గురువారం 01 అక్టోబర్ 2020
Jagityal - May 31, 2020 , 04:00:00

జూన్‌ 20 లోగా తాగునీరందించాలి

జూన్‌ 20 లోగా తాగునీరందించాలి

హుజూరాబాద్‌టౌన్‌ : వచ్చే నెల 20వ తేదీలోగా మిషన్‌ భగీరథ పథకం ద్వారా గ్రామాల్లో ఇంటింటికీ నల్లా నీరు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు. శనివారం హుజూరాబాద్‌ పట్టణం కేసీ క్యాంప్‌లోని మంత్రి క్యాంప్‌ ఆఫీస్‌లో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో జరుగుతున్న మిషన్‌ భగీరథ పనుల పురోగతిపై కలెక్టర్‌ శశాంకతో కలిసి ఇంజినీరింగ్‌, మున్సిపల్‌ అధికారులు, పాలకవర్గ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో వచ్చే నెల 20 వరకు పనులు పూర్తి చేసి, పలుమార్లు ట్రయల్‌ రన్‌ నిర్వహించాలన్నారు. ఎక్కడెక్కడ వాటర్‌ లీకేజీలు ఉన్నాయో? గుర్తించి బాగు చేయాలని సూచించారు. అలాగే రెండు మూడు నెలల్లో హుజూరాబాద్‌, జమ్మికుంట మున్సిపల్స్‌ పరిధిలో పనులన్నీ పూర్తి చేసి గడప గడపకూ తాగునీరు అందించాలన్నారు. పనుల వల్ల రోడ్లు చెడిపోయిన చోట, పైపు లైన్లు పగిలిన చోట కొత్తగా ఏర్పాటు చేసుకునేందుకు నిధుల కోసం ప్రణాళికలను తయారు చేసి వారంరోజుల్లోగా తనకు అందజేయాలని అధికారులకు సూచించారు. పనుల్లో నాణ్యతలేకపోయినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో నడుచుకొని గ్రామాల, పట్టణాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. సీఎం కేసీఆర్‌ కలలుగన్న బంగారు తెలంగాణ అవతరించడానికి ఎంతో దూరం లేదని, అందరూ అంకితభావంతో, నిజాయితీగా పని చేసినప్పుడే అది సాధ్యమవుతుందన్నారు. త్వరలోనే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌ పర్యటన ఉంటుందని అధికారులకు సూచనప్రాయంగా తెలిపారు. ఇక్కడ జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, మిషన్‌ భగీరథ ఎస్‌ఈ సీహెచ్‌ అమరేంద్ర, కరీంనగర్‌, హుజూరాబాద్‌ ఈఈలు ఉప్పలయ్య, చల్మారెడ్డి, డీఈఈలు వసియొద్దీన్‌, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

డెలివరీల సంఖ్య పెరగడంపై అభినందనలు

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలోని 30 పడకల దవాఖానలో మే నెలలో 51 డెలివరీలు జరగడంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అనితారెడ్డి, వైద్యులను, సిబ్బందిని అభినందించారు. శనివారం సాయంత్రం హుజూరాబాద్‌లోని కేసీ క్యాంప్‌లోని మంత్రి క్యాంప్‌ ఆఫీస్‌లో కేక్‌ కట్‌ చేసి సూపరింటెండెంట్‌కు తినిపించారు. హుజూరాబాద్‌, జమ్మికుంట దవాఖానల్లో మరింత వైద్య సేవలను అందించాలని మంత్రి వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్‌ ఏరియా దవాఖాన సూపరింటెండెంట్‌ వాడె రవిప్రవీన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్‌, నాయకులు గందె శ్రీనివాస్‌ రాపర్తి శివ, రహీం పాల్గొన్నారు.logo