జగిత్యాల హెల్పింగ్‌ హ్యాండ్స్‌ అండగా నిలుస్తున్నది. నిరాశ్రయులకు నీడనిస్తూనే.. ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడమే కాదు అన్నార్తుల కడుపులు నింపుతున్నది. సంస్థలోని సభ్యులకు ఆదాయ వనరులు అంతంతమాత్రమే అయినా అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నది.    - జగిత్యాల

మేమే అంత్యక్రియలు చేస్తున్నాం.. 

దిక్కూమొక్కూలేని వారు కొందరైతే.. మలివయసులో పిల్లల నిరాదరణతో తల్లిదండ్రులు ఒంటరై, అనాథలుగా మిగులుతున్నారు. వృద్ధాప్యంలో చేరదీసేవారు లేక రోడ్లపై బతుకు వెల్లదీస్తున్నారు. అలాంటి వారు మృతి చెందితే కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడంతో సామాజిక బాధ్యతగా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం. - నల్ల సురేశ్‌, సామాజిక సేవకుడు

సేవే మా బలం...

నిరాశ్రయులకు సేవచేయడమే మా లక్ష్యం. నిత్యం మన చుట్టూ కనిపించే అన్ని సమస్యలకు పరిష్కారం చూపించలేకపోయినా మాకు తోచిన సాయం చేయాలని నిర్ణయించుకున్నాం. హెల్పింగ్‌ హ్యాండ్స్‌లోని సభ్యులవి మధ్య తరగతి కుటుంబాలె. ఆర్థికంగా లేకున్నా, దాతల సహకారంతో రోడ్డుపైన ఉండే విధివంచితులను ఆదుకుంటున్నం, అనాథ శవాలకు అంత్యక్రియలు చేస్తున్నం. అన్నార్తులు, నిరాశ్రయులకు రోజూ భోజనం పెడుతున్నం.  - డెక్క శ్రవణ్‌, హెల్పింగ్‌ హ్యాండ్స్‌ వ్యవస్థాపకుడు

వృద్ధాశ్రమాలు పెట్టాలె.. 

నిరాశ్రయులు, అనాథల కోసం ప్రభుత్వం కొన్ని వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలె. వృద్ధుల కోసం ఎన్ని చట్టాలున్నా అమలు కావడం లేదు. అనాథలుగా మృతిచెందిన వారి వెన్నంటి ఉండి మృతదేహాలకు దహన సంస్కారాలు చేస్తున్నం. ఇందులో దాతల సహకారం మరువలేనిది.- మందాడి సురేశ్‌, జగిత్యాల


logo