శనివారం 11 జూలై 2020
Jagityal - Jun 03, 2020 , 04:30:19

అంతర్జాతీయ స్థాయి పారా వాలీబాల్‌లో సింగారపు బాబు సత్తా

 అంతర్జాతీయ స్థాయి పారా వాలీబాల్‌లో సింగారపు బాబు సత్తా

  •  సామాన్య కుటుంబంలో పుట్టి జాతీయస్థాయి క్రీడాకారుడిగా.. 

అతడి ఆటముందు తనకున్న వైకల్యం ఓడిపోయింది. క్రీడాకారుడిగా ఎదగాలన్న పట్టుదలకు తలవంచింది. సామాన్య కుటుంబంలో పుట్టిన రుద్రంగికి చెందిన దివ్యాంగుడు బాబు, వాలీబాల్‌లో సత్తా చాటుతూ జాతీయ స్థాయికి ఎదిగాడు. ఎన్నెన్నో పతకాలు, ప్రముఖుల ప్రశంసలందుకొని యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

రుద్రంగి 

రుద్రంగి మండల కేంద్రానికి చెందిన నిరుపేద సింగారపు నర్సవ్వ, పోశయ్య దంపతుల రెండో కొడుకు బాబు. గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసి, ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఇంటర్‌లోనే మానేశాడు. చిన్నప్పటి నుంచే ఆటలపై ఉన్న మక్కువతో స్థానిక క్రీడాకారుల సాయంతో వాలీబాల్‌లో నైపుణ్యం సాధించాడు. జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నాడు. 2013 సెప్టెంబర్‌ 13, 14 తేదీల్లో చెన్నైలో జరిగిన పారా జాతీయ స్థాయి టోర్నీలో కాంస్య పతకం సాధించాడు. అదే ఏడాది అక్టోబర్‌లో బీహార్‌లోని బుద్ధగయలో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ టోర్నీలో పాల్గొని రజత పతకం, 2014లో జాతీయ వాలీబాల్‌ టోర్నీలో బంగారు పతకం పొందాడు.

2015 డిసెంబర్‌లో జాతీయ స్థాయి సిట్టింగ్‌ వాలీబాల్‌ టోర్నీలో తెలంగాణ రాష్ట్రం తరపున కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2016 జనవరిలో శ్రీలంకలో అంతర్జాతీయ స్థాయి వాలీబాల్‌ జాతీయ క్రీడాకారుడిగా ఆడాడు. 2017లో హైదరాబాద్‌లో జరిగిన వాలీబాల్‌ టోర్నీలో కాంస్య పతకం సాధించాడు. 2018 ఫిబ్రవరిలో థాయిలాండ్‌లో జరిగిన సిట్టింగ్‌ వాలీబాల్‌ టోర్నీలో బంగారు పతకం సాధించాడు. 2019 అక్టోబర్‌లో  థాయిలాండ్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ సిట్టింగ్‌ వాలీబాల్‌ టోర్నీలో రజత పతకం పొందాడు. 2020 ఏప్రిల్‌ 24 నుంచి 30వరకు ఈజిప్ట్‌లోని కైరోలో జరిగే సిట్టింగ్‌ వాలీబాల్‌ ప్రపంచ కప్‌ టోర్నీకి అర్హత సాధించాడు. వాలీబాల్‌తో పాటు క్రికెట్‌, కబడ్డీలోనూ ప్రతిభ చూపి పలు పతకాలు కైవసం చేసుకున్నాడు.  


logo