శనివారం 11 జూలై 2020
Jagityal - Jun 03, 2020 , 04:17:59

సంచారం వీడి..స్వావలంబదిశగా..

సంచారం వీడి..స్వావలంబదిశగా..

  • నిన్నామొన్నటిదాకా చెట్టుకొకరు పుట్టకొకరిలా సంచారజాతులు
  • మోహినికుంటలో స్థలమిచ్చి ఆదుకున్న కల్వకుంట్ల గోపాల్‌రావు
  • జాగ చూపడంతో అంతా ఒక్కచోటుకు
  • సహకార సంఘం ద్వారా రుణాలు
  • చిరు వ్యాపారాలతో ముందుకు..

వారంతా అడవుల్లో నివసించే సంచార జీవులు. అక్కడక్కడా గుడిసెలు వేసుకొని వేటమాంసం.. అటవీ ఉత్పత్తులను అమ్ముకొని జీవించే అమాయకులు. నిన్నామొన్నటిదాకా అడ్రస్‌ అంటూ లేక చెట్టుకొకరు పుట్టకొకరిలా బతికారు. అలాంటివారిని గుర్తించిన ఓ ప్రజాప్రతినిధి, పెద్దమనుసుతో ఆదరించాడు. ఉండేందుకు నీడ, బతికేందుకు దారి చూపి వారి పాలిట దేవుడయ్యాడు. దీంతో వారు సంచార జీవనం వీడి స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నరు. 

 ముస్తాబాద్‌ మండలం మోహినికుంటలో ఎలాంటి చిరునామా లేని సంచార జాతుల (పిట్టలోళ్లు) కుటుంబా లు సుమారు 60దాకా ఉన్నా యి. దాదాపు 240మంది జనాభా ఉండగా వీరంతా జంతువులను వేటాడుతూ అడవిలో దొరికినవాటిని విక్రయిస్తూ పొట్టపోసుకునేవారు. వీరి దీనస్థితిని గుర్తించిన గ్రామానికి చెందిన రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ కల్వకుంట్ల గోపాల్‌రావు చలించిపోయారు. గ్రామ శివారులో ఐదెకరాల స్థలం ఇచ్చి ప్రతి కుటుంబానికీ 200 గజాల ఇంటి జాగను అందించి కరెంటు, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించారు. 

ఉపాధికి ‘సహకారం’

సంచార జాతులవారు స్వయం ఉపాధి పొందేందుకు వారికి పోత్గల్‌ సహకార సంఘం ద్వారా రుణాలు ఇప్పించారు. తక్కువ వడ్డీతో రుణం పొందిన వారు సీజనల్‌ వ్యాపారం చేస్తున్నారు. మామిడికాయలు, సీతాఫలాలు, అరటి, ఆపిల్‌ను విక్రయిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. వీరికి ముస్తాబాద్‌, సిద్దిపేట పట్టణాల్లో మార్కెటింగ్‌ అవకాశాలను సైతం కల్పిస్తున్నారు. మహిళలకు ఐకేపీ రుణాలు ఇవ్వగా వాటి ద్వారా వారు కంకుల వ్యాపారం చేస్తున్నారు. రెండేళ్లుగా వీరి జీవనంలో ఆశించిన మార్పు కనిపిస్తున్నది. సంచార జాతుల కుటుంబాల్లో యువకులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. వీరికి స్వయం ఉపాధిపై ఎప్పటికప్పుడు సర్పంచ్‌ కల్వకుంట్ల వనజ, ఆర్బీఎస్‌ కో ఆర్డినేటర్‌ గోపాల్‌రావు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.

మోడల్‌ కాలనీగా.. 

మోహికుంటలోని పిట్టలోళ్ల కాలనీ ఇప్పుడు మోడల్‌ కాలనీగా అభివృద్ధి చెందుతున్నది. ఐదెకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ప్లాట్ల మధ్య హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. డ్రైనేజీకి, కరెంట్‌ సరఫరాకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ సహకారంతో ఇక్కడ డబుల్‌ బెడ్‌రూమ్‌లు కట్టేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయగా ఇందుకు అమాత్యుడు సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. 


logo