గురువారం 01 అక్టోబర్ 2020
Jagityal - May 29, 2020 , 01:33:23

ఐతారం.. మాంసం, మద్యం బంద్‌

ఐతారం.. మాంసం, మద్యం బంద్‌

పెద్దాపూర్‌లో అనాదిగా వస్తున్న ఆచారం 

బంధువులు వస్తే ఊరి బయటే మర్యాదలు 

శుభకార్యాలైనా అనుమతి లేదు

ఆదివారం వచ్చిందంటే చికెన్‌, మటన్‌ తెచ్చుకుని కుటుంబ సభ్యులతో కలిసి తినాలనుకోవడం సహజమే. కానీ, ఆ గ్రామంలో మాత్రం ముక్క ముట్టరు.. మద్యం దరిదాపుల్లోకి వెళ్లరు.. బంధువులు వచ్చినా మర్యాదలు చెయ్యాలంటే ఊరి నుంచి బయటకు వెళ్లాల్సిందే. ఆదివారం వివాహాలను నిశ్చయించుకున్నా.. శుభకార్యాలున్నా మద్యం, మాంసం అనుమతి ఉండదు.. అనాదిగా వస్తున్న ఆచారంగా పాటిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని పెద్దాపూర్‌ గ్రామస్తులు. - మారుతీనగర్‌

పెద్దాపూర్‌లో యాదవుల ఆరాధ్య దైవం మల్లన్న ఆలయం పురాతనమైంది. ఇది నిర్మించినప్పటి నుంచి గ్రామంలో పూర్వీకులు ప్రతి ఆదివారం మద్యం, మాంసం నిషేధించారు. ఈ వారం మల్లన్నకు ఇష్టమైన రోజు కావడంతో గ్రామస్తులు నిష్ఠతో ఉండి ప్రత్యేకపూజలు జరుపాలని కట్టడి చేశారు. ఏ కుటుంబంలోకైనా బంధువులు వస్తే ఇక్కడి ఆచారం ప్రకారం మద్యం, మాంసం అందుబాటులో ఉండదు. ఇంటిలోనూ వండరు. ఏవైనా మర్యాదలు చేయాలంటే సమీప గ్రామానికి వెళ్లాల్సిందే. ఎవరైనా ఈ ఆచారాన్ని అతిక్రమించితే అనర్థాలు జరుగుతాయని గ్రామస్తుల విశ్వాసం. కాగా, మల్లన్న దేవాలయ నిర్మాణం జరిగి వందల ఏళ్లు గడుస్తున్నా గ్రామస్తులు తూ.చా తప్పకుండా ఆచారాన్ని పాటిస్తున్నారు. ఈ నమ్మకం వల్లనే ప్రతీ సంవత్సరం బోనాల జాతరకు భక్తుల సంఖ్య పెరుగుతున్నదని విశ్వసిస్తున్నారు. ఏటా కాముడి పౌర్ణమి (ఫాల్గ్గుణ) మొదటి ఆదివారం రోజున బోనాల జాతరకు ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. అంతే కాకుండా కులమతాలకు అతీతంగా మొక్కులు తీర్చుకుంటారు. 

గుడి కట్టినప్పటి నుంచి ఊరి కట్టడి 

మా ఊరిలో మల్లన్న గుడి కట్టినప్పటి నుంచి ఎవరు కూడా ఆదివారం కల్లు తాగవద్దని, కూర తినద్దన్న కట్టడి ఉన్నది. అప్పటి ఊరి పెద్దలు ఆచారంగా భావిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు  ఊరిలో ఎవరు కూడా కల్లు ముట్టరు. కూర తినరు. ఊళ్లో వాళ్లందరికీ మల్లన్న దయతో అంతా మంచి జరుగుతున్నది. మల్లన్నకు మొక్కులు అప్పజెప్పడానికి ఏటేటా భక్తులు పెరుగుతున్నరు. 

- ఎన్నమేని శ్రీనివాస్‌,గ్రామస్తుడుlogo