సోమవారం 21 సెప్టెంబర్ 2020
Jagityal - Jun 27, 2020 , 02:25:06

ఊరూరా పండుగలా. .

ఊరూరా  పండుగలా.  .

  • lకరీంనగర్‌ పోలీస్‌ శిక్షణా కేంద్రంలో మొక్కలు నాటిన మంత్రి గంగుల 
  • lచిట్టడవిని సందర్శించిన అటవీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శోభ 
  • lపలు చోట్ల మొక్కలు నాటిన ప్రజా ప్రతినిధులు, అధికారులు 

కరీంనగర్‌, పెద్దపల్లి, నమస్తే తెలంగాణ/జగిత్యాల: ఆరో విడత హరితహారం రెండో రోజూ పండుగలా సాగింది. శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చైతన్యం వెల్లివిరిసింది. కరీంనగర్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌, రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆర్‌ శోభ, సీఐడీ విభాగం ఐజీ ప్రమోద్‌కుమార్‌, కలెక్టర్‌ కే శశాంక, సీపీ కమలాసన్‌ రెడ్డి, చీఫ్‌ ఎంజే అక్బర్‌, మేయర్‌ సునీల్‌ రావు తదితరులు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి కమలాకర్‌ మాట్లాడుతూ, రాబోయే కాలంలో కరీంనగర్‌ వనాలకు చిరునామాల నిల యంగా  నిలుస్తుందని అన్నారు. భవిష్యత్‌ తరాలకు మంచి వాతావరణాన్ని బహుమానంగా అందించాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా పోలీస్‌ శిక్షణ కేంద్రంలో మియావాకి పద్ధతిలో పెంచుతున్న చిట్టడవిని మంత్రి గంగుల, ప్రిన్సిపల్‌ సెక్రటరీ శోభ పరిశీలించి పోలీసులను అభినందించారు. శాంతి భద్రతత పరిరక్షణకే పరిమితం కాకుండా ఇలాంటి సామాజిక సేవలు నిర్వహించడం హర్షణీయమన్నారు. కరీంనగర్‌ ఆర్టీసీ-2 డిపోలో ఆర్‌ఎం పీ జీవన్‌ ప్రసాద్‌ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. హుజూరాబాద్‌ మున్సిపాలిటీ చైర్‌ పర్సన్‌ రాధిక ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని ఆరెపల్లి, చెర్లబూత్కూర్‌ గ్రామాల్లో ఎక్సైజ్‌ శాఖ అధికారులు పెద్ద సంఖ్యలో ఈత మొక్కలు నాటారు. జమ్మికుంట తహసీల్దార్‌ కార్యాలయంలో కలెక్టర్‌ శశాంక హరితహారంపై సమీక్ష నిర్వహించారు. జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి, బుగ్గారం మండలాల్లోని శెకల్ల, యశ్వంతరావుపేటలో కలెక్టర్‌ రవి, జడ్పీటీసీ సభ్యులు బాదినేని రాజేందర్‌, ఇతర ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. మెట్‌పల్లిలో మున్సిపల్‌ అధ్యక్షురాలు సుజాత, కమిషనర్‌, వివిధ వార్డుల్లో మొక్కలు నాటారు. పెద్దపల్లి జిల్లాలో రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని 7వ డివిజన్‌లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, అంతర్గాంలో జిల్లా అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ మొక్కలను నాటారు. రామగుండంలోని పలు డివిజన్లలో మేయర్‌ అనీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు మొక్కలు నాటగా మున్సిపాలిటీల్లో చైర్మన్లు దాసరి మమతారెడ్డి, పుట్ట శైలజ, సునీత ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, మున్సిపల్‌ సిబ్బంది పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ మొక్కలు నాటారు.


logo