గురువారం 01 అక్టోబర్ 2020
Jagityal - May 30, 2020 , 03:07:06

దేశానికి అన్నం పెట్టేది మనమే

దేశానికి అన్నం పెట్టేది మనమే

హుజూరాబాద్‌ రూరల్‌: సువిశాల భారత దేశానికి అన్నం పెట్టేది తెలంగాణ రైతే అని, 57లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండిస్తున్న ఘనత మన రాష్ర్టానికే దక్కిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణ సమీపంలోని మధువని గార్డెన్‌లో నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, గ్రామ, మండల, జిల్లా రైతుబంధు సమితులతో సమగ్ర, సుస్థిర వ్యవసాయ ప్రణాళికపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని రైతుల అభివృద్ధి కోసమే ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని రూపొందించిందన్నారు. దేశంలోనే ధాన్యం, సీడ్‌ పండించడంలో తెలంగాణను మొదటి స్థానంలో నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దీని కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉందన్నారు. సర్కార్‌ వ్యవసాయంలో తీసుకువస్తున్న మార్పులు రైతుల ఆత్మగౌరవం పెంచడానికేనని, వీటికి అందరూ సహకరించాలని కోరారు. సన్నరకాల వరి ధాన్యం పండించి ధర కూడా రైతే నిర్ణయించే స్థాయికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఇక నుంచి కాకతీయ కాలువలో 365రోజులు నీళ్లు పారుతాయని, మార్చి 31లోగానే రెండు పంటలు పండించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నమని వెల్లడించారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఎవరికి వారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 

రైతును రాజు చేయడమే లక్ష్యం: వినోద్‌

తెలంగాణలో రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పథకాలు ప్రవేశపెడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోళ్లలో నష్టం వచ్చినా ప్రభుత్వం రైతుకు లాభం చేస్తున్నదన్నారు. రైతుల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులతో కలిసి నియంత్రిత వ్యవసాయ ప్రణాళిక రూపొందించారని పేర్కొన్నారు. కలెక్టర్‌ శశాంక మాట్లాడుతూ జిల్లాలో 3,25,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయగా, ఇందులో 63వేల మెట్రిక్‌ టన్నులు హుజూరాబాద్‌ డివిజన్‌ నుంచి సేకరించామని తెలిపారు. సమగ్ర వ్యవసాయ విధానానికి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.  కార్యక్రమంలో ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌, ఏడీఏ ఆదిరెడ్డి,  వ్యవసాయ మార్కెట్‌ కమిటీల చైర్మన్లు, సింగిల్‌ విండో చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


logo