శనివారం 26 సెప్టెంబర్ 2020
Jagityal - May 31, 2020 , 03:59:55

దరఖాస్తుదారులకే అనుమతి

దరఖాస్తుదారులకే అనుమతి

‘కరీంనగర్‌-ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లోకి వివిధ పనుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే అనుమతి ఇస్తున్నాం. దళారులు, ఏజెంట్ల రాక పోకలను పూర్తిగా నిలిపివేసి పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నాం. వాహనాలను ఇష్టారాజ్యంగా నడుపుతూ.. దురుసుగా ప్రవరిస్తున్న వారిని పట్టుకునేందుకు, ఓవర్‌లోడ్‌ నివారణకు స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాం. ఆర్టీసీ బస్సులైనా సరే వదిలే ప్రసక్తే లేదు. నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ హైర్‌ బస్సుపై శనివారం కేసు నమోదు చేశాం. కరోనా కట్టడి కోసం ఆర్టీఏ కార్యాలయ పరిధిలో ఫెడస్ట్రల్‌ శానిటైజర్‌ ఏర్పాటు చేయడంతో పాటు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నాం.’ అని కరీంనగర్‌- ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ డాక్టర్‌ పుప్పాల శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, రవాణా శాఖలో జరుగుతున్న మార్పులు.. కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు.. భవిష్యత్‌ మార్పుల వంటి అంశాల గురించి వివరించారు.

ర్యాష్‌ డ్రైవింగ్‌పై ఫోకస్‌..

ఎదురుగా వాహనం వచ్చేటప్పుడు ఓవర్‌టేక్‌ చేయవద్దన్న సెన్స్‌ లేకుండానే కొంత మంది ర్యాష్‌ డ్రైవింగ్‌చేస్తున్నారు. దీని వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే అన్ని రకాల డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించాం. అయినా కొంత మంది ర్యాష్‌గా వెళ్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. దీనిపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా శనివారం నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ హైర్‌ బస్సు (టీఎస్‌ 24టీ 5473) నర్సంపేట టూ నిజామాబాద్‌ వెళ్తూ కొండగట్టు వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌టేక్‌ చేస్తున్న సమయంలో పట్టుకున్నాం. బస్సు డ్రైవర్‌ తప్పిదం వల్ల అక్కడ పెనుప్రమాదం జరిగేది. కానీ, ఎదురుగా వచ్చే కారు డ్రైవర్‌ చాకచక్యంగా తీసుకున్న నిర్ణయంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. అందుకే సంబంధిత డ్రైవర్‌ లైసెన్స్‌ను రద్దుచేయడంతోపాటు.. కేసు నమోదు చేశాం. ఇదే కాదు, ఈ తరహా ర్యాష్‌ డ్రైవింగ్‌లన్నింటిపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. అత్యంత స్పీడ్‌ ఎప్పటికైనా ప్రమాదమే. ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారం నడుచుకుంటే ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. 

కరోనాపై కట్టుదిట్టం..

కరీంనగర్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల్లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాలు ప్రస్తుతం యథావిధిగా నడుస్తున్నాయి. అన్ని రకాల స్లాట్‌లు బుక్‌చేసుకునే అవకాశం కల్పించాం. ఆ మేరకు వచ్చి వెళ్లే వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. దీంతో అన్ని కౌంటర్ల వద్ద భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దీంతోపాటు.. వివిధ పనుల కోసం వచ్చే వారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నాం. ఏమాత్రం అనుమానం ఉన్నా.. సదరు వ్యక్తుల సమాచారం వైద్య, ఆరోగ్య శాఖకు అందిస్తున్నాం. అలాగే కౌంటర్‌ వద్దకు వచ్చే వ్యక్తులకు కరోనా నివారణ కోసం ఫెడస్ట్రల్‌ శానిటైజర్లను శనివారం నుంచి అందుబాటులోకి తెచ్చాం. కార్యాలయంలోనూ భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేశాం. హెల్మెట్‌ లేకుండా కార్యాలయం వద్దకు వాహనదారులను అనుమతించడం లేదు. ఆటో డ్రైవర్లకు శానిటైజర్‌ కిట్లు ఇచ్చాం. నిబంధనల ప్రకారం మాత్రమే ప్రయాణికులను తీసుకెళ్లాలని ఇప్పటివరకు ఆటోలకు, క్యాబ్‌ డ్రైవర్లకు, యజమానులకు అవేర్నెస్‌ కల్పించాం. ఇక నుంచి ఎవరూ నిబంధనలకతీతంగా ప్రయాణికులను తీసుకెళ్లినా సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదుచేస్తామని హెచ్చరిస్తున్నాం. దయచేసి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

స్లాట్‌ బుక్‌చేసిన వారికే అనుమతి..

అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో దరఖాస్తుదారులకు మాత్రమే అనుమతి ఇస్తున్నాం. దళారులు, ఏజెంట్లను ఏమాత్రం రానివ్వడం లేదు. కార్యాలయంలోకి వచ్చే ఆరంభంలోనే.. పూర్తి వివరాలు పరిశీలించి స్లాట్‌ బుక్‌చేసిన వ్యక్తులకు మాత్రమే అనుమతి ఇస్తున్నాం. 54 రకాల సేవలు ఆర్టీఏ కార్యాలయాలు అందిస్తున్నాయి.  ఇందుకోసం ఏర్పాటుచేసిన ప్రతికౌంటర్‌వద్ద సంబంధిత వ్యక్తులు మాత్రమే ఉండేవిధంగా చర్యలు తీసుకున్నాం. 

కరీంనగర్‌లో టోకెన్‌ విధానం.. 

కరీంనగర్‌ ఆర్టీఏ కార్యాలయంలో త్వరలో టోకెన్‌ విధానాన్ని అమల్లోకి తెస్తున్నాం. ఇందుకు కోసం కసరత్తు జరుగుతున్నది. దీని ద్వారా వినియోగదారులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వివిధ పనుల కోసం వచ్చే వారికి వారి కౌంటర్ల పరిధిలో బ్యాంకుల మాదిరిగా ముందుగా టోకెన్లు జారీ చేస్తారు. సంబంధిత వ్యక్తి సీరియల్‌ నంబర్‌ వచ్చినప్పుడు అనౌన్స్‌ చేస్తారు. దీని ద్వారా కౌంటర్ల వద్ద నిలబడే ఇబ్బంది ఉండదు. సంబంధిత వ్యక్తులకు సమయం కూడా కలిసి వస్తుంది. ఇంకా అనేక ప్రయోజనాలుంటాయి.


logo