మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Jagityal - Jun 10, 2020 , 02:45:15

నియంత్రిత సాగుపై అవగాహన

నియంత్రిత సాగుపై అవగాహన

జగిత్యాల టౌన్‌ : జగిత్యాల మండలం గుల్లపేట గ్రామంలో మంగళవారం పంటల నియంత్రిత సాగు విధానంపై పొలాస ప్రాంతీయ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జన్యు ప్రజనన శాస్త్రవేత్త డాక్టర్‌ శ్రీకాంత్‌ మాట్లాడారు. వరిలో సన్న , దొడ్డు రకాలు, వాటి లక్షణాలు, ఇందులో సన్నరకాలైన తెలంగాణ సోనా, సిద్ధి, జగిత్యాల మసూరి, ప్రాణహిత, బీపీటీ 5204 రకాలను, దొడ్డు రకాలయితే జేజీఎల్‌ 24423, కూనారం సన్నాలు, ఎన్‌టీయూ 1010 రకాలను 50:50 నిష్పత్తిలో సాగు చేయాలని సూచించారు. కందిలో ఉజ్వల, మన్నెలకొండ కంది, రుద్రేశ్వర, వరంగల్‌ కంది -1, తాండూర్‌ తెల్ల కంది రకాలు, సోయా చిక్కుడులో జేఎస్‌ 335, బాసర, జేఎస్‌ 9335 రకాలను సాగు చేయాలని సూచించారు. ఏఈవో రమ్య వరిలో రకాలు, సాగు విధానం, వానకాలం సీజన్‌లో వేసే పంటలు, వాటి మద్దతు ధర గురించి వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్లు డాక్టర్‌ అర్చన, కరుణి, కృష్ణచైతన్య, శ్రీనివాస్‌ నాయక్‌, శ్రావణ్‌కుమార్‌, సత్యనారాయణ, రైతులు తదితరులు పాల్గొన్నారు. 

జీరోటిల్లేజ్‌ మక్క పంట సందర్శన

పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం దత్తత గ్రామమైన జగిత్యాల మండలం గుల్లపేటలో జీరోటిల్లేజ్‌ ద్వారా సాగు చేసిన మక్క పంటను  పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు పరిశీలించారు. మక్క పంటలో కత్తెర పురుగు ఆశిస్తే వేప నూనెను 5 మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటికి కలిపి, స్పెనోటారమ్‌ మందును 0.4 మిల్లీ లీటర్లు కలిపి పిచికారీ చేయాలన్నారు. పంట కోసిన తర్వాత మక్క కట్టెలను భూమిలో మురిగిపోవడానికి సింగిల్‌ సూపర్‌ పాస్ఫేట్‌ ఒక బస్తాను ఒక ఎకరానికి వేయాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్‌ అర్చన, కరుణి, కృష్ణచైతన్య, శ్రీనివాస్‌నాయక్‌, సత్యనారాయణ, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. logo