శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Jagityal - Jun 28, 2020 , 03:10:17

కేసుల ఛేదనే ధ్యేయంగా ముందుకెళ్లాలి

కేసుల ఛేదనే ధ్యేయంగా ముందుకెళ్లాలి

  • n ఇన్‌చార్జి ఎస్పీ కమలాసన్‌రెడ్డి
  • n పోలీస్ అధికారులతో నేర సమీక్ష

జగిత్యాల క్రైం: పెండింగ్ కేసుల ఛేదనే లక్ష్యంగా ముందుకెళ్లాలని ఇన్‌చార్జి ఎస్పీ, కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ఇనిస్టిట్యూట్‌లో జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ.. నేరస్థులకు శిక్ష పడితే పోలీసులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుందన్నారు. నేరస్థుల గుర్తింపునకు ఆధునిక టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీసీ కెమెరాల పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. భూ తగాదాలు, సివిల్ కేసుల్లో పరిస్థితులు అదుపుతప్పి ఘర్షణలు, హత్యలకు దారితీసే అవకాశం ఉంటే ఇరువర్గాలపై నిఘా ఉంచాలన్నారు. పెట్రోలింగ్, బీట్‌లను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. తరచూ నేరాలకు పాల్పడే నేరస్థులు, రౌడీషీట్, హిస్టరీ షీట్ ఉన్న వారి కదలికలను గమనించాలన్నారు. గతంలో నమోదైన కేసులు, గ్రేవ్, నాన్‌గ్రేవ్ కేసులు.. వాటిపై చేసిన దర్యాప్తు విచారణ స్థితిగతుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు, పురోగతి తెలుసుకున్నారు. నేరస్థులు శిక్ష తప్పించుకోకుండా రికార్డుల నిర్వహణ, సాక్ష్యాధారాల సేకరణ ఉండాలన్నారు. అన్ని స్థాయిల సిబ్బంది, అధికారుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తూ వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. అన్ని పోలీస్‌స్టేషన్లలో థర్మల్ స్క్రీనింగ్ అందుబాటులో ఉంచాలన్నారు.  ఈ సందర్భంగా కమలాసన్‌రెడ్డికి పోలీసు అధికారులు గౌరవ వందనం సమర్పించారు. ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లోని సదుపాయాలు, పరికరాలను పరిశీలించారు. అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తి, డీఎస్పీలు వెంకటరమణ, గౌస్‌బాబా, రామారావు, ప్రతాప్, డీసీఆర్‌బీ, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్లు రాఘవేంద్రరావు, సుధాకర్, ఏవో చంద్రప్రకాశ్, జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. logo